Begin typing your search above and press return to search.

రాహుల్ గాంధీ తలకు గురిపెట్టాడు

By:  Tupaki Desk   |   26 Sept 2016 3:20 PM IST
రాహుల్ గాంధీ తలకు గురిపెట్టాడు
X
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ తలకు ఓ ఆగంతకుడు గురి పెట్టాడు... జనంలోంచి గురి చూసి తన కాలి బూటును రాహుల్ తలపైకి విసిరాడు. అది నేరుగా వెళ్లి ఆయన తలను తాకింది. ఉత్తరప్రదేశ్ ఎన్నికల నేపథ్యంలో సీతాపూర్‌లో రాహుల్ ర్యాలీ నిర్వహిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. ఎస్‌పీజీ భద్రతలో ఉండే రాహుల్‌పైకి అతి సమీపం నుంచి ఆగంతకుడు చెప్పు విసిరిన నేపథ్యంలో కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

తాజాగా ఘటన నేపథ్యంలో రాహుల్‌కు భద్రత కల్పించడంతో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. రాహుల్‌పైకి చెప్పు విసిరిన ఆగంతకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా ఇటీవల కాట్ సభలు నిర్వహిస్తున్న రాహుల్ యూపీ ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్లేందుకు చేస్తున్న ప్రయత్నాలు పూర్తి ఫలితాలనివ్వడం లేదు. తాజాగా ఇలాంటి చేదు అనుభవం ఎదురవడంతో రాహుల్ కాస్త నిరాశ చెందినట్లు తెలుస్తోంది.

మరోవైపు ఈ ఘటనకు సంబంధించిన సమాచారం సోనియాకు చేరడంతో ఆమె తీవ్రంగా తల్లడిల్లినట్లు తెలుస్తోంది. గతంలో ఇందిర, రాజీవ్ లు హత్యకు గురయిన నేపథ్యంలో సోనియా నిత్యం భద్రత విషయంలో ఆందోళన చెందుతుంటారు. తాజా ఘటన ఆమె ఆందోళనను మరింత పెంచుతుందని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. రాహుల్ కు గట్టి భద్రత కల్పించాలని మోడీకి ఆమె స్వయంగా లేఖ రాసే అవకాశాలున్నాయని చెబుతున్నారు.