Begin typing your search above and press return to search.

గులాబీ బ్యాచ్ కు కమలనాథుల కంప్లైంట్ గండం

By:  Tupaki Desk   |   6 Oct 2019 7:06 AM GMT
గులాబీ బ్యాచ్ కు కమలనాథుల కంప్లైంట్ గండం
X
గాలి వాటానికి తగ్గట్లుగా వ్యవహరించాలి. ఎంత పెద్ద చెట్టు అయినా. జోరున వీచే గాలికి అనుగుణంగా వంగకుంటే.. మొదటికే మోసం వచ్చే అవకాశం ఉంటుంది. అది పెద్ద చెట్టుకే కాదు. అధికారం అరచేతిలో ఉండే అధికారపక్షానికైనా. వెనుకా ముందు చూసుకోకుండా. బలప్రదర్శన చేయాలన్న ఉత్సాహంతో వ్యవహరించిన వైనం కేసీఆర్ అండ్ కోకు ఇప్పుడు కొత్త కష్టాన్ని తీసుకొచ్చే ప్రమాదం ఉందంటున్నారు.

హుజూర్ నగర్ ఉప ఎన్నిక విషయంలో ఇప్పటికే చాలినన్ని తలనొప్పులతో సతమతమవుతున్న గులాబీ బ్యాచ్ కు. రెండు రోజుల క్రితం చిన్న బాస్ కేటీఆర్ జరిపిన హుజూర్ నగర్ రోడ్ షో ఇప్పుడు కొత్త సమస్యగా మారింది. ఈ రోడ్ షోలో తమ బలాన్ని ప్రదర్శించేందుకు గులాబీ నేతలు ఏకంగా వెయ్యి వాహనాలతో రోడ్ షో నిర్వహించినట్లుగా బీజేపీ ఆరోపిస్తోంది.

నిబంధనలను అతిక్రమించి మరీ. టీఆర్ఎస్ తాజాగా నిర్వహించిన రోడ్ షోలో భారీగా డబ్బును ఖర్చు చేశారని. కేటీఆర్ రోడ్ షోలో పెట్టిన ఖర్చు లెక్క చూస్తే. రూ.28లక్షలు దాటినట్లుగా వారు చెబుతున్నారు. ప్రచార నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డిని అనర్హుడిగా ప్రకటించాలని కోరుతూ. వారు కంప్లైంట్ ఇచ్చారు.
తెలంగాణ రాష్ట్ర ఎన్నికల అధికారిక రజత్ కుమార్ కు ఇచ్చిన ఫిర్యాదుతో టీఆర్ఎస్ అధినాయకత్వం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఉత్తనే ఫిర్యాదు ఇవ్వలేదని. అందుకు తగ్గ ఆధారాల్ని కూడా తాము అందించినట్లుగా బీజేపీ నేతలు చెబుతున్న వైనం గులాబీ నేతల గుండెల్లో కొత్త గుబులుగా మారింది.

ఒకవేళ. బీజేపీ నేతలు ఇచ్చిన కంప్లైంట్ ను సీరియస్ గా తీసుకున్న పక్షంలో. సంచలన నిర్ణయాలు తీసుకున్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటున్నారు. ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 77(1) ప్రకారం సైదిరెడ్డి ఎన్నికల్లో పోటీ చేయటానికి అనర్హుడు అవుతారంటున్నారు కమలనాథులు. వెయ్యికి పైగా వాహనాల్ని కేటీఆర్ రోడ్ షోకు ఉపయోగించారని. అనుమతించిన దాని కంటే ఎక్కువ మైకులు వాడారని. భారీగా జనసేకరణ చేశారని. ప్రజా రవాణాకు ఇబ్బందులు కలిగించిన అంశాలపై కంప్లైంట్ చేశారు. మరి దీనిపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. ఉత్సాహం మంచిదే కానీ. మితిమీరితే మొదటికే మోసం వస్తుందన్న చిన్న విషయాన్ని కేసీఆర్ అండ్ కో ఎందుకు మిస్ అవుతున్నట్లు?