కేజీఎఫ్ బాబు ఆస్తుల లెక్క వింటే అవాక్కు అవ్వాల్సిందే

Thu Nov 25 2021 10:07:46 GMT+0530 (IST)

Yusuf Sharif Revealing his assets in nomination papers

అతడో సాదాసీదా పాత ఇనుము సామాన్లు అమ్ముకునే వ్యాపారి. అలా అని తక్కువగా అంచఉనా వేస్తే.. అంతకు మించిన తప్పు మరొకటి ఉండదు. పాత ఇనుముతో వ్యాపారం చేసే వారి ఆస్తులు ఎంత ఉంటాయన్న అంచనాకు సైతం ఆశ్చర్యాన్ని కలిగించే ఉదంతం తాజాగా బయటకు వచ్చింది. అది కూడా సదరు వ్యాపారి కర్ణాటక విధాన సభ అదేనండి తెలుగురాష్ట్రాల్లో శాసన మండలి అంటామే అదే.ఎన్నికల బరిలో నిలిచిన వేళ..నామినేషన్ పత్రాల్లో తన ఆస్తుల లెక్క వెల్లడించటం.. ఆయన ఆస్తుల గురించి తెలిసిన వారంతా ముక్కున వేలేసుకుంటున్నారు. ఇంతకీ ఆ అపర శ్రీమంతులు ఎవరు? అన్న విషయంలోకి వెళితే..

కర్ణాటక విధాన పరిషత్తు ఎన్నికల బరిలోకి దిగారు యూసుఫ్ షరీఫ్ అలియాస్ కేజీఎఫ్ బాబు.

కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన ఆయన.. తన ఆస్తుల వివరాల్ని వెల్లడించారు. తాజాగా దాఖలు చేసిన నామినేషన్ పత్రాల ప్రకారం తన వద్ద రూ.1643 కోట్ల స్థిరాస్తి.. రూ.97 కోట్ల చరాస్తి ఉందని చెప్పి అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు. దీంతో బెంగళూరులోని అత్యంత శ్రీమంతుల జాబితాలోకి కేజీఎఫ్ బాబు చేరిపోయారు.

చాలా కాలం పాత సామాను వ్యాపారం చేసిన ఆయనకు కేజీఎఫ్ (కోలార్ గోల్డ్ ఫీల్డ్స్) బాబు అని పేరు రావటానికి కారణం లేకపోలేదు. కేజీఎఫ్ కు చెందిన పాత ట్యాంకుల్ని అతడు కొనుగోలు చేసి.. అమ్మేవాడు. ఇది అతడికి లాభసాటి వ్యాపారంగా మారిందని చెబుతారు. దీంతో.. ఆయన పేరు కేజీఎఫ్ బాబుగా స్థిరపడిపోయింది.

అనంతరం తన నివాసాన్ని బెంగళూరుకు మార్చిన అతను.. స్థిరాస్తి వ్యాపారంలోకి దిగటంతో మరింత ఆర్థికంగా బలపడ్డాడు. ఇద్దరు భార్యలున్న బాబుకు.. మొత్తం 23 బ్యాంకు ఖాతాలు ఉన్నట్లుగా పేర్కొన్నారు.

చాలామంది రాజకీయ నాయకులకు కోట్లాది రూపాయిల ఆస్తులు ఉన్నా.. సొంత కార్లు ఉండవు. అందుకు భిన్నంగా కేజీఎఫ్ బాబుకు మాత్రం రూ.2.99 కోట్ల విలువైన మూడు కార్లు.. రూ.1.11 కోట్ల విలువైన వాచ్ ఉన్నట్లుగా పేర్కొన్నారు.

వీటితో పాటు నాలుగున్నర కేజీల బంగారం.. ఒక్కొక్కటి లక్ష రూపాయిలు విలువ చేసే నాలుగు సెల ఫోన్లు.. మూడు చోట్లరూ.48 కోట్ల విలువైన వ్యవసాయ భూములు.. రూ.1593 కోట్లు విలువ చేసే 26 స్థలాలు ఉన్నాయి.

మరిన్ని ఆస్తులు ఉన్న కేజీఎఫ్ బాబుకు అప్పులు లేవా? అంటే ఉన్నాయని.. అప్పులన్ని కలిపితే రూ58 కోట్లు ఉంటాయని పేర్కొన్నారు. తాజాగా వెల్లడించిన ఆస్తుల ప్రకటన కేజీఎఫ్ బాబును వార్తల్లోకి నిలపటమే కాదు.. రాజకీయ వర్గాల్లో ఇప్పుడాయన హాట్ టాపిక్ గా మారారు.