Begin typing your search above and press return to search.

ఆ దేశ రాజధానిలో 19 అడుగుల బంగారు కుక్క విగ్రహం

By:  Tupaki Desk   |   15 Nov 2020 10:00 AM IST
ఆ దేశ రాజధానిలో 19 అడుగుల బంగారు కుక్క విగ్రహం
X
రాచరికం పోయిందని అనుకుంటాం కానీ ప్రజాస్వామ్యంలోనూ రాజరికానికి ఏ మాత్రం తీసిపోని పరిస్థితి కొన్ని దేశాల్లో కనిపిస్తుంటుంది. చేతిలో అధికారం ఉంటే చాలు తమకు తోచినట్లు చేసే దేశాధినేతలకు కొదవ లేదు. ప్రజాధనాన్ని తమకు తోచినట్లుగా పప్పుబెల్లాల మాదిరి ఖర్చు చేసేవారికి కొదవ లేదు. అలాంటి దేశాధినేత వ్యవహారం ఒకటి బయటకు వచ్చి వైరల్ గా మారింది.

తుర్కమెనిస్థాన్ అనే దేశం గురించి పెద్దగా విని ఉండరు. ఆ దేశాధినేత పుణ్యమా అని ఇప్పుడా దేశంలోని ఆరాచకం వెలుగు చూసింది. ఆ దేశానికి అధ్యక్షుడగా వ్యవహరిస్తున్నారు గర్బాంగులీ బెర్దిముకమెదోవ్. అతగాడికి పశ్చిమాసియాకు చెందిన అల్ బాయ్ అనే జాతి కుక్క చాలా ఇష్టం. దాని గుర్తుగా ఏదైనా చేయాలని భావించిన ఆయన.. ఆ కుక్క ప్రతిమను భారీ ఎత్తున తయారు చేయించాడు. అది కూడా బంగారంతో.

దేశ రాజధాని యాష్గబట్ ప్రధాన కూడలిలో తాను తయారు చేయించిన బంగారు కుక్క విగ్రహాన్ని ఏర్పాటు చేయించాడు. 19 అడుగులు ఉండే ఈ కుక్క విగ్రహం కింద భాగంలో ఒక స్క్రీన్ ఏర్పాటు చేశాడు. దానిలో అలబాయ్ కుక్కలకు సంబంధించిన వీడియోలు ప్లే అయ్యేలా ఏర్పాటు చేశారు.

ఈ జాతి కుక్కల గురించి చెబుతూ.. ఇవి బాగా కాపలా కాస్తాయని.. పులులు.. తోడేళ్లను తరిమికొట్టే సత్తా వీటి సొంతమని పేర్కొన్నారు. చివర్లో తనలోని రాజకీయ నేతను గుర్తించేలా కొన్ని వ్యాఖ్యలు చేశారు. తన ఇష్టాన్ని దేశ ప్రజల ఇష్టంగా అభివర్ణిస్తూ.. తాను విగ్రహం ఏర్పాటు చేసిన జాతి కుక్కల్ని దేశ ప్రజలు అమితంగా ఇష్టపడతారని.. వారి ఇష్టాల్ని గౌరవించే ప్రయత్నంలో భాగంగా బంగారు విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్లుగా పేర్కొన్నారు. ఇతగాడి తీరు మీద పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.