Begin typing your search above and press return to search.

ఏంది ఒక ఫ్రాంక్ వీడియోకే ఇంత రచ్చ అవుతుందా?

By:  Tupaki Desk   |   1 Jun 2021 6:00 AM IST
ఏంది ఒక ఫ్రాంక్ వీడియోకే ఇంత రచ్చ అవుతుందా?
X
జూబ్లీహిల్స్ పోలీసులకు ఒక యువకుడు ఇచ్చిన ఫిర్యాదు ఇప్పుడు ఆసక్తికరంగానే కాదు.. ఇలా కూడా జరుగుతుందా? అన్న విస్మయానికి గురి చేసేలా ఉంది. ఫ్రాంక్ వీడియోల్లో నటించే ఈ యువకుడు.. కొద్దికాలం క్రితం ఒక వీడియోలో ‘గే’ పాత్రను పోషించాడట. అప్పటి నుంచి తనకు ఎదురవుతున్న చేదు అనుభవాల గురించి ఏకరువు పెడుతున్నాడు ఏసుబాబు.

క్రిష్ణా జిల్లాలోని నందబాడుకు చెందిన ఇతగాడు కొన్నేళ్ల క్రితం హైదరాబాద్ కు వచ్చాడు. నటన మీద ఇష్టంతో నగరానికి వచ్చిన ఇతను.. ప్రస్తుతం సినీ పరిశ్రమలోని సెట్ వర్కు కార్మికుడిగా పని చేస్తున్నాడు. ఇదిలా ఉంటే.. ఒక ఫ్రాంక్ వీడియోలో గే పాత్రను పోషించాడు. అప్పటి నుంచి తనను నిజంగానే గే గా చూస్తున్నారని.. మానసికంగా చాలా ఇబ్బంది పెడుతున్నట్లు పేర్కొన్నారు.

తనను ఎవరూ పనికి పిలవటం లేదని.. తాగేందుకు నీళ్లు కూడా ఇచ్చేందుకు ఇష్టపడటం లేదని చెప్పాడు. భోజనానికి చాలా ఇబ్బందిగా ఉందని.. తనను మరోలా చూస్తున్నారని.. రోడ్డు మీద నడుచుకుంటూ వెళుతుంటే తనను వెనుక నుంచి కొడుతున్నారని వాపోయాడు. ఒక ఫ్రాంక్ వీడియోతోనే ఇంత రచ్చనా? అని పోలీసులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తుంటే.. తాను పడుతున్న బాధ అంతా ఇంతా కాదని వాపోతున్నాడు. ఫిర్యాదును తీసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.