Begin typing your search above and press return to search.

అతి జాగ్రత్త అంటే ఇదే.. చికెన్ లోనూ శానిటైజర్

By:  Tupaki Desk   |   9 Sep 2020 1:30 AM GMT
అతి జాగ్రత్త అంటే ఇదే.. చికెన్ లోనూ శానిటైజర్
X
కరోనా మహమ్మారి దెబ్బకు జనాలు వణికిపోతున్నారు. మాస్క్ ధారణే కాదు. శానిటైజర్ కూడా వినియోగిస్తున్నారు. అయితే ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం మేలే కానీ అతి జాగ్రత్తలు తీసుకుంటేనే అసలుకే మోసం వస్తుంది. శానిటైజర్ తో శుభ్రం చేసుకోవడం మంచి పద్ధతే. అయితే అది వాడకం పైన అవగాహన లేనివారు, అతి భయం ఉన్నవారు. దానిని పదే పదే వాడి అవస్థల పాలవుతున్నారు. భోజనం చేసే ముందు, చిరు తిళ్ళు తినేటప్పుడు, ఆఫీసుల్లో బ్రేక్ టైమ్లో ప్రతి సారి శానిటైజర్ తో చేతులు శుభ్రం చేసుకుంటున్నారు. ఆ చేతులతో అలాగే తింటున్నారు. అలా ఒకసారో రెండు సార్లో అయితే ఓకే కానీ ఇక నిత్యం ఇదే పనిగా పెట్టుకుంటుండటంతో చిన్న చిన్నగా శానిటైజర్ ఒంట్లోకి చేరుతోంది. ఇది సైడ్ ఎఫెక్ట్స్ తీసుకొస్తోంది.

కొంతమంది మరీ విడ్డూరంగా బకెట్లు బకెట్లు శానిటైజర్ కొంటున్నారు. ఇంట్లోకి తెచ్చే ప్రతి పదార్థం పైన చల్లుతున్నారు. కూరగాయలు కూడా శానిటైజర్ తో కడుగుతున్నారు. ఇలా చేయడం వల్ల శానిటైజర్ ఆనవాళ్ళు శరీరంలోకి చేరుతున్నాయి. అదొక రసాయనం కాబట్టి దీని వల్ల లేని రోగాలు పుట్టుకొస్తున్నాయి. ఐదు నిమిషాలకోసారి చేతులను శానిటైజర్ తో దిద్ది దిద్దీ చాలా మంది చేతులు దెబ్బ తిన్నాయి. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం పాపక్క పల్లెకు చెందిన యాకుబ్ కరోనా భయంతో చికెన్లో శానిటైజర్ కలుపుకొని తిన్నాడు. కాసేపటికి వాంతులు మొదలవడంతో కుటుంబీకులు అతన్ని ఆస్పత్రికి తరలించారు. అతడి పేగులు బాగా దెబ్బ తిన్నట్లు వైద్యులు గుర్తించారు. ప్రస్తుతం అతడికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. శానిటైజర్ అవసరమైన మేరకే వాడాలని.. అతిగా వాడి సమస్యలు కొని తెచ్చుకోవద్దని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.