Begin typing your search above and press return to search.

జగన్ ఏడాది పాలన: సంక్షేమ రారాజు

By:  Tupaki Desk   |   30 May 2020 4:37 AM GMT
జగన్ ఏడాది పాలన: సంక్షేమ రారాజు
X
అవకాశం జీవితంలో ఒక్కసారే వస్తుంది. దానికోసం ఎంతో కష్టపడాలి. దాన్ని నిలుపుకుంటే చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారు.. నిర్లక్ష్యం చేస్తే అథ: పాతాళానికి చేరుతారు. నాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి సద్వినియోగం చేసుకున్నారు. పదేళ్లుగా ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని.. ఉమ్మడి ఏపీ అంతా నడిఎండలో పాదయాత్ర చేసి ప్రజల కష్టాలు తెలుసుకొని ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు. ఇక ఆ కష్టం వైఎస్ఆర్ కు తెలుసు. అందుకే ఐదేళ్లు ప్రజలిచ్చిన అవకాశాన్ని ఆయన చేతులనిండా ఒడిసిపట్టుకొని సంక్షేమ రాజ్యాన్ని స్థాపించి తెలుగునేలపై చెరగని ముద్రవేశారు. నేడు ఆయన వారసుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తండ్రిబాటలో నడుస్తున్నాడు. రాజన్న రాజ్యాన్ని తిరిగి గుర్తుకు తెస్తున్నాడు. జగన్ కష్టం కూడా మాములుది కాదు.. కాంగ్రెస్ పార్టీ కుట్రపన్ని జైలుకు పంపినా.. 16 నెలలు జైలు జీవితం అనుభవించినా.. ప్రత్యర్థులకు లొంగిపోకుండా.. కుట్రలు, కుతంత్రాలకు ఎదురునిలిచి.. 3వేల కి.మీలకు పైగా పాదయాత్ర చేసి ఏపీ రాష్ట్ర సీఎం కావాలన్న తన కలను నిజం చేశారు. ‘వైఎస్ జగన్ అనే నేను’ అంటూ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు ఓ నిమిషం ఆగిన జగన్ ప్రజల కరతాళ ధ్వనులకు ఆనంద భాష్పాలు రాల్చారు. అధికారం సాధించడం ఎంత కష్టమో జగన్ కు తెలుసు. అందుకే దాన్ని నిలుపుకోవడానికి అంతకు మించిన కష్టం పడుతున్నాడు. ప్రతిపక్షాల అడ్డగింతలు, కుట్రలకు ఎదురునిలిచి ఏపీ ప్రజలకు సంక్షేమ రాజ్యాన్ని అందిస్తున్నారు. వైఎస్ జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టి ఏం సాధించారు? ఆయన ఏడాది పాలన ఎలా ఉందనే దానిపై స్పెషల్ ఫోకస్...

*తండ్రి చూపిన బాట.. సంక్షేమమే ఎజెండా?
వైఎస్ఆర్ బాటలోనే వైఎస్ జగన్ నడుస్తున్నాడు. బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి నవరత్నాలను అమలు చేశారు. పెన్షన్ ను రూ.2250కి పెంచారు. తొలి ఏడాదిలోనే ఇన్ని హామీల అమలుపై దృష్టిపెట్టిన సీఎం దేశంలోనే ఎవరూలేరనడంలో ఎలాంటి సందేహం లేదు. సంక్షేమ రథాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. అన్ని వర్గాలను కడుపులో పెట్టుకొని చూసుకుంటున్నారు. అందరికీ లబ్ది చేకూరుస్తూ సంక్షేమ రాజ్యాన్ని తిరిగి నెలకొల్పుతున్నారు.

*సామాజిక న్యాయంతో తొలి అడుగు
వైసీపీలో గండరగండరులు లాంటి ఎమ్మెల్యేలు రోజా, అంబటి, ధర్మాన లాంటి సీనియర్లను కూడా పక్కనపెట్టి అల్ప కులాల వారికి మంత్రి పదవులు ఇచ్చి జగన్ చేసిన సామాజిక న్యాయంతో అందరి మెప్పు పొందారు. పదవుల పందేరంలో.. సామాజిక న్యాయంలో తనకు తరతమ బేధాలు లేవని.. పైరవీలకు తావు లేదని నిరూపించారు జగన్..

*సర్కార్ పాఠశాలలకు ఊతం
జగన్ ప్రభుత్వం ప్రభుత్వ విద్యకు పెద్ద పీట వేసింది. విద్యార్థులకు మెరుగైన విద్యకు జగన్ గొప్ప నిర్ణయాలు తీసుకున్నారు. సర్కార్ పాఠశాల్లో పిల్లలను బడులకు పంపే తల్లులకు ఏకంగా ‘అమ్మఒడి’ కింద రూ15వేలు అందజేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌళిక సదుపాయాలకు ‘నాడు-నేడు’ వాటి దశను మార్చారు. విద్యార్థులకు ఉచిత పుస్తకాలు, నోట్ బుక్స్ తో ‘విద్యా కానుక’ అందజేచేశారు. హాస్టల్ విద్యార్థులకు ‘వసతి దీవెన’తో మంచి ఆహారం అందించారు. ఫీజు రీయింబర్స్ మెంట్ అందజేసి ‘విద్యా దీవెన’ పథకాన్ని కల్పించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టి కార్పొరేట్ విద్యాదోపిడీకి చెక్ పెట్టారు. ఎంతో పేద విద్యార్థులు, తల్లిదండ్రుల మోముల్లో విద్యా వెలుగులను చూశారు.

*ఉద్యోగాల కల్పనకు పెద్దపీట
తొలి ఏడాదే ఏకంగా గ్రామ పంచాయతీలను సంస్కరించి సచివాలయాలు ఏర్పాటు చేసి ఏకంగా 1.34 లక్షల ఉద్యోగాలను కల్పించారు. 2.75 లక్షల మంది వలంటీర్లను నియమించి ఉద్యోగ కల్పనకు పెద్ద పీట వేశారు. పరిశ్రమల్లో స్థానికులకే 75శాత ఉద్యోగాలు ఇవ్వాలని చట్టం చేసి స్థానిక యువతకు ప్రాధాన్యమిచ్చారు.

*వైద్యానికి భారీ ప్రాధాన్యం
ఇక విద్యతోపాటు సీఎం జగన్ ఏడాది పాలనలో వైద్యానికి పెద్దపీట వేశారు. ప్రైవేటు ఆస్పత్రులకు ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌళిక సదుపాయాలు కల్పించారు. రూ.5 లక్షల వరకు ఆదాయం ఉన్న వారందరినీ ఆరోగ్యశ్రీ పరిధిలో చేర్చి వైద్యచికిత్సలు రూ.1000 దాటితే ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా వైద్యసేవలు అందించారు. ఇదో గొప్ప సంస్కరణగా జనాల చేత ప్రశంసలు అందుకుంది.

*మద్యపాన నిషేధంవైపు అడుగులు
ఏపీ సీఎంగా గద్దెనెక్కగానే మహిళల ఉసురు తీస్తున్న మద్యపానంపై జగన్ దృష్టిసారించారు. అన్నింటిని ప్రభుత్వ పరిధిలోకి తెచ్చి వైన్ షాపులు గణనీయంగా తగ్గించాడు. బెల్ట్ షాపులు మూసివేశారు. మద్యం సీసాను కొనాలంటేనే భయపడేలా భారీగా ధరలు పెంచి నియంత్రించారు. ఎన్నికల హామీని దశలవారీగా అమలు చేస్తూ మద్యపాన నిషేధం దిశగా నడిపిస్తున్నారు.

*రైతుకు భరోసా.. పండుగలా వ్యవసాయం
రైతుకు భరోసానిస్తూ రైతు రాజ్యాన్ని జగన్ ఈ ఏడాదిలో నెలకొల్పారు. వారికి రైతు భరోసాగా ఏడాదికి రూ.13500 ను ప్రభుత్వం అందించింది. రాయితీపై విత్తనాలు,ఎరువులు, పంటల సాగులో సలహాలను అందించారు. ప్రభుత్వమే వారి పంటలు కొనుగోలు చేస్తూ గిట్టుబాటు ధర కల్పించారు. వ్యసాయాన్ని పండుగలా చేశారు.

*సుపరిపాలన.. పారదర్శకత
పాలనలో సంస్కరణలు చేసి సుపరిపాలనను ప్రజలకు జగన్ అందించారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని రీతిలో గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేసి ఐఏఎస్ లు కూడా స్టడీ చేసే అంశంగా ఖ్యాతిని సాధించారు. ప్రశంసలు అందుకున్నారు. రివర్స్ టెండరింగ్ ప్రవేశపెట్టి ప్రాజెక్టుల్లో వందలకోట్లను జగన్ మిగిల్చి ఖజానాకు కాపాడారు. పరిపాలనను అన్ని ప్రాంతాలకు వికేంద్రీకరించి మూడు రాజధానులను తెరపైకి తెచ్చారు. అమలు దిశగా కదులుతున్నారు.

*నదీజలాల వినియోగం
నదీజలాల వినియోగానికి జగన్ పెద్ద పీట వేశారు. గోదావరి, కృష్ణ, వంశధార, పెన్నా, నాగావళి నదీజలాలలను వినియోగించుకునేందుకు ‘పోలవరం’ నిర్మాణం, శ్రీశైలం ప్రాజెక్టుల వద్ద కొత్తం పంప్ హౌస్ లతో సీమను సస్యశ్యామలం దిశగా నడిపిస్తున్నారు.

*పారిశ్రామిక వృద్ధికి పెద్దపీట..
జగన్ పాలనలో పారిశ్రామికం పరుగులు పెట్టింది. తొలి ఏడాదిలోనే 39 భారీ, మధ్యతరహా పరిశ్రమలు ఉత్పత్తిని ప్రారంభించాయి. దీని ద్వారా ఏపీలో 34822మందికి ఉపాధి దొరికింది. 13122 సూక్ష్మ మధ్యతరహా పరిశ్రమలతో 63వేల మందికిపైగా ఉద్యోగాలు వచ్చాయి.

*ఏడాదిలో సంక్షేమరాజ్యాన్ని స్థాపించిన జగన్
తన ఏడాది పాలనలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేసి ఏపీలో సంక్షేమ రాజ్యాన్ని జగన్ స్థాపించారనడంలో ఎలాంటి సందేహం లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నీటిపారుదల, పారిశ్రామిక, విద్యా, వైద్య, మౌళిక సదుపాయాలు, సంక్షేమంలో దేశంలోనే ఏ సీఎం చేయని రీతిలో పనులు చేసి పథకాలు అమలు చేసి ఔరా అనిపించారు. ప్రజలు తనపై పెట్టుకున్న విశ్వాసాన్ని, 100శాతం నిలబెట్టుకొని సరికొత్త అధ్యయానికి జగన్ నాంది పలికారని చెప్పవచ్చు.

ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు పన్నినా.. ఎన్ని అడ్డంకులు సృష్టించినా వాటిని తట్టుకొని.. తుత్తునియలు చేసి సగర్వంగా నిలబడ్డ జగన్ తన ఏడాది పాలనను దిగ్విజయంగా పూర్తి చేసుకొని ప్రత్యర్థులకు కొరకరాని కొయ్యగా మారాడు.