Begin typing your search above and press return to search.

తిరుప‌తి వెళ్తే ఆధార్ త‌ప్ప‌క తీసుకువెళ్లండి

By:  Tupaki Desk   |   24 Jun 2017 7:34 AM GMT
తిరుప‌తి వెళ్తే ఆధార్ త‌ప్ప‌క తీసుకువెళ్లండి
X
సర్వం ఆధార్ మ‌యం అయిపోతున్న ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో..దేవాల‌యాల్లో కూడా ఆధార్ ఉప‌యోగించేందుకు ముందడుగు వేస్తున్నారు. క‌లియుగ దైవం వెంక‌టేశ్వ‌రుడిని సంద‌ర్శించుకోవాల‌న్నా ఆధార్ త‌ప్ప‌నిస‌రి. తిరుమలలో జూలై 1 నుంచి బ్రేక్‌ దర్శనం కోసం ఆధార్‌ కార్డు జిరాక్స్‌ కాపీని జతచేయాలని, బ్రేక్‌ దర్శన సమయంలో భక్తులు ఆధార్‌ను వెంట తీసుకురావాలని తిరుమల జేఈవో శ్రీనివాసరాజు కోరారు. శ్రీవారి దర్శనం - బస - లడ్డూ ప్రసాదం తదితర సేవల్లో మరింత పారదర్శకంగా సేవలందిం చేందుకు, భద్రతా పరమైన ఇబ్బందులు రాకుండా చూసేందుకు భక్తులు ఆధార్‌ ను వినియోగించి టీటీడీ యాజమాన్యానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

నూత‌న ఈవో ఏకే సింఘాల్‌ సూచన మేరకు ఇటీవల శ్రీవారి ఆలయంలోని వెండి వాకిలి వద్ద చేపట్టిన స్వల్ప మార్పులు సత్ఫలితాలను ఇస్తున్నాయని, భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారని జేఈఓ తెలిపారు. వైకుంఠం క్యూ కాంప్లెక్సు-1 లో అదనంగా మరుగుదొడ్లు - ఫ్యాన్‌ లు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. భక్తుల రద్దీకి అనుగుణంగా అన్నప్రసాదాలను పెంచుతున్నట్లు వివరించారు. లక్కీడిప్‌ లో ఉంచిన 10,710 శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు గాను 96,837 మంది భక్తులు నమోదు చేసుకున్నారని జేఈవో తెలిపారు. శుక్రవారం ఆన్‌ లైన్‌ లో లక్కీడిప్‌ తీశామని, టికెట్లు పొందిన భక్తులందరికి ఎస్‌ ఎమ్మెస్‌ - ఈ-మెయిల్‌ ద్వారా సమాచారాన్ని తెలియచేశామని వెళ్ళడించారు. ఆన్‌ లైన్‌ డిప్‌ లో టికెట్లు ఖరారైన భక్తులు జూన్‌ 30 వ తేది మధ్యాహ్నం 12 గంటల వరకు టీటీడీ వెబ్‌ సైట్‌ పేమెంట్‌ గేట్‌ వే ద్వారా నగదు చెల్లించవచ్చన్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/