Begin typing your search above and press return to search.

భార్య పేరు మీద ఒక గ్రామాన్నే రిజిస్ట్రేషన్ చేయించుకున్న ఘనుడు!

By:  Tupaki Desk   |   18 April 2021 10:00 AM IST
భార్య పేరు మీద ఒక గ్రామాన్నే రిజిస్ట్రేషన్ చేయించుకున్న ఘనుడు!
X
అతడేమీ రాజకీయ నాయకుడు కాదు. బలమైన బ్యాక్ గ్రౌండ్ లేదు. కానీ.. ఆర్థికంగా స్థితిమంతుడు.. వ్యాపారిగా సుపరిచితుడు. అలాంటి వ్యక్తి 19 ఏళ్ల క్రితం గ్రామస్తుల అమాయకత్వాన్ని అసరాగా చేసుకొని.. ఊరు మొత్తాన్ని తన భార్య పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకున్న షాకింగ్ నిజం తాజాగా బయటకు వచ్చింది. ఈ ఆరాచకం తెలంగాణ రాష్ట్రంలోని నిర్మల్ జిల్లా పెంబి మండలంలో చోటుచేసుకుంది.

ఆదివాసీలు నివాసం ఉండే ఈ ఊరి మొత్తాన్ని వ్యాపారి ఒకరు తన భార్య మీద రిజిస్ట్రేషన్ చేయించుకున్న ఉదంతం షాకింగ్ గా మారింది. ఈ మధ్యనే ఊరికి వచ్చిన సదరు వ్యాపారి.. ఆ ఊరి స్థలం మొత్తం తనదని.. ఖాళీ చేయాలని చెప్పటంతో షాక్ కు గురయ్యారు. పెంబి మండలంలోని కొత్త చెరువుగూడలో కొందరు ఆదివాసీలు నివాసం ఉండేవారు. దీనికి దగ్గర్లోని మందపల్లికి చెందిన దేవ నడ్పి పెద్దులు.. చిన్న పెద్దులు.. దేవ బక్కన్నల వద్ద 4.32 ఎకరాల అసైన్డ్ భూమిని రూ.60వేలకు కొనుగోలు చేశారు. అక్కడ గుడిసలు వేసుకొని స్థిర నివాసం ఏర్పర్చుకున్నారు.

ఈ భూమిని పెంబికి చెందిన వ్యాపారి 2002లో తన భార్య పేరుతో నిర్మల్ లో రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. ఈ విషయం అమ్మిన వారికే కాదు.. కొన్న వారికి కూడా తెలీకపోవటం గమనార్హం. ప్రస్తుతం కోటి రూపాయిలు పలుకుతున్న ఈ భూమి ధరణిలో వ్యాపారి సతీమణి పేరు మీద ఉండటమేకాదు.. మూడేళ్లుగా రైతుబంధును కూడా పొందుతున్నారు. ప్రస్తుతం గ్రామ పంచాయితీగా ఉన్న వేణు నగర్ లో 50 కుటుంబాలకు పైగా నివాసం ఉంటున్న వారి వద్దకు వచ్చిన వ్యాపారి.. ఊరు తన భార్య పేరు మీద ఉందని.. ఖాళీ చేయాలని కోరటంతో ఈ ఇష్యూ తెర మీదకు వచ్చింది. ఈ ఉదంతం ఇప్పుడు షాకింగ్ గా మారింది. అధికారులు మరేం చేస్తారో చూడాలి.