Begin typing your search above and press return to search.

వరుడి మెడలో తాళికట్టిన వధువు

By:  Tupaki Desk   |   13 March 2019 3:31 PM IST
వరుడి మెడలో తాళికట్టిన వధువు
X
జంబలకిడి పంబ ఇక్కడ రిపీట్ అయ్యింది. ఆ సినిమాలో ఆడవాళ్లు మగాళ్లుగా.. మగాళ్లు ఆడవాళ్లుగా మారారు. కానీ ఇక్కడ సంప్రదాయాన్ని మాత్రం వధువూ.. వరుడు మార్చేశారు. వరుడి మెడలో వధువు తాళికట్టేసింది. ఈ ఆశ్చర్యకర సంఘటన కర్ణాటక రాష్ట్రంలోని విజయపుర జిల్లా ముద్దేబిహాళ్ తాలూకా నాలత వాడ గ్రామంలో చోటుచేసుకుంది.

నాలత వాడ గ్రామంలో సోమవారం జరిగిన ఈ వింత రెండు పెళ్లిళ్లలో వరుడికి వధువులే తాళి కట్టారు.అంతేకాదు.. సాంప్రదాయపు సంకెళ్లను బద్దలు కొడుతూ విలక్షణ వివాహం చేసుకున్నారు. ఇక పెళ్లికి పెట్టే ముహూర్తం కూడా వ్యతిరేకించిన వధూవరులు శుభలగ్నం లేకుండానే పెళ్లి చేసుకున్నారు.

రెండు జంటలు ఈ అరుదైన వివాహం చేసుకున్నాయి. ప్రభురాజ్ తో అంకిత.. అమిత్ తో ప్రియాకు వివాహం జరిగింది. ఈ రెండు జంటలు శుభలగ్నం - ముహూర్తం వంటి వాటిని చూసుకోకుండా పెళ్లి చేసుకున్నారు. అలాగే వధువులే వరుడి మెడలో వినూత్నంగా తాళి కట్టారు. మూడు ముళ్లు వేశారు.

సంప్రదాయ కట్టుబాట్లను కాలదన్ని.. స్వతంత్రంగా వీరు చేసుకున్న పెళ్లి ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇదెక్కడి చోద్యమని గ్రామస్థులు ముక్కున వేలేసుకున్నారు. ఇది మీడియాలో వైరల్ కావడంతో హాట్ టాపిక్ గా మారింది.

దీనిపై వధూవరులను వివరణ కోరగా.. మనం 12వ శతాబ్ధంలో లేమని.. వివాహాలు ఇదే మూస పద్ధతిలో చేసుకోవడం మాకు ఇష్టం లేదని.. దీన్ని సమూలంగా మార్చడానికే వినూత్న వివాహం చేసుకున్నామని చెప్పుకొచ్చారు.