Begin typing your search above and press return to search.

కోర్టు తీర్పు... క‌రుణ పాదాల చెంత‌కు చేరిందే!

By:  Tupaki Desk   |   22 Dec 2017 10:01 AM GMT
కోర్టు తీర్పు... క‌రుణ పాదాల చెంత‌కు చేరిందే!
X
యావ‌త్తు దేశాన్నే ఓ భారీ కుదుపున‌కు గురి చేసిన 2జీ స్ప్రెక్ట్రం కేసు... దేశంలో ఇప్ప‌టిదాకా వెలుగుచూసిన హై ప్రొఫైల్ కేసుల్లోకెల్లా అతి పెద్ద‌ద‌నే చెప్పాలి. దాదాపుగా 1.7 ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌ల మేర అవినీతి చోటుచేసుకుంద‌ని కేసులు న‌మోదైన ఈ కేసు విచార‌ణ సుదీర్ఘ కాలం పాటు సాగింది. ఈ కేసు న‌మోదుతో త‌మిళ‌నాట ప్రధాన ప్రాంతీయ పార్టీగానే కాకుండా... ఆ రాష్ట్రాన్ని అత్య‌ధిక కాలం పాలించిన పార్టీగా పేరున్న ద్ర‌విడ మున్నేట్ర క‌జ‌గం (డీఎంకే)ను ముప్పు తిప్ప‌లు పెట్టింది. ఆ పార్టీలో సీనియ‌ర్ నేత‌గా ఉన్న కేంద్ర టెలికం శాఖ మాజీ మంత్రి ఎ.రాజాతో పాటుగా పార్టీ చీఫ్ ముద్దుల త‌న‌య‌ - గారాల‌ప‌ట్టీ కనిమొళి కూడా జైలు ఊచ‌లు లెక్క పెట్ట‌క త‌ప్ప‌లేదు. ఈ క్ర‌మంలో అటు కేంద్రంలో ఉన్న అధికార పార్టీ కాంగ్రెస్‌ తో పాటు ఇటు డీఎంకే కూడా అప్ర‌తిష్ఠ పాలు కావాల్సి వ‌చ్చింది. అయితే నాడు తోక జాడిస్తున్న డీఎంకేను దారికి తెచ్చుకునేందుకే ఎ.రాజా నేతృత్వంలో జ‌రుగుతున్న 2జీ స్ప్రెక్ట్రం వేలాన్ని ఆధారం చేసుకుని కాంగ్రెస్ పార్టీ ఈ కేసును ఉద్దేశ‌పూర్వ‌కంగానే న‌మోదు చేయించిన‌ట్లుగా ఆరోప‌ణ‌లు వినిపించాయి. అదంతా గ‌త‌మ‌నుకుంటే.. ఇప్పుడు ఆ కేసులో ఎలాంటి సాక్ష్యాలు లేవ‌ని పాటియాలాలోని సీబీఐ ప్ర‌త్యేక న్యాయ‌స్థానం సంచ‌ల‌న తీర్పు చెప్పింది.

సాక్ష్యాలు లేని కార‌ణంగా ఈ కేసులో ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న ఏ ఒక్క‌రిని కూడా దోషిగా ప‌రిగ‌ణించ‌లేమ‌ని కూడా కోర్టు న్యాయ‌మూర్తి జ‌స్టిస్ట్ సైనీ ఆస‌క్తిక‌రమైన తీర్పు చెప్పారు. ఈ తీర్పుతో ఉబ్బిత‌బ్బిబ్బైన డీఎంకే సంబ‌రాలు చేసుకుంది. క‌రుణ త‌న‌య అయితే... ఏకంగా ఎ.రాజానా గ‌ట్టిగా ఆలింగ‌నం చేసుకుని మ‌రీ... త‌న సంతోషాన్ని తెలియ‌జేశారు. ఇక డీఎంకే నేత‌లు, కార్య‌క‌ర్త‌ల సంబ‌రాల విషయానికి వ‌స్తే.. అస‌లు వాటిని వ‌ర్ణించేందుకు మాట‌లు చాల‌వ‌నే చెప్పాలి. స‌రే... ఎలాగోలా ఈ కేసు నుంచి డీఎంకే నేత‌లు బ‌య‌ట‌ప‌డిపోగా... అక్క‌డితో ఆ విష‌యాన్ని వ‌దిలేయాల్సిన ఆ పార్టీ నేత ఎ.రాజా... ఓ అత్యంత ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ‌కు తెర తీశారు. అప్ప‌టికే అవినీతిలో అందె వేసిన చెయ్యిగా రాజా గురించి ప్ర‌చారం జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. అయితే పాటియాలా కోర్టు తీర్పుతో ఆయ‌న ఒక్క‌సారిగా నిఖార్సైన‌ - నిప్పు లాంటి రాజ‌కీయ నాయ‌కుడిగా మారిపోయారు. అంతేకాదండోయ్‌... తాను కేసుల్లో ఇరుక్కున్నా... పార్టీ అధినేత హోదాలో క‌రుణానిధి త‌న‌కు ఎన‌లేని ధైర్య‌మిచ్చార‌ని, ఆ ధైర్య‌మే త‌న‌ను ఇప్ప‌టిదాకా న‌డిపించింద‌ని కూడా రాజా పేర్కొంటున్నారు.

ఈ పేర్కొన‌డంతోనే ఆయ‌న స‌రిపెడితే బాగుండేదేమో. అయితే ఎంతైనా అతిలో పై చేయిగా ఉన్న త‌మిళ తంబీగా ఉన్న ఆయ‌న కోర్టుల‌ను అవ‌మాన‌ప‌రిచేలా ఓ షాకింగ్ చ‌ర్య‌కు దిగారు. కోర్టు తీర్పు కాపీల‌ను త‌న పార్టీ అదినేత క‌రుణానిది పాదాల చెంత ఉంచేశారు. అంతేనా... కోర్టు తీర్పు కాపీల‌ను క‌రుణానిది పాదాల చెంత ఉంచిన విష‌యాన్ని ఆయ‌న బ‌య‌టి ప్ర‌పంచానికి తెలిసేలా కూడా డేరింగ్ స్టెప్ వేశారు. ఈ చ‌ర్య‌కు సంబంధించి ఇప్పుడు ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ‌కు తెర తీసిందనే చెప్పాలి. ఈ చ‌ర్య‌తో రాజా ఉద్దేశ‌మేమిటంటే... తాను నిబ‌ద్ధుడినేన‌ని, డీఎంకే కార్య‌క‌ర్త‌గా ఏ త‌ప్పూ చేయ‌లేద‌ని, పార్టీ ప్ర‌తిష్ఠ‌కు మ‌చ్చ తెలేదని, పాటియాలా కోర్టు తీర్పుతో ఈ విష‌యం నిరూపిత‌మైంద‌ని, ఈ మొత్తం ఎపిసోడ్‌ లో తాను ఇంత ధైర్యంగా ముందుకు సాగ‌డం వెనుక క‌రుణ ఇచ్చిన అభ‌య‌మేన‌ని చెప్ప‌డమే.

అందుకు క‌రుణ పాదాల‌ను రాజా ముద్దాడితే స‌రిపోయేది. ఆ ప‌ని చేయ‌కుండా దేశ న్యాయ వ్య‌వ‌స్థ‌ను కించ‌ప‌రిచేలా కోర్టు తీర్పు కాపీల‌ను రాజా... క‌రుణ పాదాల చెంత పెట్టారు. కోర్టు తీర్పు ప్ర‌తుల‌తో పాటుగా త‌న స్వ‌ద‌స్తూరితో రాసిన ఓ లేఖ‌ను కూడా ఆయ‌న క‌రుణ పాదాల చెంత ఉంచారు. ఆ లేఖ‌లో రాజా ఏమ‌ని పేర్కొన్నారంటే... *విధేయతతో చరిత్రాత్మక తీర్పును మీ పాదాల వద్ద ఉంచుతున్నా.. మీరే నా సంరక్షకుడు. ఆరోపణలు ఎదుర్కున్న సమయంలో మీరు నాకు ఇచ్చిన మనోధైర్యం అంతా ఇంతా కాదు. ఇంతకాలం అదే నన్ను కవచంలా రక్షిస్తూ వస్తోంది. మీ బదులు కోసం ఎదురు చూస్తున్నా* అని రాజా ఆ లేఖ‌లో పేర్కొన్నారు. ఈ చ‌ర్య‌తో తాను కూడా త‌మిళ తంబీనేన‌ని, త‌మిళ తంబీగా అతి చేయ‌డంలో త‌న‌ను మించిన వారెవ‌రూ లేర‌ని కూడా రాజా నిరూపించుకున్నార‌న్న వాద‌న‌లు వినిపిస్తున్నాయి.