Begin typing your search above and press return to search.

డేంజర్ వేవ్: మంకీపాక్స్ లక్షణాలతో 22 ఏళ్ల యువకుడు మృతి.. దేశంలో కలకలం

By:  Tupaki Desk   |   31 July 2022 9:20 AM GMT
డేంజర్ వేవ్: మంకీపాక్స్ లక్షణాలతో 22 ఏళ్ల యువకుడు మృతి.. దేశంలో కలకలం
X
70వ దశకంలో గ్రామాల్లో అమ్మవారు, తట్టు అంటూ ఊరు ఊరంతా చికెన్ పాక్స్ తో బాధపడి చాలా మంది మృత్యువాత పడేవారు. నాడు వైద్యం, మందులు లేకపోవడంతో గ్రామ దేవతలకు శాంతి చేసి నాటు పసరులతో బతికేవారు. దక్షిణాఫ్రికాలో కూడా 50 ఏళ్ల క్రితం ఈ మంకీపాక్స్ ఇలానే విస్తరించింది. ఇప్పుడు ఇన్నేళ్లకు మళ్లీ అసహజ శృంగారంతో ఈ వ్యాధి మానవులకు విస్తరిస్తూ దేశాలకు దేశాలను భయపెడుతోంది.

దేశంలో మంకీపాక్స్ కేసులు క్రమంగా పెరుగుతూ ఆందోళన కలిగిస్తున్నాయి. ఇప్పటివరకూ నాలుగు కేసులు నిర్ధారణ కాగా.. తొలిసారి ఈ వైరస్ సోకిన వ్యక్తి కోలుకున్నట్లు కేరళ వైద్యశాఖ ప్రకటించింది. అయితే కొన్ని గంటల్లోనే అదే కేరళలో మంకీపాక్స్ అనుమానిత లక్షణాలతో ఓ వ్యక్తి మృతి చెందడం ఆందోళన కలిగిస్తోంది.

కేరళలోని త్రిస్సూర్ జిల్లాలో శనివారం 22 ఏళ్ల యువకుడు మంకీపాక్స్ లక్షణాలతో ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యశాఖ అధికారులు తెలిపారు. కొద్ది రోజుల క్రితమే యూఏఈ నుంచి వచ్చినట్లు వెల్లడించారు. వైరస్ నిర్ధారణ కోసం యువకుడి నమూనాలను అలప్పుజాలోని నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ప్రాంతీయ కేంద్రానికి పంపించినట్లు అధికారులు తెలిపారు.

ఇక మృతదేహాన్ని కుటుంబానికి అప్పగించి ప్రపంచ ఆరోగ్య సంస్థ నిబంధనల ప్రకారం అంత్యక్రియలు పూర్తి చేయాలని సూచించారు.

ఇక ఈ యువకుడికి చికిత్స అందించిన వైద్యుల్లోనూ ఆ లక్షణాలు కనిపించినట్లు తెలిపారు. ఆస్పత్రిలో యువకుడికి ఎలాంటి దద్దుర్లు, బొబ్బలు కనిపించలేదని.. తర్వాత కనిపించాయని.. యూఏఈ నుంచి వచ్చిన వెంటనే ఆస్పత్రిలో చేరాడని వైద్యులు తెలిపారు.

మూడు రోజుల క్రితమే యూఏఈ నుంచి తిరిగి వచ్చాడని.. అప్పటి నుంచి తీవ్ర జ్వరంతో బాధపడుతున్నట్లు బాధితుడి బంధువులు తెలిపారు. ఆస్పత్రిలో చేర్చిన తర్వాత దద్దుర్లు రావడంతో మంకీపాక్స్ గా అనుమానిస్తున్నట్లు తెలిపారు. పరీక్ష ఫలితాలు వెలువడే వరకూ ఎలాంటి ఆందోళన చెందవద్దని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.