Begin typing your search above and press return to search.

హైదరాబాద్ లో కలకలం .. ట్రంకు పెట్టెలో బయటపడ్డ అస్థిపంజరం !

By:  Tupaki Desk   |   12 Feb 2021 8:00 AM IST
హైదరాబాద్ లో కలకలం .. ట్రంకు పెట్టెలో బయటపడ్డ అస్థిపంజరం !
X
హైదరాబాద్ ఎస్ ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆస్తిపంజరం కలకలం రేపింది. ఓ ఇనుప పెట్టె నుంచి అస్తి పంజరాలు బయటపడడంతో స్థానికంగా సంచలనం రేకెత్తించింది. ఈ సంఘటన ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. 2017 లో పాల్ అనే వ్యక్తి సాయిబాబా గుడి కింద ఉన్న సెల్లార్ ను అద్దెకు తీసుకున్నాడు.ఆ వచ్చిన అద్దె తోనే ఆలయ నిర్వాహకులు పూజారికి జీతం ఇచ్చేవారు.

అయితే పాల్ అనే వ్యక్తి 12 నెలల నుండి అద్దె చెల్లించలేదు. ప్రతి రోజు గుడికి వచ్చి దేవుడికి పూజ నిర్వహించే పూజారికి దుర్వాసన రావడంతో అనుమానం వచ్చి వెంటనే పోలీసులకు సమాచారాన్ని అందించాడు. అయితే గుడి కింద ఉన్న సెలార్ నుంచి దుర్వాసన రావడంతో పోలీసులు సెలార్‌ లో ఉన్న షాపును తెరిచి చూశారు. షాపులో ఉన్న ఇనుప పెట్టిలో ఆ అస్తి పంజరాన్ని గుర్తించారు. అస్తి పంజరం 30 ఏళ్లు పైబడిన వ్యక్తి గా గుర్తించారు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే .. ఇందిరానగర్ ఫేజ్ 2 బస్తీలోని దేవస్థానం సెల్లార్ గదికి అద్దె చెల్లించడం లేదంటూ దేవస్థాన చైర్మన్ యాదయ్య ఎస్సార్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 2017వ సంవత్సరం డిసెంబర్ నెలలో గాయత్రీ హిల్స్ కు చెందిన పలాష్ పాల్ అనే వ్యక్తి ఆ గదిని అద్దెకు తీసుకున్నాడని ఆ ఫిర్యాదులో తెలిపారు. పలాష్ పాల్ కార్పెంటర్ గా పనిచేస్తుంటాడు.

మొదట్లో ఆ గదికి అద్దెను సక్రమంగానే చెల్లించేవాడు. పశ్చిమ బెంగాల్ కు చెందిన ఓ మహిళతో అతడికి వివాహేతర సంబంధం ఉంది. తమ బంధానికి ఆమె భర్త అడ్డు వస్తున్నాడని భావించి గతేడాది జనవరి నెలలో అతడిని కడతేర్చాడు. శవాన్ని ఎలా మాయం చేయాలో తెలియక తాను అద్దెకు తీసుకున్న గదిలోనే ఓ పెట్టెలో అతడి శవాన్ని దాచాడు.

ఆ తర్వాత గదికి తాళం వేసి వెళ్లిపోయాడు. ఆ తర్వాత రెండు నెలలు గదికి అద్దె చెల్లించాడు. తర్వాత అద్దె చెల్లించడం మానేశాడు. కరోనా వల్ల అద్దె చెల్లించలేదేమోనని నిర్వాహకులు అనుకున్నారు. కానీ ఎంతకూ అద్దె చెల్లించకపోవడం, ఫోన్ చేసినా స్పందించకపోవడంతో దేవస్థానం చైర్మన్ యాదయ్య ఎస్సార్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బుధవారం పోలీసుల సమక్షంలో ఆ గదిని ఖాళీ చేయిస్తుండగా ఓ పెట్టెలో అస్తిపంజరం కనిపించింది.

దీంతో ఆ గదిని అద్దెకు తీసుకున్న పలాష్ పాల్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడిని పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నిస్తే అసలు నిజం వెలుగులోకి వచ్చింది. వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళ భర్తను తానే చంపాననీ, ఏం చేయాలో తెలియక గదిలో దాచానని చెప్పాడు. దీంతో అతడిని అరెస్ట్ చేసి కటకటాల్లోకి నెట్టారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.