Begin typing your search above and press return to search.

ఫేస్‌ బుక్‌ వాడాల‌న్నా ఆధార్ ఉండాల్సిందే?!

By:  Tupaki Desk   |   27 Dec 2017 9:15 AM GMT
ఫేస్‌ బుక్‌ వాడాల‌న్నా ఆధార్ ఉండాల్సిందే?!
X
ఆధార్‌....బ్యాంకు అకౌంట్ - మొబైల్ నంబర్లు - పాన్ కార్డు... ఇలా చెప్పుకుంటూ పోతే ఇప్పుడు దేశంలోని ప్రజలు ఆధార్ కార్డును చాలా సేవలకు లింక్ చేయాల్సి ఉంది. ఈ ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు. కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలోనే ఆయా సేవలకు గాను ఆధార్ లింకింగ్‌ కు నిర్దిష్టమైన గడువులు కూడా నిర్ణయించారు. అయితే ఇవే కాకుండా ఇకపై ఫేస్‌ బుక్ వాడాలన్నా ఆధార్ ఉండాల్సిందేనట. ఏంటీ షాకయ్యారా..? అయినా ఇది నిజమే. అయితే ఫేస్‌ బుక్‌ కు ఆధార్‌ ను లింక్ చేయాల్సిన పనిలేదు. మరి ఎలా అంటారా..? అయితే ఇది చదవండి - మీకే తెలుస్తుంది..!

ఫేస్‌ బుక్ అంటేనే అది సోషల్ మీడియాలో ఒక మహా ప్రపంచం. ఎంతో మంది తమ రియల్ పేర్లు కాకుండా నకిలీ పేర్లతో పుట్టలు పుట్టలుగా అకౌంట్లు ఓపెన్ చేస్తుంటారు. ఒక్క మన దేశంలోనే దాదాపుగా 24.1 కోట్ల నకిలీ ఫేస్‌ బుక్ ఖాతాలు ఉన్నట్లు ఫేస్‌ బుక్ గుర్తించింది. అయితే ఫేస్‌ బుక్ అకౌంట్లను వాడేవారందరూ తమ తమ అసలైన పేర్లనే వాడేందుకు ఫేస్‌ బుక్ త్వరలో ఒక కొత్త ఫీచర్‌ ను అందుబాటులోకి తేనుంది. దాని పేరే ''Name as per Aadhaar''. ఫేస్‌ బుక్ ప్రస్తుతం ఈ ఫీచర్‌ను అంతర్గతంగా టెస్ట్ చేస్తున్నది. ఇప్పటికే పలువురు ఎంపిక చేసిన యూజర్ల ద్వారా ఈ ఫీచర్‌ ను పరిశీలిస్తోంది. సదరు యూజర్లకు ఈ ఫీచర్ ప్రాంప్ట్ అవగానే వారు తమ ఆధార్ కార్డులో ఉన్న ఫస్ట్ నేమ్ - సర్ నేమ్‌ లను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అయితే ఈ ఫీచర్ ఆప్షనల్ మాత్రమే. యూజర్లు కచ్చితంగా వివరాలను ఎంటర్ చేయాల్సిన పనిలేదు. తాము ఇప్పటికే కొనసాగిస్తున్న ఫేస్‌ బుక్ పేర్లను అలాగే వాడుకోవచ్చు. కాకపోతే రియల్ పేర్లను వాడేవారు ఈ ఫీచర్‌ ను ఉపయోగించుకోవచ్చు. దీంతో ఆధార్‌ లో ఉన్న పేరును ఫేస్‌ బుక్‌ లో వాడుకునేందుకు వీలుంటుంది.

అయితే ఫేస్‌ బుక్ తీసుకురానున్న ఈ ఫీచర్ ద్వారా యూజర్లు తమ ఆధార్ కార్డులను ఫేస్‌ బుక్ అకౌంట్‌ కు లింక్ చేయాల్సిన పనిలేదు. కాకపోతే కార్డులో ఉన్న పేరును అకౌంట్‌ లో యాడ్ చేస్తే చాలు - మిగిలిన వివరాలను లింక్ చేయాల్సిన పనిలేదు. దీంతో యూజర్ల ఆధార్ సమాచారం ఫేస్‌ బుక్‌ కు చేరే అవకాశం ఉండదు. అలా ఆ స‌మాచారం భ‌ద్రంగా ఉంటుంది. దీనిపై ఆందోళ‌న చెందాల్సిన ప‌ని ఉండ‌దు. అయితే ఈ ఫీచర్‌ ను ఎప్పుడు అందుబాటులోకి తెస్తారు అన్న వివరాలను మాత్రం ఫేస్‌ బుక్ వెల్లడించలేదు. టెస్టింగ్ దశలో ఉన్నందున త్వరలో యూజర్లకు లభ్యమయ్యే అవకాశం ఉంది.