Begin typing your search above and press return to search.

ఓవ‌ర్ నైట్ సెల‌బ్రిటీగా బాలుడు: గుడ్డు ప‌గిలింది.. జీవితం మారింది

By:  Tupaki Desk   |   27 July 2020 2:30 PM GMT
ఓవ‌ర్ నైట్ సెల‌బ్రిటీగా బాలుడు: గుడ్డు ప‌గిలింది.. జీవితం మారింది
X
సోష‌ల్ మీడియాలో సామాన్యుడిని హీరోను చేస్తుంది. ప్ర‌ముఖుడిని అభాసుపాలు చేసేంత శ‌క్తి ఉంది. దానికి ఉదాహ‌ర‌ణే మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో జ‌రుగుతున్న ప‌రిణామం. కోడిగుడ్డు ప‌గిలిన వార్త సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారి ఓ బాలుడు ఓవ‌ర్ నైట్ స్టార్‌గా మార‌డంతో ఒక్క‌సారిగా అత‌డి జీవిత‌మే మారిపోయింది. దానికి సంబంధించిన వివ‌రాలు చ‌ద‌వండి..

ఇండోర్‌లో కుటుంబంతో క‌లిసి 13 ఏళ్ల బాలుడు పరాస్ నివసిస్తూ ఉన్నాడు. కుటుంబానికి ఆసరాగా ఉండేందుకు తోచిన ప‌నులు చేస్తుంటాడు. ఈ క్ర‌మంలో తోపుడు బండి మీద కోడిగుడ్లు విక్ర‌యించ‌డం మొద‌లుపెట్టాడు. సుమారు రూ.7 వేలు విలువైన కోడిగుడ్లు ఉన్న ట్రేను తోపుడు బండి మీద పెట్టుకొని రోడ్డు మీద వెళుతూ రోడ్డు పక్కన ఆగాడు. బండి పక్కకు నిలిపి మూత్రం పోయడానికి వెళ్లాడు. ఆ స‌మ‌యంలో అక్కడకు ఇండోర్ మున్సిపల్ కార్మికులు వ‌చ్చి ఆ బాలుడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డుపై బండి నిల‌ప‌డంతో రూ.వంద జ‌రిమానా విధించారు. ఏమైందో ఏమోగానీ ఒక్క‌సారిగా కోపంతో గుడ్ల బండిని బోల్తా వేశారు. దీంతో కోడిగుడ్లన్నీ పగిలిపోయాయి. దీంతో బాలుడు ప‌రాస్ క‌న్నీటి ప‌ర్యంత‌మ‌య్యాడు. రూ.7 వేల విలువైన కోడిగుడ్లు ప‌గ‌ల‌డంతో రోదిస్తూ కూర్చున్నాడు. ఈ ఘ‌ట‌న‌ను అక్క‌డి స్థానికులు ఫోన్‌ల‌లో రికార్డు చేశారు. అక్క‌డి స్థానికులు మున్సిప‌ల్ కార్మికుల తీరుపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు.. ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.

మున్సిపల్ సిబ్బంది కార‌ణంగా నష్టపోయిన పిల్లాడిపై అంద‌రూ జాలి ప‌డ్డారు. దీంతో బాలుడిని ఆదుకోవ‌డానికి చాలా మంది ముందుకు వ‌చ్చారు. ఈ క్ర‌మంలో కాంగ్రెస్ సీనియర్ నాయ‌కుడు దిగ్విజయ్ సింగ్ ఆ పిల్లాడికి రూ.10 వేలు స‌హాయం చేశారు. దీంతోపాటు ఆ పిల్లాడి చదువు ఖ‌ర్చు మొత్తం భరిస్తానని ప్ర‌క‌టించారు. దీంతో దీన్ని పౌరుషంగా తీసుకుని ఇండోర్ బీజేపీ ఎమ్మెల్యే స్పందించి ఏకంగా ఆ బాలుడికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద ఒక ఇంటిని ఇప్పిస్తానని హామీ ఇచ్చాడు. దీంతోపాటు అతడి చదువు ఖర్చు భరిస్తానని చెప్పడంతో పాటు రూ.2,500 న‌గదు.. దుస్తులు.. ఒక సైకిల్ ను పంపారు. మ‌రికొంద‌రు స‌హాయం చేసేందుకు ముందుకు వ‌స్తున్నారు. బాలుడిఇంటికి వచ్చి పరామర్శించి వారికి తోచిన స‌హాయం చేస్తున్నారు. ఈ విధంగా ఆ బాలుడి జీవితం ఒక్క‌సారిగా మారింది.