Begin typing your search above and press return to search.

ఏపీలో రెచ్చిపోతున్న ఆధార్ మాఫియా .. ఏదైనా క్షణాల్లో మార్పు !

By:  Tupaki Desk   |   31 Oct 2020 7:00 AM IST
ఏపీలో రెచ్చిపోతున్న ఆధార్ మాఫియా .. ఏదైనా క్షణాల్లో మార్పు !
X
ఆధార్ .. ప్రస్తుతం దేశంలో బర్త్ సర్టిఫికెట్ నుండి డెత్ సర్టిఫికెట్ వరకు ఏది కావాలన్నా కూడా ఆధార్ తప్పనిసరి. గ్యాస్ , బ్యాంక్ , అలాగే ప్రభుత్వం పథకాలు మనకి అమలు కావాలన్నా కూడా ఆధార్ చాలా ముఖ్యం. దీనితో కొందరు తమ అవసరాలను తీర్చుకోవడానికి , ప్రభుత్వ పథకాల్ని పొందటానికి ఆధార్ లో మార్పులు చేస్తున్నారు. నిజంగా మార్పులు చేయాల్సి వస్తే .. సరైన పత్రాలు ఉంటే , ఆధార్ కేంద్రం కి వెళ్తే చేస్తారు. కానీ, ఆధార్ లో పేరు , అడ్రస్ , డేట్ అఫ్ బర్త్ ఇలా ఏది మార్చాలన్నా , అసలు ఎటువంటి పత్రాలు లేకుండానే డబ్బులు తీసుకోని మార్చేస్తున్నారు. అనర్హులను ప్రభుత్వ పథకాలకు అర్హులుగా మారుస్తున్న ముఠాలు ఈ రెండు నెలల కాలంలో ఆరు చోట్ల పోలీసులకు చిక్కాయి. సుమారు 55 మంది అరెస్టయ్యారంటేనే రాష్ట్రంలో ఈ దందా ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

ఆధార్‌ కార్డుల్లో ఇష్టానుసారంగా మార్పులు చేస్తున్న ముఠాలు ఆంధ్రప్రదేశ్ ‌లో చాలానే పుట్టుకొస్తున్నాయి. ఇలా చేస్తూ నెలన్నర క్రితం అనంతపురంలో.. ఆ తర్వాత గుంటూరు అర్బన్ ‌లో‌, శ్రీకాకుళంలో మరో గ్యాంగ్‌ పట్టుబడింది. ఏలూరు టూ టౌన్‌ పోలీసులు కూడా ఒక ముఠాను పట్టుకున్నారు. వీళ్లందరినీ విచారించగా ఇవన్నీ సంక్షేమ పథకాల కోసమే చేస్తున్నారని వెల్లడైంది. ఆధార్‌ సవరణలు యూఐడీఏఐ అనుమతితో తప్ప ప్రైవేటు వ్యక్తులు చేయరాదు. కానీ.. ఈ ముఠాలు వ్యక్తి పేరు, తండ్రిపేరు, అడ్రస్‌, పుట్టిన తేది ఏదైనా మార్చేస్తున్నారు. ఆఖరికి ఫొటోలు సైతం మార్చేస్తున్నారు.

అనంతపురం జిల్లా పుట్లూరులో జరుగుతున్న ఈ భాగోతం గురించి నెల రోజుల క్రితం ఎస్పీ సత్య యేసుబాబుకు సమాచారం అందింది. రంగంలోకి దిగిన పోలీసులు తాడిపత్రి, గుంతకల్లు ప్రాంతానికి చెందిన ఐదుగురు సభ్యుల ముఠా బయటి నుంచి మరో ముగ్గురి సహకారంతో మొత్తం 800 మంది ఆధార్‌ వివరాలు మార్చేసినట్లు గుర్తించారు. దీనికి మూలాలు బెంగళూరులో ఉన్నట్లు సమాచారం సేకరించారు. ఆధార్‌ మార్పుల కోసం డబ్బులు తీసుకుని 45 ఏళ్ల వయసున్న వారికి 62 సంవత్సరాలుగా మార్చి పింఛన్ వచ్చేలా చేశారు. బెంగళూరులోని యూనిక్‌ ఐడెంటిఫికేషన్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (యూఐడీఏఐ)ను సంప్రదించిన అనంత పోలీసులు తాడిపత్రి, గుంతకల్లు ప్రాంతంలోనే వందలాది మంది ఆధార్‌ అడ్ర్‌సలు, ఇతర వివరాలు మారినట్లు పసిగట్టారు. తాజాగా కర్నూలు.జిల్లాలో పది గ్రామ సచివాలయాల్లో ఆధార్‌ మార్పుల దరఖాస్తులు 200కు పైనే ఉన్నట్టు గుర్తించారు. రూ.5 వేలు తీసుకుని ఆధార్‌లో మార్పులు చేస్తూ ఆదోని, బనగానపల్లె, నందవరం పోలీస్‌ స్టేషన్ల పరిధిలోనే 30 మంది పట్టుబడ్డారు.ఈ ముఠా సంబంధిత అధికారుల గెజిటెడ్‌ హోదాతో బయట రబ్బర్‌ స్టాంపులు తయారు చేయించి, నకిలీ లెటర్లు సృష్టించి ఆధార్‌ వివరాలను ప్రణాళికా బద్ధంగా మార్చేస్తోంది.

మైక్రోసాఫ్ట్‌ పెయింట్‌ యాప్‌ ద్వారా ఈ ముఠాలు నకిలీ పాన్‌కార్డులను సృష్టిస్తాయి. నెట్‌లో ఎవరో ఒకరి పాన్‌కార్డు డౌన్‌లోడ్‌ చేసుకుని ఫోటో, పుట్టిన తేదీ, ఇతరత్రా అవసరమైన వివరాలు యాప్‌ ద్వారా మార్చేస్తారు. ఎవరి ఆధార్‌ కార్డు మార్చాలో వారి పేరుతో ఏవేవి మార్చాలో వాటిని ఈ కార్డు ఆధారంగా యూఐడీఏఐలో సమర్పిస్తారు. ఆ తర్వాత మార్పులతో కోరుకున్న విధంగా ఆధార్‌ కార్డు ఇచ్చేస్తారు. దీనితో వారు అనర్హులు అయినప్పటికీ , వారికి ప్రభుత్వ పథకాలు అమలు అవుతున్నాయి. యూఐడీఏఐ కేంద్రాలపై పర్యవేక్షణ పెంచాల్సిన అవసరం ఉందని డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ అభిప్రాయపడ్డారు. పోలీసులకు ఏ చిన్న సమాచారం అందినా ముఠాల ఆట కట్టిస్తున్నామని, అందులో భాగమే అనంతపురం, కర్నూలు, గుంటూరు, తిరుపతి, ఏలూరు, శ్రీకాకుళం కేసులని స్పష్టం చేశారు. తప్పుడు పనులు చేస్తే జైలుకు వెళ్లక తప్పదని ముఠాలను డీజీపీ సవాంగ్‌ హెచ్చరించారు.