Begin typing your search above and press return to search.

గోల్డ్ షాపుకు కస్టమర్ లా వచ్చి గన్ గురి పెట్టాక షాకింగ్ ట్విస్టు

By:  Tupaki Desk   |   10 Feb 2021 5:00 AM IST
గోల్డ్ షాపుకు కస్టమర్ లా వచ్చి గన్ గురి పెట్టాక షాకింగ్ ట్విస్టు
X
బంగారు ఆభరణాలు కొనుగోలు చేసేందుకు వచ్చిన కస్టమర్ లా బిల్డప్ ఇచ్చి.. అనూహ్యంగా గన్ బయటకు తీసి.. గురి పెడితే ఏమవుతుంది? మర్యాదగా.. బంగారు నగల్ని మూట కడతావా? చస్తావా? అంటే గొంతు తడారిపోతుంది. చేష్టలుడిగినట్లు ఉండిపోతారు. కానీ.. తూర్పుగోదావరి జిల్లాలోని రాజోలుకు చెందిన గోల్డ్ షాపు యజమాని మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించారు. అసలుసిసలు రియల్ హీరోలా రియాక్ట్ అయి.. సంచలనంగా మారారు. హాట్ టాపిక్ గా మారిన ఈ ఉదంతం వివరాల్లోకి వెళితే..

రాజోలు నడిరోడ్డు మీద ఉండే జ్యూయలరీ షాపుల్లో శ్రీలక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీ ఒకటి. రద్దీగా ఉండే రోడ్డుకు అనుకొని ఉండే ఈ బంగారు షాపునకు మధ్యాహ్నం వేళ ఇద్దరు వ్యక్తులు వచ్చారు. ముఖానికి మాస్కు పెట్టుకున్నారు. మామూలుగా అయితే అనుమానించేవారు. కరోనా పుణ్యమా అని మాస్కు ధరించటం అలవాటుగా మారటంతో.. సదరు యజమాని అనుమానించలేదు. వారు కోరినట్లే బంగారు నగలు చూపించారు. కాసేపు..ఆ నగల్ని చూస్తూ తమకొచ్చిన సందేహాల్ని అడగటం.. వాటిని తీరుస్తూ ఉన్నాడు ఆ షాపు యజమాని.

కాసేపు గడిచిన తర్వాత ఇద్దరిలో ఒకరు బయటకు వెళ్లగా.. మరొకరు జేబులో నుంచి గన్ తీసి గురి పెట్టి.. బంగారు నగల్ని మూట కట్టి ఇవ్వాలని వార్నింగ్ ఇచ్చాడు. అయితే.. అప్పటివరకు మామూలుగా ఉన్న ఆ షాపు యజమాని ఒక్కసారిగా చెలరేగిపోయాడు. ఈ ప్రతిస్పందనను ఊహించని ఆ దుండగుడు వెంటనే ఊహించలేకపోయాడు. చేతికి అందిన బంగారు నగల్ని పట్టుకొని పారిపోయే ప్రయత్నం చేశాడు.

అయినప్పటికీ ఏ మాత్రం బెదరని షాపు యజమాని.. ఆ దుండగుడితో పెనుగులాడాడు.. వారి చేతుల్లో ఉన్న బంగారునగల్ని లాగేశాడు. ఈ పెనుగులాటలో.. దుండగుడి సెల్ ఫోన్ జారి కింద పడిపోయింది. అదే సమయంలో.. షాపు యజమాని పెద్దగా అరవటంతో బెదిరిపోయిన దుండగుడు బయటకు పరుగులు తీసి.. అప్పటికే స్టార్ట్ చేసిన వాహనంపై పారిపోయారు. ఈ ఉదంతం షాకింగ్ గా మారింది. సదరు షాపు యజమాని ప్రదర్శించిన ధైర్యసాహసాలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారటమే కాదు.. పలువురు అభినందిస్తున్నారు. గన్ గురి పెట్టినా బెదరకుండా పోరాడిన వైనం ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోంది. రియల్ హీరో అంటూ అందరూ అతడ్ని అభినందిస్తున్నారు.