Begin typing your search above and press return to search.

కడపలో టీడీపీకి కనుమరుగే.. పార్టీ వీడే యోచనలో మాజీ ఎమ్మెల్యేలు

By:  Tupaki Desk   |   11 March 2020 12:01 PM IST
కడపలో టీడీపీకి కనుమరుగే.. పార్టీ వీడే యోచనలో మాజీ ఎమ్మెల్యేలు
X
వైఎస్సార్సీపీ పార్టీ అధినేత, సీఎం జగన్ మోహన్ రెడ్డి వ్యూహానికి ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ కనుమరుగయ్యేటట్టు కనిపిస్తోంది. స్థానిక ఎన్నికల సమయం కావడంతో వైఎస్సార్సీపీ చేరికలకు తలుపులు తెరవడంతో టీడీపీ నుంచి పొలొమని నాయకులు బారులు తీరుతున్నారు. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్సీలు, స్థానిక ప్రజాప్రతినిధులతో పాటు చోటామోటా నాయకులు అందరూ సైకిల్ పార్టీ వీడి ఫ్యాన్ కిందకు చేరుతున్నారు. ఒక్కసారిగా వైఎస్సార్సీపీలో జోష్ పెరుగుతుండగా టీడీపీలో నైరాశ్యం ఏర్పడింది. జగన్ దెబ్బకు జిల్లాల్లో టీడీపీ ఉనికికే ప్రమాదం ఏర్పడే స్థాయికి చేరింది. ప్రస్తుతం సీఎం జగన్ తన సొంత జిల్లాలో టీడీపీని కనుమరుగు చేసేలా కనిపిస్తున్నాడు.

ఎందుకంటే వైఎస్సార్ కడప జిల్లాలో టీడీపీకి షాక్ ల మీద షాక్ తగులుతోంది. ఆ పార్టీకి గట్టి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. జిల్లాలోని కీలకమైన నాయకులు బైబై చెప్పేసి జగన్ పక్కకు చేరుతున్నారు. జగన్ ప్రతీకారానికి చంద్రబాబు గజగజ వణకాల్సిన పరిస్థితి ఏర్పడింది. సార్వత్రిక ఎన్నికల్లో పెద్ద సంఖ్యలో స్థానాలను సొంతం చేసుకోగా ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీని కానరాకుండా చేయాలని వైఎస్సార్సీపీ వ్యూహం పన్నింది. దానికనుగుణంగానే టీడీపీలోని కీలక నేతలు పార్టీని వీడుతున్నారు.

ఇప్పటికే కొంతమంది జగన్ సమక్షం లో పార్టీలో చేరగా మరికొందరు లైన్ లో ఉన్నారు. ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యేలంతా ఆ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. పులివెందుల ఇంచార్జ్ సింగిరెడ్డి వెంకట సతీశ్ కుమార్ రెడ్డి, జమ్మలమడుగు ఇన్ చార్జ్ పొన్నపరెడ్డి రామసుబ్బారెడ్డి అధికార పార్టీలో చేరేందుకు ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారు. ఇక సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి, విజయమ్మ తదితరులు ఆ పార్టీలో చేరనున్నారని సమాచారం. ప్రొద్దుటూరులో నంద్యాల వరదరాజుల రెడ్డి, బద్వేలులో విజయమ్మ కీలక నాయకులుగా ఉన్నారు. వారు గతంలో ఎమ్మెల్యేలుగా పని చేశారు. ప్రస్తుతం టీడీపీకి భవిష్యత్ లో అవకాశం కష్టంగా ఉండడం తో వారంతా పార్టీని వీడి జగన్ పార్టీ లో చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు.

వీరితో పాటు మూడుసార్లు రాయచోటి ఎమ్మెల్యేగా పని చేసిన సుగవాసి పాలకొండరాయుడు, ఆయన కుమారుడు ప్రసాద్‌బాబుతో చేరేందుకు సిద్ధమయ్యాడు. మరికొందరు నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారు. చర్చల అనంతరం వారు ఆ పార్టీని వీడనున్నారు. దీంతో కడప జిల్లాలో టీడీపీ తుడుచుపెట్టుకోవడమే కాదు స్థానిక ఎన్నికల్లో ఆ పార్టీ ఘోర పరాభవం మూటగట్టుకోనుందని పరిణామాలు చూస్తుంటే తెలుస్తోంది. వైఎస్సార్ కడప జిల్లా అంటే వైఎస్సార్సీపీ ఖిల్లాగా త్వరలోనే రూపాంతరం చెందనుంది.