Begin typing your search above and press return to search.

వారెవ్వా.. సైంటిస్టుల అద్భుత సృష్టి.. రక్తం కొరతకు చెక్..!

By:  Tupaki Desk   |   9 Nov 2022 12:30 AM GMT
వారెవ్వా.. సైంటిస్టుల అద్భుత సృష్టి.. రక్తం కొరతకు చెక్..!
X
వాహనానికి ఇంధనం ఎంత అవసరమో.. మనిషి శరీరానికి కూడా రక్త ప్రసరణ అంతే అవసరం. ఇంధనం లేకపోతే బండి ఎలా ముందుకు సాగదో అలానే రక్త ప్రసరణ జరుగకపోతే మనిషి జీవితం కూడా ముందుకెళ్లలేదు. మనిషికి ప్రాణవాయువు ఎంత అవసరమో రక్తం కూడా అంతే అవసరం. రక్తానికి విలువ కట్ట లేము. ఆపద సమయంలో బ్లడ్ సంజీవనిగా పని చేస్తుంది.

ఏదైనా అనుకోని ప్రమాదం జరిగినప్పుడు.. గర్భిణుల ప్రసవ సమయంలో.. దీర్ఘకాలిక రోగులు.. తలసీమియా వ్యాధి గ్రస్థులకు.. డయాలాసిస్ సమయంలో రక్తం దాని ఉప పదార్థాలు (కాంపోనెంట్స్) అవసరమవుతాయి. రక్తాన్ని కృత్రిమంగా తయారు చేయలేము. దీంతో రోజురోజుకు రక్తం ఆవశ్యకత పెరిగిపోతూ పోతుంది.

రక్తదాతల నుంచే ఇప్పటి వరకు కూడా రక్తాన్ని సేకరిస్తున్నారు. వీటిని బ్లడ్ బ్యాంకుల్లోని అత్యాధునిక పద్ధతులలో నిల్వ ఉంచుకొని అవసరమైన రోగులకు రక్తాన్ని అందించే ప్రయత్నం చేస్తున్నారు. రెడ్ క్రాస్.. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ లాంటి స్వచ్చంధ సంస్థలు రక్తదానం పై ప్రజల్లో అవగాహన కల్పించి దాతలు ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నాయి.

ఈ క్రమంలోనే గతంలో రక్తదానంపై ఉన్న అపోహలు చాలావరకు తగ్గిపోయాయి. ఒక్క మనిషి శరీరంలో ఐదు నుంచి ఆరు లీటర్ల రక్తం ఉంటుంది. అందులో నుంచి 350 మి.లీ బడ్ చొప్పున సంవత్సరానికి మూడు నుంచి నాలుగు సార్లు డొనేట్ చేయొచ్చు. వీరికి ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉండవని వైద్య నిపుణులు చెబుతున్నారు.

తాజాగా యూకే సైంటిస్టులు ఎర్ర రక్తకణాలపై చేసిన ప్రయోగం విజయవంతమైంది. తొలిసారిగా ల్యాబ్ లో రక్తాన్ని తయారు చేసినట్లు సైంటిస్టులు అద్భుతం సృష్టించారు. శరీరం బయట రక్తాన్ని తయారు చేయడం ఇదే మొదటిసారని వారంటున్నారు. ఈ ప్రయోగంతో రాబోయే రోజుల్లో రక్తం విరివిగా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని సైంటిస్టులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

రక్తకణాల తయారీకి యూకే సైంటిస్టులు కొన్నాళ్లుగా ప్రయోగం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఎర్ర రక్త కణాలుగా మారే మూల కణాలను సేకరించి సేకరించారు. ల్యాబ్ లో ఈ కణాలు పెద్దమొత్తంలో పెరిగేలా చేశారు. ఐదు లక్షల మూల కణాలు మూడు వారాలకే 5వేల కోట్ల ఎర్ర రక్త కణాలుగా మారాయి. వీటిని శుద్ధి చేయగా 1500 కోట్ల ఎర్ర రక్తాలు ట్రాన్స్ ప్లాంట్ కు పనికొచ్చాయని సైంటిస్టులు వెల్లడించారు.

తొలి విడుతలో భాగంగా ల్యాబ్ లో తయారు చేసిన రక్తాన్ని ఇద్దరికి ఎక్కించి పరీక్షిస్తున్నారు. ఈ ప్రయోగం ఫలితాలు త్వరలోనే అందరికీ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని యూకే సైంటిస్టులు చెబుతున్నారు. కాగా ఇప్పటి వరకు కొన్ని గ్రూపుల రక్తం చాలా అరుదుగా లభిస్తుంది. రేర్ గ్రూప్ బ్లడ్ దొరకక చాలా మంది ప్రాణాలు కోల్పోయిన ఘటనలున్నాయి. కృతిమ రక్తం అందుబాటులోకి వస్తే ఈ సమస్యకు పూర్తి పరిష్కారం లభించడం ఖాయంగా కనిపిస్తోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.