Begin typing your search above and press return to search.

ఆర్జేడీ ఆఫర్: తేజస్వి సీఎం, నితీష్ పీఎం..

By:  Tupaki Desk   |   30 Dec 2020 11:33 AM GMT
ఆర్జేడీ ఆఫర్: తేజస్వి సీఎం, నితీష్ పీఎం..
X
పొత్తుల సంసారంలో బీజేపీ మద్దతుతో సీఎం కుర్చీలో కూర్చున్న జేడీయూ అధినేత.. బీహార్ సీఎం నితీష్ కుమార్ కు బీజేపీ సెగ పెడుతోంది. అందుకే తాజాగా తనకు సీఎంగా ఉండబుద్ది కావడం లేదంటూ వాపోయాడు. బీజేపీ ఎప్పుడు కుర్చీ లాగేస్తుందో తెలియని ఆందోళన నితీష్ ను వెంటాడుతోంది.

ఈ క్రమంలోనే అరుణాచల్ ప్రదేశ్ లో అవసరం లేకపోయినా ఆరుగురు జేడీయూ ఎమ్మెల్యేలను బీజేపీ లాగేసుకోవడంపై నితీష్ ఆగ్రహంగా ఉన్నట్టు తెలిసింది. ఈ రాజకీయ పరంపరలోనే తాజాగా బీహార్ లోని ప్రతిపక్షం ఆర్జేడీ ఓ బంపర్ ఆఫర్ ఇచ్చింది.

మిత్రపక్షంగా ఉంటూనే వెన్నుపోటు పొడుస్తున్న బీజేపీతో తెగతెంపులు చేసుకొని మహాకూటమితో చేతులు కలిపాలని సీఎం నితీష్ ను ఆర్జేడీ కోరింది. అలా చేస్తే నితీష్ ను పీఎంను చేస్తామని.. తేజస్విని సీఎం చేయాలని ఓ ప్రతిపాదనను ముందుంచుంది. ప్రధానిగా నితీష్ ను చేయడానికి మద్దతు కూడగడుతామని ఆర్జేడీ తెలిపింది.

ఇప్పటికే ఆర్జేడీ ఒకసారి నితీష్ ను సీఎంను చేసిందని.. ఇప్పుడు ఆయనే వైదొలుగుతానని అనడంతో తేజస్విని సీఎం చేయాలని ఆర్జేడీ నేత ఉదయ్ నారాయణ చౌదరి కోరారు. బీజేపీతోనే కలిసుంటే బీహార్ లో కూడా పార్టీని చీల్చేస్తారని నీతీష్ ను హెచ్చరించారు.

బీహార్ ఎన్నికల్లో ఏ పార్టీకి మెజార్టీ రాలేదు. ఆర్జేడీ 76 సీట్లతో అత్యధిక స్థానాలు పొందింది. తర్వాత బీజేపీ 73 సీట్లు సాధించింది. జేడీయూ తక్కువగా 43 సీట్లు పొందింది. తక్కువ సీట్లు వచ్చినా కూడా బీజేపీ మద్దతు ఇచ్చి జేడీయూ సీఎం అభ్యర్థిగా నితీష్ ను చేసింది. చీటికి మాటికి నితీష్ పై ఆధిపత్యం చేస్తూ బీజేపీ ఆయనను చికాకు పుట్టిస్తోంది. అందుకే తాజాగా దిగిపోతానంటూ ఆయన వ్యాఖ్యానించాడు. దాన్ని ఆర్జేడీ అందిపుచ్చుకుంటోంది.