Begin typing your search above and press return to search.

ఆ బ్యాంకుకు ఆ రైతు 31 పైసల బాకీనట.. దానికేం చేశారో తెలిస్తే ఒళ్లు మండుద్ది

By:  Tupaki Desk   |   29 April 2022 5:30 AM GMT
ఆ బ్యాంకుకు ఆ రైతు 31 పైసల బాకీనట.. దానికేం చేశారో తెలిస్తే ఒళ్లు మండుద్ది
X
బడా పారిశ్రామికవేత్తలకు.. వ్యాపారులకు మంది సొమ్మును అప్పు రూపంలో తేరగా అప్పులు ఇచ్చేసే బ్యాంకులకు దేశంలో కొదవ లేదు. సామాన్యుడు ఎవరైనా వెయ్యి రూపాయిలు అప్పు అడిగితే సవాలచ్చ క్వశ్చన్లు వేసే బ్యాంకులు.. వేలాది కోట్ల రూపాయిల్ని అప్పణంగా అప్పుల పేరుతో ఇచ్చేయటం.. వారుకాస్తా ఎగ్గొట్టేయటం.. అందుకు ప్రభుత్వాలు సరేనని ఊరుకోవటం.. కొన్ని సందర్భాల్లో ప్రభుత్వాలే వారి రుణాల్ని రైటాఫ్ చేయటం లాంటివెన్నో చూశాం.

ఇవన్నీ ఒక ఎత్తు అయితే.. బడా బాబుల విషయంలో ఉదారంగా ఉంటూ వేలాది కోట్ల ప్రజల సొమ్మును కొందరి పరం చేస్తుంటే పెద్దగా పట్టించుకోరు కానీ.. ఒక సామాన్యుడు 31 పైసలు బాకీ ఉన్నారంటూ అతగాడికి చుక్కలు చూపించిన ఉదంతం గురించి తెలిస్తే ఒళ్లు మండిపోక మానదు. ఇలాంటి తీరును ప్రదర్శించే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్ బీఐ)ను దరిద్రపుగొట్టు బ్యాంక్ అనక ఇంకేం అనగలం? అసలేం జరిగిందంటే..

గుజరాత్ రాష్ట్ర రాజధాని అహ్మదాబాద్ కు దగ్గర్లోని ఖోరజ్ అనే ఊరుంది. ఆ ఊరుకు చెందిన రైతు శ్యాంజీ భాయ్. ఆయన తన పేరు మీద ఉన్న కొంత భూమిని రాకేశ్.. మనోజ్ లకు అమ్మాడు. భూమిని విక్రయించటానికి ముందు ఈ భూమిపై శ్యాంజీ రూ.3 లక్షలు రుణం తీసుకున్నాడు. భూమిని అమ్మిన కొద్ది రోజులకే తాను బ్యాంకు నుంచి తీసుకున్న అప్పును చెల్లించేశాడు. ఇదిలా ఉంటే.. భూమిని కొన్న వారు ఆ భూమిని రెవెన్యూ రికార్డుల్లో తమ పేరును నమోదు చేసుకోవటానికి ప్రయత్నించారు.

అయితే.. అప్పునకు సంబంధించి బ్యాంకు ఇవ్వాల్సిన నో డ్యూస్ సర్టిఫికేట్ ఇవ్వటానికి ఒప్పుకోలేదు. బ్యాంకు వద్దకు వెళితే సమస్య పరిష్కారం కాకపోవటంతో భూమిని కొన్న కొత్త యజమానులు రెండేళ్ల క్రితం గుజరాత్ హైకోర్టును ఆశ్రయించారు.

తాజాగా ఈ కేసు విచారణకు వచ్చింది. భూమి పై ఉన్న అప్పు తీరిపోయిన తర్వాత కూడా నో డ్యూస్ సర్టిఫికేట్ ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించగా.. బ్యాంకు వారు ఇచ్చిన సమాధానం వింటే ఒళ్లు మండిపోక మానదు. నో డ్యూస్ సర్టిఫికేట్ ను సిస్టం జనరేట్ చేస్తుందని.. రైతు తీసుకున్న రుణంలో ఇంకా 31 పైసలు బకాయిలు ఉన్నాయని.. అందుకే సర్టిఫికేట్ ఇవ్వలేదని బ్యాంకు వర్గాలుపేర్కొన్నాయి.

ఈ సమాధానంపై హైకోర్టు ధర్మాసనం తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేసింది. బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టం ప్రకారం యాభై సైసల కంటే తక్కువగా ఉన్న రుణం ఉంటే దాన్ని లెక్కలోకి తీసుకోరని.. రైతు అప్పు మొత్తం తీర్చినా సర్టిఫికేట్ ఎందుకు ఇవ్వలేదని మండిపడింది. బ్యాంకు మేనేజర్ కోర్టు ముందుకు హాజరు కావాలని.. ఇది ప్రజల్ని వేధించటం కాక మరేంటంటూ దులిపేసింది. కేసును మే 2కు వాయిదా వేస్తున్నట్లు పేర్కొంది. సామాన్యుల విషయంలో ఎస్ బీఐ వ్యవహరిస్తున్న ఈ తీరుపై పెద్ద ఎత్తున విమర్శలతో పాటు.. 31 పైసల అప్పు ఉదంతం గురించి తెలిసిన వారంతా తిట్టి పోస్తున్నారు.