Begin typing your search above and press return to search.

ఉద్యోగులకు ప్రజల్లో అసూయ పెంచే వ్యూహం!?

By:  Tupaki Desk   |   23 Jan 2022 5:00 AM GMT
ఉద్యోగులకు ప్రజల్లో అసూయ పెంచే వ్యూహం!?
X
పీఆర్సీ వివాదం కారణంగా ప్రజలకు, ఉద్యోగులకు మధ్య అంతరం పెరిగి పోతోందా ? మీడియా కథనాలు ఇదే చెబుతున్నాయి. పీఆర్సీ అమల్లోకి వస్తే ఉద్యోగుల జీతాలు ఏ విధంగా పెరుగుతాయనే విషయాన్ని వాలంటీర్ల ద్వారా ప్రభుత్వం ఇంటింటికి పాంప్లెట్ల ద్వారా ప్రచారం చేస్తోందట. పాత పీఆర్సీ జీతాలకు, కొత్త పీఆర్సీ ద్వారా అందుకునే జీతాలకు మధ్య తేడాను ప్రభుత్వం ప్రజలకు తెలిసేట్లుగా కరపత్రాలను పంపిణీ చేయిస్తోందని సదరు మీడియా చెప్పింది.

తన వాదనకు మద్దతు కూడగట్టుకునేందుకు ప్రభుత్వం వాలంటీర్ల ద్వారా కరపత్రాలు పంపిణీ చేయించటమే కాకుండా సోషల్ మీడియాను కూడా వాడుకుంటోందని చెప్పింది. ఒప్పించాల్సింది వివరించాల్సింది ఉద్యోగులకు అయితే... దీనిని ప్రజలకు ప్రజల డబ్బు ఖర్చుపెట్టి వివరించాల్సిన అవసరం వైసీపీ ప్రభుత్వానికి ఏముంది? అంటే ఉద్యోగులను ప్రజలను విడదీసి వారి మధ్య వైరం పెంచే వ్యూహంలా కనిపిస్తోందిది.

రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో ఆందోళనలు చేస్తున్న ఉద్యోగులు కూడా ప్రభుత్వ వాదన ఏ విధంగా తప్పో జనాలకు వివరించి చెబుతున్నారు. ఎవరి వాదనకు వారు కట్టుబడున్నపుడు ప్రజలకు తమ వాదన ఏ విధంగా కరెక్టో రెండువైపులా చెబుతున్నారు. ఎవరి వాదన తప్పు, ఎవరి వాదన కరెక్టనే విషయాన్ని ప్రజలే తేల్చుకుంటారు. ఇందులో ఉద్యోగులను తప్పు పట్టాల్సిన అవసరమే లేదు. కానీ ప్రభుత్వం దీనికోసం డబ్బు ఖర్చుచేయడమే అభ్యంతరకరం.

ఇక చీఫ్ సెక్రటరీ సమీర్ శర్మ చెబుతున్నదేమంటే కొత్త పీఆర్సీ పద్దతిలో మొదటి నెల జీతం అందుకుంటే తమ వాదన ఎలా కరెక్టో తెలుస్తుందంటున్నారు. అంతవరకు ఆగి అపుడు ధర్నా చేస్తే... పీఆర్సీ ఇచ్చినపుడు ఎందుకు ఊరుకున్నారని కచ్చితంగా ప్రశ్నిస్తారు. చీఫ్ సెక్రటరీ చెప్పినట్లు పెరిగితే ఎవరికీ ప్రాబ్లెమ్ లేదు. అదే విషయాన్ని ప్రభుత్వం అఫిషియల్ గా శ్వేత పత్రం రిలీజ్ చేయొచ్చు. కానీ కేవలం వైసీపీ పేజీల్లో మాత్రమే దానిని వివరిస్తున్నారు. పైగా జీతం తగ్గించి పెంచినామని చెబుతూ ఉద్యోగులకు కొవ్వెక్కిందని వైసీపీ ప్రచారం చేయడం ఉద్యోగులకు మరింత మంట పుట్టించింది.

కరోనా వైరస్ సమస్యలు, పెరిగిపోయిన ఆర్ధికభారం, తగ్గుతున్న ఆదాయాల కారణంగా ప్రభుత్వం తన వాదన వినిపిస్తోంది. ఓవరాల్ గా ప్రస్తుత జీతం కంటే పీఆర్సీ తో వచ్చే జీతం తక్కువ అన్నది ఉద్యోగసంఘాల నేతలు నిరూపిస్తున్నారు.

ఇదే సమయంలో సంక్షేమ పథకాల అమలుకు నిదులు అందుతున్నపుడు తమ జీతాలు పెంచాలనేటప్పటికి ప్రభుత్వం ఆర్ధిక సమస్యలను సాకుగా చూపుతోందని నేతలంటున్నారు. మొత్తంమీద ఎవరి వాదనకు వాళ్ళు కట్టుబడున్న కారణంగానే ప్రభుత్వం తన వాదనను జనాల్లోకి తీసుకెళుతోంది. చివరకు ఏమవుతుందో చూడాల్సిందే.