Begin typing your search above and press return to search.

ముసలోళ్ళు కనిపిస్తే.. ముగ్గులోకి దింపి ముంచేస్తాది..

By:  Tupaki Desk   |   4 Sep 2020 11:30 PM GMT
ముసలోళ్ళు కనిపిస్తే.. ముగ్గులోకి దింపి ముంచేస్తాది..
X
ఆమెకు ముసళోల్లె లక్ష్యం. కాస్తంత ఉన్నోడు కనిపిస్తే ఇట్టే దగ్గరవుతుంది. వయసులో బాగా అంతరం ఉన్న వృద్ధులను బరిలోకి దింపి పెళ్లి పేరుతో నమ్మించి సాంతం నాకిస్తుంది. ఉన్నదంతా దోచేసుకున్నాకా కానీ తెలీదు.. ఆమె యవ్వారం ఏంటో.. ముసలోళ్లను టార్గెట్ చేసి పెళ్లి చేసుకుని డబ్బు, బంగారంతో ఉడాయిస్తున్న ఓ నిత్య పెళ్లి కూతురిని ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఘజియాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. నగరంలోని కవినగర్ కు చెందిన సివిల్ కాంట్రాక్టర్ కిషోర్ (66) భార్య ఏడాది కిందట చనిపోయింది. ఒక కొడుకు ఉండగా ఆయన ఎక్కడో దూరంగా స్థిర పడ్డాడు.

ఒంటరిగా ఉంటున్న కిషోర్ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఒక మ్యాట్రిమోనీ ప్రకటన చూసి కాల్ చేయగా నిర్వాహకురాలు మంజు ఖన్నా.. మోనికా అనే మహిళని పరిచయం చేసింది. ఆమె కిషోర్ కంటే పాతికేళ్ళు చిన్నది. తాను మొదటి భర్తతో వచ్చిన విబేధాలతో విడాకులు తీసుకున్నానని.. ఈ సారయినా మంచోడిని చేసుకోవాలని ఈ పెళ్ళికి అంగీకరించినట్లు ఆమె తెలపడంతో కిషోర్ సంతోషించాడు. ఆమె కిషోర్ ను ఢిల్లీలోని తన ఇంటికి తీసుకెళ్లి కుటుంబీకులను పరిచయం చేయడం.. పెళ్లి జరగడం చక చకా అయి పోయాయి.

అనంతరం కిషోర్ తన ఇంట్లోనే కాపురం పెట్టాడు. కొద్ది రోజులు బాగా సాగిపోయాయి. ఓ రోజు అకస్మాతుగా మోనికా కనిపించకుండా పోయింది. అనుమానం వచ్చి ఇంట్లో చూడగా బంగారం, రూ. 15 లక్షల డబ్బు కనిపించలేదు. సీసీ టీవీ ఫుటేజీ చూడగా భార్యే బ్యాగుల నిండా సర్ది తీసుకెళ్లినట్లు తెలిసింది. తాను మోసపోయినట్లు గ్రహించిన కిషోర్ మ్యాట్రిమోనీ నిర్వాహకులను సంప్రదించగా వారు రూ.20 లక్షలు ఇవ్వాలని బెదిరించారు. కిషోర్ పోలీసులను ఆశ్రయించడంతో నిజాలు వెలుగులోకి వచ్చాయి. మోనికా ఇప్పటికే ఎనిమిది పెళ్లిళ్లు చేసుకుని వృద్ధులను మోసగించినట్లు తేలింది. అవన్నీ కూడా ఖన్నా మ్యాట్రిమోనీ ద్వారానే జరగడంతో పోలీసులు ఆ సంస్థ నిర్వాహకులు, మోనికా, ఆమె కుటుంబీకులు అందరిపై కేసులు పెట్టి జైలుకు పంపారు.