Begin typing your search above and press return to search.

సుడిగాడు అంటే ఇతడే.. హైదరాబాద్ నాలాలో పడి కొట్టుకెళ్లి బయటపడ్డాడు

By:  Tupaki Desk   |   9 Oct 2021 5:53 PM IST
సుడిగాడు అంటే ఇతడే.. హైదరాబాద్ నాలాలో పడి కొట్టుకెళ్లి బయటపడ్డాడు
X
ఎండ తీవ్రత ఉన్నంత వరకు హైదరాబాద్ మహానగరం చాలా చక్కగా ఉంటుంది. మరీ.. ఎండ తీవ్రతను తట్టుకోలేని వారు.. ఏసీ గదుల్లోకి పరిమితం కావటం ఈ మధ్యన ఎక్కువైంది. డబ్బున్నోళ్ల సంగతి ఏదోలా అడ్జెస్టు అవుతారు. కానీ.. పేదోళ్ల పరిస్థితే దారుణం. ఎండకు ఎండాలి. వానకు తడవాలి.. చలికి వణకాలి. మిగిలిన కాలాల సంగతి ఎలా ఉన్నా.. వానాకాలంలో మాత్రం హైదరాబాద్ మహానగరం మహా నరకంగా మారుతోంది. కొద్దిపాటి వర్షానికే ఆగమాగం అయ్యే పరిస్థితి.

ఇక.. భారీ వర్షం కురిస్తే మాత్రం.. హైదరాబాద్ మహానగరంలోని చాలా కాలనీలు నీళ్లతో నిండిపోవటం.. నాలాలు ఉప్పొంగటం లాంటివి కామన్ గా మారాయి. ఈ మధ్యన పరిస్థితి మరింత దారుణంగా మారి.. రోడ్డు మీద ఉండే మ్యాన్ హోల్ లో జారి పడటం లాంటివి చోటుచేసుకుంటున్నాయి. కొద్ది రోజుల క్రితం వర్షంపడే వేళలో పెరుగు పాకెట్ కోసం వచ్చిన మణికొండ వాసి.. ఇంటికి కాస్త దూరంలోమ్యాన్ హోల్ లో పడి పోయి చనిపోవటం తెలిసిందే.

శుక్రవారం కురిసన భారీ వర్షంలో మరో వ్యక్తి నాలాలో పడి.. లక్కీగా బయటపడిన వైనం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇంతకూ అసలేం జరగింది? ఆ లక్కీ ఫెలో ఎవరు? అతను ప్రాణాలతో ఎలా బయటపడింది.. కొన్ని చానళ్ల వారికి చెప్పుకొచ్చాడు. తన పేరు జగదీశ్అని.. తాను కర్మాన్ ఘాట్ లో ఉంటానని చెప్పుకొచ్చాడు.

హయత్ నగర్ లోని ఆటోనగర్ నుంచి ఇంటికి వెళుతున్న వేళ.. భారీ వర్షం కురిసింది. దీంతో పనామా చౌరస్తా నుంచి ఎల్బీ నగర్ వరద నీరు చేరింది. చింతల్ కుంటలోని సురభి హోటల్ సమీపంలో కల్వర్టు నాలా ఉంది. అక్కడ భారీగా వరద నీరు ఉండగా.. బైకు మీద వచ్చిన జగదీశ్.. తన బండితో పాటు నాలాలో పడిపోయాడు. స్థానికులు అతడ్ని కాపాడే ప్రయత్నం చేయగా.. బైకును పట్టుకున్నారు. అతను మాత్రం జారి నాలాలో పడిపోయాడు.

దీంతో.. అతను కొట్టుకుపోయినట్లుగా భావించారు. అనూహ్యంగా తను నాలా తనను కొట్టుకుపోయే వేళలో.. చేతికి ఏదో గట్టిగా తగలటంతో తాను దాన్ని గట్టిగా పట్టుకొన్నానని.. దాని సాయంతో బయటకు వచ్చినట్లుగా చెప్పాడు. ఈ సందర్భంగా అతని వీపు వెనుక భాగానికి దెబ్బలు తాకాయి. ఇతని కోసం రెండుగంటల పాటు పోలీసులు.. జీహెచ్ఎంసీ సిబ్బంది వెతుకులాడారు. చివరకు అతడు సేఫ్ గా బయట పడటంతో అందరూ హాయిగా ఊపిరి పీల్చుకుంటున్న పరిస్థితి. ఏమైనా.. వరద నీటి తాకిడికి నాలాలో పడి.. బతికిపోవటం నిజంగా లక్కీ అని చెప్పక తప్పదు.