Begin typing your search above and press return to search.

రేవంత్‌ లేపేసేందుకు స్పెష‌ల్ టీం అట‌!

By:  Tupaki Desk   |   30 Nov 2018 5:38 PM IST
రేవంత్‌ లేపేసేందుకు స్పెష‌ల్ టీం అట‌!
X
తెలంగాణ కాంగ్రెస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మ‌రోమారు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. వికారాబాద్ జిల్లా కొడంగల్‌ లో రేవంత్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ సీఎం కేసీఆర్ - డీజీపీ మహేందర్ రెడ్డిపై విరుచుకుపడ్డారు. సీఎం కేసీఆర్ అవినీతి - అక్రమాలపై పోరాటం చేస్తున్నందున త‌న‌ను అడ్డు తొలగించుకుంటామని అసెంబ్లీలోనే చెప్పారని, ప్రస్తుత పరిస్థితులను చూస్తే దాడులు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయ‌న అన్నారు. డీజీపీగా మహేందర్ రెడ్డి అయిన తర్వాత త‌నపైనా త‌న కార్యకర్తల పైనా దాడులు పెరిగాయన్నారు. ``నా హోదా పెరిగితే భద్రత తగ్గించారు. నా భద్రత విషయంలో కేంద్ర ప్రభుత్వానికీ ఫిర్యాదు చేసినా - దాడులు జరిగే అవకాశం ఉందని కేంద్ర ఇంటలిజెన్స్ చెప్పినా పట్టించుకొలేదు. కోర్టు చెప్పినా పట్టించుకోవడం లేదు. కేంద్ర ప్రభుత్వ బలగాలతో 4+4 తో భద్రత కల్పించాలని రాష్ట్ర హైకోర్టు స్పష్ట మైన అదేశాలు ఉన్నా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. రాష్ట్రంలో నా పర్యటనను అడ్డుకోవాలనే భద్రత కల్పించడం లేదు`` అని రేవంత్‌ ఆరోపించారు.

మహాకూటమితో పాటు త‌న‌ పర్యటన వల్ల కేసీఆర్ అధికారం కొల్పోతున్నాడని స్పష్టమైన సర్వేలు ఉన్నాయని రేవంత్ రెడ్డి తెలిపారు. ``నాపై 39 కేసులు పెట్టించారు. నాపై కేసుల వివరాలను అడిగితే డీజీపీ కూడా ఇవ్వలేదు. నా నామినేషన్‌ ను తిరస్క‌రించాలనే కేసుల వివరాలు ఇవ్వలేదు. కోర్టు తలుపు తడితే అప్పుడు కోర్టుకు తెలియజేశారు. నన్ను అడ్డు తొలగించుకోడానికి కేసీఆర్ పథకం పన్నారు. నక్సల్స్ ఏరివేతలో ఉన్న కొందరు సుశిక్షితులైన అధికారులను రంగంలోకి దిగారు. అందులో భాగంగానే నాపై బౌతిక దాడులకు పాల్పడాలని చూస్తున్నారు. మీపై దాడి చేసి అడ్డు తొలగించుకునే ప్రయత్నం చేస్తున్నారని పోలీస్ శాఖలోని కొందరు నాకు సమాచారం అందించారు. మీపై దాడిచేసి నక్సల్స్ పైన తోసే ప్రయత్నాలు జరుతున్నాయని వారు నాకు వివ‌రించారు`` అంటూ రేవంత్‌ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు.

ఇవ‌న్నీ ప‌రిగ‌ణ‌లోకి తీసుకుని కోర్టు అదేశాలు అమలు చేసి తక్షణమే రక్షణ కల్పించాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ``దాడులు జరుగుతాయన్న స్పష్టమైన సమాచారం ఉండడంతో కార్యకర్తల సూచనలతో మూడు రోజుల పాటు నా పర్యటనను వాయిదా వేసుకున్నాను. నా అడ్డు తొలగించుకోడానికి పోలీసులతో పాటు ముఠాలతో కేసీఆర్ జట్టు కట్టారు. తనకు భద్రత కల్పించకపోవడానికి రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం కూడా సహ‌కరిస్తుంది.

పోటీచేసే అభ్యర్థులకు రక్షణ కల్పించాల్సిన ఎన్నికల కమిషన్ నేను ఒక పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ అయినా నాకు రక్షణ ఎందుకు కల్పించడం లేదు? గతంలో నేను చెప్పినట్లే నాపై ఈడీ దాడులు చేశారు. ఇప్పుడు నాపై దాడులు చేయడానికీ కుట్ర జరుగుతుంది. గవర్నర్ ఎందుకు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు? ఇక్కడి పరిస్థితులు గవర్నర్ కు కనిపించడం లేదా? లేక కేసీఆర్‌కు సహకరిస్తున్నారా? `` అంటూ ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించారు. ``నేను కేసులకు భయపడలేదు.. అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేస్తాను. హైకోర్టు ఆదేశాలు ఉన్నా కేంద్ర - రాష్ట్ర ప్రభుత్వాలు భద్రత కల్పించక పోవడంతో నా పర్యటనలను వాయిదా వేసుకుంటున్నా``అని తెలిపారు. కాగా, త‌న భ‌ద్ర‌త విష‌యంలో రేవంత్ రెడ్డి హైకోర్టును ఆశ్ర‌యించారు. దీంతో 4+4 భద్రత కల్పించాల‌ని న్యాయ‌స్థానం ఆదేశించింది.