Begin typing your search above and press return to search.

తీపి కబురు ఏది? నెలవుతున్నా ప్రకటించని కేసీఆర్

By:  Tupaki Desk   |   27 Jun 2020 8:00 AM IST
తీపి కబురు ఏది? నెలవుతున్నా ప్రకటించని కేసీఆర్
X
వారం రోజుల్లో దేశం మొత్తం ఆశ్చర్యపోయేలా రైతులకు ఓ తీపి కబురు చెబుతా.. కొంత ఉత్కంఠ.. సస్పెన్స్ ఉండాలని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ప్రకటన చేసి కొన్నాళ్లయితే నగల దాటుతది. అయినా ఎలాంటి తీపి కబురు ఇప్పటివరకు కేసీఆర్ నోటి నుంచి రాలే. వారమన్నాడు.. నెల అయితాంది ఆ తీపి కబురు ఎప్పుడు అంటూ రైతులతో పాటు ప్రజలు.. ప్రతిపక్షాలు, మీడియా కూడా సందేహం వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ ఎప్పటి లాగ మర్సిండా.. లేదా ఆ తీపి కబురు అంత పనికొచ్చే ముచ్చట కాద అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

తాజాగా గురువారం (జూన్ 25) నాడు ఆరో విడత హరితహారం కార్యక్రమం మెదక్ జిల్లా నర్సాపూర్ లో సీఎం కేసీఆర్ అల్లనేరేడు మొక్క నాటి ప్రారంభించారు. అనంతరం తన ప్రసంగంలో ఈ తీపి కబురు ఉంటదని భావించగా మొక్కలు నాటురి.. అడవిని పెంచుదామని చెప్పి వెళ్లిపాయె. ఎలాంటి కబురు ప్రకటించలేదు. మే 29వ తేదీన మర్కూక్ సమీపంలో కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ ప్రారంభోత్సవంలో కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే.

కేసీఆర్ ప్రకటన చేసిన తర్వాత మీడియాతో పాటు రైతులు, ప్రజలు ఆ తీపి కబురుపై ఆసక్తిగా చర్చించుకున్నారు. ప్రతిపక్షాలు కూడా ఆసక్తిగా గమనించాయి. కానీ ప్రకటన చేసి మూడు వారాలు దాటింది. ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. రైతుల కోసం కేసీఆర్ తీపి కబురు అందించనలేదు. మరోవైపు రైతులు భూ సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల పెద్దపల్లి జిల్లాలో ఓ రైతు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆత్మహత్యకు పాల్పడడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది.

పలుచోట్ల రైతులు తీవ్ర కష్టాలు పడుతున్నారు. ఇక వ్యవసాయ పనులు మొదలయ్యాయి. కొత్తగా నియంత్రిత వ్యవసాయం అని కేసీఆర్ ప్రకటించారు. అది కొంత గందరగోళంగా ఉంది. ఎలాంటి స్పష్టత లేదు. ఈ సమయంలో కేసీఆర్ రైతులకు ఒక సందేశం ఇవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. ఇప్పటికైనా కేసీఆర్ రైతులకు తీపి కబురు ప్రకటించాలని అందరూ కోరుతున్నారు.