Begin typing your search above and press return to search.

టీ తేడా కొట్టిందే!

By:  Tupaki Desk   |   13 July 2022 5:30 AM GMT
టీ తేడా కొట్టిందే!
X
వరుసగా కురుస్తున్న భారీ వర్షాలు, తుపానుల ప్రభావం వల్ల దేశంలో తేయాకు (టీ) పరిశ్రమపై భారీ దెబ్బ పడింది. దేశంలో ఉత్పయ్యే తేయాకు అస్సాం, పశ్చిమబెంగాల్లోనే 80 శాతం ఉత్పత్తవుతుంది.

ప్రకృతి ప్రభావం కారణంగా అస్సాం, పశ్చిమ బెంగాల్ లోని డార్జిలింగ్ తదితర ప్రాంతాల్లో తేయాకు పెంపకం చాలా ఎక్కువగా ఉంటుంది. తేయాకు బాగా పెరగటానికి మంచి నాణ్యమైన తేయాకు దిగుమతికి పై రాష్ట్రాల్లో వాతావరణం బాగా అనుకూలంగా ఉంటుంది.

అందుకనే పై రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా తేయాకు తోటలు కనబడుతుంటాయి. ఇలాంటి తేయాకు పరిశ్రమకు హఠాత్తుగా మొదలైన భారీవర్షాలు, తుపానులు పెద్ద దెబ్బే కొట్టింది. మామూలుగా అయితే జూన్, జూలైలో భారీవర్షాలు, తుపానులు ఉండవు.

కాబట్టి పండించిన తేయాకును కోసేసి ప్రాసెసింగ్ మొదలుపెట్టేస్తారు. కానీ ఈ సంవత్సరం ఉన్నట్లుంగా జూన్లో భారీ వర్షాలు నమోదయ్యాయి. దాంతో తేయాకు మీద ప్రభావం పడింది. సరే ఏదోలా నెట్టుకుని రావచ్చులే అనుకున్నారందరు.

అయితే ఎవరు ఊహించని రీతిలో జూలైలో తుపాను ప్రభావం మొదలైంది. తేయాకు దిగుబడికి తుపాను లేదా కరువు ఏమాత్రం సరిపడదు. ముందేమో భారీ వర్షాలు ఇపుడేమో తుపాను ప్రభావం తోడవ్వటంతో తేయాకు దిగుమతి బాగా తగ్గిపోయేట్లుంది. పోయిన సంవత్సరంతో పోలిస్తే జూన్ లో అస్సాంలో 27 శాతం ఉత్పత్తి తగ్గిపోయిందని టీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అస్సాం కార్యదర్శి దీపాంకర్ దేకా చెప్పారు. బ్రహ్మపుత్ర లోయలో 11 శాతం, బరాక్ లోయలో 16 శాతం ఉత్పత్తి తగ్గిపోయిందన్నారు.

ఇక బెంగాల్లో కూడా తెయాకు దిగుబడి 40 శాతం తగ్గిపోయిందట. అంటే ఈ రెండు రాష్ట్రాల్లోని భారీ తగ్గుదల వల్ల దేశవ్యాప్తంగా తేయాకు ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోవటం ఖాయం. ఉత్పత్తి తగ్గిపోతే ధరలు అమాంతం పెరిగిపోవటం ఖాయం. కాబట్టి టీ ప్రేమికులకు ఈ వార్త కాస్త చేదుగానే ఉంటుంది.