Begin typing your search above and press return to search.

ఈ జనరేషన్ కు ఏమైంది? ఏంటీ పెళ్లి పిచ్చి?

By:  Tupaki Desk   |   9 Nov 2020 11:20 PM IST
ఈ జనరేషన్ కు ఏమైంది? ఏంటీ పెళ్లి పిచ్చి?
X
సమాజం మారింది. పోకడలు మారాయి. ఆధునికత ముసుగులో యువతీ యువకులు ఏం చేస్తున్నారో తెలియడం లేదు. స్వేచ్ఛ ఎక్కువైపోయింది. తమకు ఇష్టమైనది దక్కకపోతే ఓర్చుకోవడం లేదు. నచ్చిన దాని కోసం ఎంతకైనా తెగిస్తున్నారు. ‘మగధీర’ సినిమాలో విలన్ గా ‘నాకు దక్కనిది ఎవ్వరికీ దక్కకూడదన్న’ కసి, పట్టుదలను నేటి యువత ప్రదర్శిస్తున్నారు. తాజాగా ఇండోర్ లో ఓ యువతి కూడా అలానే చేసింది.

ఇష్టమైన వాడితో పెళ్లి జరిపించకపోతే ప్రాణాలు తీసుకుంటానంటూ ఓ మైనర్ హోర్డింగ్ పైకి ఎక్కి కూర్చొని కంగారుపెట్టింది. చివరకు ప్రియుడు వచ్చి బతిమిలాడితే కానీ కిందకు దిగలేదు.

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ లో ఆదివారం ఈ తతంగం చోటుచేసుకుంది. ఇండోర్ లోని పర్ దేశీ పురాకు చెందిన ఓ మైనర్ అదే ప్రాంతానికి చెందిన ఓ యువకుడిని ఇష్టపడింది. అతడినే పెళ్లి చేసుకుంటానని పట్టుబట్టింది.

అయితే ఇందుకు తల్లి ససేమిరా అన్నది. దీంతో ఆగ్రహించిన ఆ బాలిక అక్కడికి దగ్గరలోని హోర్డింగ్ పైకి ఎక్కింది. నచ్చినవాడితో పెళ్లి చేయకుంటే కిందకు దూకి చస్తానంటూ బెదిరింపులకు దిగింది.

తల్లిదండ్రులు, బంధువులు, చుట్టూ మూగిన జనం.. ఆఖరికి పోలీసులు కూడా బతిమిలాడినా పట్టువీడలేదు. మొబైల్ ఫోన్ ను చూసుకుంటూ పైనే కూర్చొని హంగామా సృష్టించింది.

చివరకు ఆ బాలికను ప్రేమిస్తున్న యువకుడు వచ్చి నచ్చజెప్పి కిందకు దించాడు. బాలిక కిందకు దిగడంతో ఆమె తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. ఇలా ఆవేశాలకు పోయి యువతకు తమకు దక్కాల్సిన దానికోసం ఎంతకైనా తెగిస్తున్నారు.