Begin typing your search above and press return to search.

భోగవరంతో వైజాగ్ బీచ్ రోడ్డు అనుసంధానం

By:  Tupaki Desk   |   24 March 2021 4:59 AM GMT
భోగవరంతో వైజాగ్ బీచ్ రోడ్డు అనుసంధానం
X
ఏపీ పరిపాలన రాజధానిగా విశాఖ కావడానికి ముందే దానికి అన్ని అనుసంధానాలు పూర్తి చేయాలని జగన్ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. ఆంధ్రప్రదేశ్ కొత్త కార్యనిర్వాహక రాజధాని విశాఖపట్నంలో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. విశాఖపట్నం బీచ్‌ను అభివృద్ధి చేసి అంతర్జాతీయ పర్యాటకులపై దృష్టి ఆకర్షించాలని.. ఇందుకోసం అప్‌గ్రేడ్ చేయాలనే ప్రతిపాదనను ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆమోదించినట్టు తెలిసింది.

వైజాగ్ బీచ్ ను భీమిలి వరకు విస్తరించాలని.. బీచ్ రహదారి భోగపురం విమానాశ్రయానికి అనుసంధానించాలని నిర్ణయించారు. భోగపురం అంతర్జాతీయ విమానాశ్రయం పనులు ప్రారంభమైనప్పటికీ విమానాశ్రయాన్ని విశాఖ నగరంతో అనుసంధానించేలా ఆరు లైన్ల రహదారిని నిర్మించాలని జగన్ ప్రభుత్వం యోచిస్తోంది. బీచ్‌ కారిడార్ ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి జగన్ ఆమోదం తెలిపారని.. భీమిలికి విస్తరించి అక్కడి నుంచి భోగపురానికి అనుసంధానించే రహదారిని ఏర్పాటు చేయడానికి నిర్ణయించారని సమాచారం.

విశాఖపట్నం కోసం మెట్రో రైలు ప్రాజెక్టును కూడా ముఖ్యమంత్రి ఆమోదించారు. మెట్రో రైలు ప్రాజెక్టును భోగపురం విమానాశ్రయానికి కూడా అనుసంధానించనున్నారు. స్టీల్ ప్లాంట్ గేట్ నుంచి భోగపురం వరకు 76.9 కిలోమీటర్ల విస్తీర్ణంలో రూ.14 వేల కోట్లకు డీపీఆర్‌ను అధికారులు సిద్ధం చేశారు. అంతేకాకుండా, విశాఖ పరిపాలన రాజధానికి తాగునీరు అందించడానికి పోలవరం ప్రాజెక్టు నుంచి పైపులైన్ పనులను పూర్తి చేయాలని ముఖ్యమంత్రి అధికారులను కోరారు.

రాబోయే రెండు నెలల్లో పరిపాలనను విశాఖపట్నానికి మార్చాలని ముఖ్యమంత్రి జగన్ పట్టుదలగా ఉన్నారు. అందుకు అనుగుణంగా విశాఖలో మౌళిక వసతులకు పెద్దపీట వేసి సదుపాయాలు కల్పించాలని రెడీఅయ్యారు. విశాఖనే శాశ్వత రాజధానిగా చేయడానికి జగన్ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది.