Begin typing your search above and press return to search.

అంత కీలక విషయాన్ని కేంద్రం దాచి పెట్టిందా?

By:  Tupaki Desk   |   6 Aug 2020 4:00 PM GMT
అంత కీలక విషయాన్ని కేంద్రం దాచి పెట్టిందా?
X
మరో వివాదం తెర మీదకు వచ్చింది. భారత్ భూభాగంలోకి చైనాకు చెందిన కొందరు సైనికులు చొచ్చుకురావటం.. అనంతరం వారిని భారత సైనికులు తరమటం లాంటి ఉదంతాలతో.. యావత్ దేశం తీవ్రమైన భావోద్వేగంతో రగిలిపోవటం తెలిసిందే. ఈ సందర్భంగా మోడీ సర్కారు తీరుపై కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వచ్చాయి. ఈ ఎపిసోడ్ లో మోడీ సర్కారు మాటలకే అధిక ప్రాధాన్యత ఇచ్చారు. రాహుల్ సంధించిన ప్రశ్నల్ని పెద్దగా పట్టించుకోలేదు కూడా.

భారత్ సైనికులు పెద్ద ఎత్తున మరణించటం.. ఈ క్రమంలో చైనా సైనికుల మీద భారత్ సైనికులు దాడి చేసి ప్రతీకారం తీర్చుకున్నట్లుగా వార్తలు రావటం తెలిసిందే. ఇదిలా ఉంటే.. మే ప్రారంభం నుంచే లడఖ్ లోని భారత భూభాగంలోకి చైనా బలగాలు వచ్చినట్లుగా మంగళవారం కేంద్ర రక్షణ శాఖ వెబ్ సైట్ లో ఒక డాక్యుమెంట్ ఉంచిన వైనంపై తాజాగా వివాదం రాజుకుంటోంది.

తాము వినిపించిన వాదనకు బలం చేకూరేలా ఈ డాక్యుమెంటు ఉందన్న మాట కాంగ్రెస్ నేతల నోటి నుంచి వస్తున్న వేళ.. హటాత్తుగా ఈ డాక్యుమెంట్ వెబ్ సైట్ నుంచి మాయం కావటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. జూన్ 15న గాల్వాన్ లోయ వద్ద భారత్ - చైనా సైనికుల మధ్య ఘర్షణ చోటు చేసుకోవటం.. ఈ సందర్భంగా భారత్ కు చెందిన సైనికులు పలువురు వీర మరణం పొందటం తెలిసిందే.

దీనికి ప్రతిగా చైనాకు చెందిన 35 నుంచి 40 మంది సైనికుల వరకు మరణించినట్లుగా వార్తలు వచ్చినా.. దీన్ని చైనా మాత్రం అధికారికంగా ఎలాంటి ప్రకటనలు చేయలేదు. ఇదిలా ఉంటే.. మేలోనే చైనా బలగాలు భారత భూభాగంలోకి అడుగు పెడితే.. కేంద్రం ఈ విషయాన్ని వెల్లడించకుండా ఎందుకు దాచి పెట్టింది? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. రానున్న రోజుల్లోఈ వివాదం మరింత ముదిరి పాకాన పడే అవకాశం ఉందన్న మాట వినిపిస్తోంది.