Begin typing your search above and press return to search.

ఐపీల్ కు భలే కిక్ స్టార్ట్.. మూడు పెద్ద జట్లకూ షాక్

By:  Tupaki Desk   |   28 March 2022 12:30 PM GMT
ఐపీల్ కు భలే కిక్ స్టార్ట్.. మూడు పెద్ద జట్లకూ షాక్
X
గత రెండేళ్లుగా భారత అభిమానులకు పూర్తిగా వినోదం పంచలేకపోయిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్).. ఈసారి వస్తూనే మజా మజా అందిస్తోంది. శనివారం లీగ్ తొలి మ్యాచ్ కాస్త చప్పగా సాగినా.. ఆదివారం నాటి రెండు మ్యాచ్ లూ ప్రేక్షకులకు వినోదం పంచాయి. మొత్తం మూడు మ్యాచ్ ల్లోనూ పెద్ద జట్లకు షాక్ తగలడం గమనార్హం.

మొదటి రోజు చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే)కు కోల్ కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) ఝలక్ ఇవ్వగా, రెండో రోజు ముంబై ఇండియన్స్ కు ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు పంజాబ్ కింగ్స్ షాక్ ఇచ్చాయి. మూడు ఫలితాలను చూస్తుంటే.. ఈసారి లీగ్ లో కొత్త చాంపియన్ పుట్టుకొచ్చినా ఆశ్చర్యం లేదనిపిస్తోంది. కాకపోతే.. ఇప్పుడే ఆ విషయాన్ని కచ్చితంగా చెప్పలేం.

భారీ స్కోర్లు.. అయినా సరిపోలేదు ఆదివారం నాటి మ్యాచ్ ల్లో ముంబై, బెంగళూరు రెండూ భారీ స్కోర్లు చేశాయి. ఢిల్లీపై మొదట బ్యాటింగ్ కు దిగిన ముంబై 20 ఓవర్లలో 177 పరుగులు చేసింది. బుమ్రా, మురగన్ అశ్విన్, టైమల్ మిల్స్ తో కూడిన ముంబై బౌలింగ్ వనరుల పరంగా చూస్తే ఢిల్లీకి ఇది ఛేదనలో పెద్ద స్కోరే..? కానీ, యువకులతో కూడిన ఢిల్లీ బెదరలేదు.

కెప్టెన్ రిషబ్ పంత్ (1) విఫలమైనా.. యువ ఓపెనర్ షా (24 బంతుల్లో 38), లలిత్ యాదవ్ (38 బంతుల్లో 48నాటౌట్), అక్షర్ పటేల్ (17 బంతుల్లో 38 నాటౌట్) అద్భుతంగా ఆడి క్యాపిటల్స్ ను విజయ పథంలో నడిపారు. ముఖ్యంగా లలిత్, అక్షర్ 30 బంతుల్లోనే 75 పరుగులు జోడించి ముంబైకి పరాజయం మిగిల్చారు.

వీరి ధాటికి బుమ్రా కేవలం 3.2 ఓవర్లలోనే 38 పరుగులివ్వడం గమనార్హం. ఇంకా 10 బంతులు మిగిలి ఉండగానే ఢిల్లీ 179 పరుగులు చేసిందంటేనే ఏవిధంగా ఆడిందో చెప్పొచ్చు. ఈ మ్యాచ్ ద్వారా లలిత్, అక్షర్ రూపంలో ముంబైకి ఫినిషర్లు దొరికారనే అభిప్రాయం వ్యక్తమైంది. ఇక ఆదివారం సాయంత్రం జరిగిన రెండో మ్యాచ్ లో బెంగళూరు మొదట బ్యాటింగ్ చేసి పంజాబ్ బౌలింగ్ ను ఉతికేసింది. కేవలం 2 వికెట్లే కోల్పోయి 205 పరుగులు చేసింది.

కెప్టెన్ డుప్లెసిస్ 57 బంతుల్లోనే 7 సిక్స్లులు, 3 ఫోర్లతో 88 పరుగులు చేసి జట్టుకు భారీ స్కోరు అందించాడు. విరాట్ కోహ్లి (29 బంతుల్లో 41), దినేశ్ కార్తీక్ (14 బంతుల్లో 32) అద్భుతంగా ఆడి బెంగళూరు దే విజయం అన్నంత స్కోరు ఇచ్చారు. కానీ, పంజాబ్ అదరలేదు. కెప్టెన్ మయాంక్ అగర్వాల్ (32), మరో ఓపెనర్ శిఖర్ ధావన్ (43) అద్భుత ఆరంభం అందివ్వగా శ్రీలంక వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ భనూక రాజపక్స (22 బంతుల్లో 43; 4 ఫోర్లు, 2 సిక్స్లులు) చెలరేగాడు.

ఇక షారూక్ ఖాన్ (20 బంతుల్లో 24 నాటౌట్), ఓడియన్ స్మిత్ (8 బంతుల్లో 25 నాటౌట్; 3 సిక్స్లులు, ఫోర్) ఫినిషింగ్ టచ్ ఇచ్చారు. దీంతో 208 పరుగులు చేసి మరో ఓవర్ మిగిలి ఉండగానే పంజాబ్ విజయబావుటా ఎగురవేసింది. పంజాబ్ బ్యాట్స్ మన్ ధాటికి టీమిండియా బౌలర్ సిరాజ్ 4 ఓవర్లలోనే 59 పరుగులివ్వడం గమనార్హం.

మొత్తానికి బ్యాటింగ్ లో ఎంత కొట్టినా.. బెంగళూరు బౌలింగ్ ఎప్పుడూ వీకే అన్న సంప్రదాయాన్ని చాటుతూ ఆ జట్టు ఓటమిని మూటగట్టుకుంది. కొత్త కెప్టెన్ డుప్లెసిస్ ఎంత త్వరగా ఈ విషయంపై చూపు నిలిపితే అంత
మేలు. శనివారం జరిగిన మ్యాచ్ లోనూ చెన్నైని 131 పరుగులకే కట్టడి చేసిన కోల్ కతా అనంతరం తేలిగ్గా లక్షాన్ని ఛేదించిన సంగతి తెలిసిందే.

లీగ్ లో మళ్లీ మన కళ తొలి మ్యాచ్ ను వదిలేస్తే.. ఆదివారం నాటి రెండు మ్యాచ్ లలో భారీ స్కోర్లు నమోదయ్యాయి. సిక్సులు, ఫోర్ల హోరు కనిపించింది. లక్ష్యాలు భారీగానే ఉన్నా.. ప్రత్యర్థులు ఛేదించారు. అంటే.. మళ్లీ ఐపీఎల్ కు మన కళ రానున్నట్లు తెలుస్తోంది.

రెండేళ్లుగా కొవిడ్ కారణంగా ఓసారి సగం భారత్ లో,ఓసారి పూర్తిగా యూఈఏలో సాగిన లీగ్ లో అంతగా భారీస్కోర్లు నమోదు కాలేదు. అక్కడి పిచ్ లు నిదానంగా ఉండడమే దీనికి కారణం. ఈసారి మాత్ర కొవిడ్ భయాలు తొలగడంతో లీగ్ పూర్తిగా భారత్ లోనే జరుగనుంది. అంటే.. అభిమానులకు పండుగే పండుగ.