Begin typing your search above and press return to search.

టీడీపీ ఎందుకింత రద్దాంతం చేస్తోంది ?

By:  Tupaki Desk   |   19 Jun 2021 2:30 PM GMT
టీడీపీ ఎందుకింత రద్దాంతం చేస్తోంది ?
X
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్య నాద్ దాస్ పదవీ కాలాన్ని పొడిగిస్తే తెలుగుదేశంపార్టీకి ఏమిటి బాధో అర్ధం కావటంలేదు. చీఫ్ సెక్రటరీ పదవీ కాలాన్ని పొడిగించవద్దని టీడీపీ రాజ్యసభ ఎంపి కనకమేడల రవీంద్ర నాద్ ఢిల్లీలో డీవోపీటి ఉన్నతాధికారులకు లేఖ రాయటం విచిత్రంగా ఉంది. చీఫ్ సెక్రటరీగా ఎవరుండాలనేది ముఖ్యమంత్రి ఇష్టం. ఇందుకు కేంద్రప్రభుత్వం కూడా వ్యతిరేకంగా వెళ్ళే అవకాశాలు దాదాపు ఉండవు.

ఈ పద్దతిలోనే ఆదిత్యనాద్ దాస్ ను చీఫ్ సెక్రటరీ అయ్యారు. చీఫ్ సెక్రటరీగా నియమితులయ్యే సమయానికి సదరు ఐఏఎస్ అధికారిపై ఏవైనా కేసులున్నాయా ? అనే విషయాన్ని డీవోపీటీ క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. సదరు సీనియర్ ఐఏఎస్ ట్రాక్ రికార్డు చూసిన తర్వాతే చీఫ్ సెక్రటరీగా నియమించేందుకు కేంద్రం అనుమతిస్తుంది. ముగ్గురు సభ్యుల జాబితాలోని ఎవరిపైనైనా కేసులున్నట్లు డీవోపీటీ అభ్యంతరాలు చెబితే కేంద్రం అదే విషయాన్ని ప్రస్తావించి వేరే జాబితాను పంపమంటుంది.

ఆదిత్యనాద్ పై కేసుల విషయంలో కేంద్రం కన్వీన్సయిన తర్వాత మాత్రమే చీఫ్ సెక్రటరీ నియామకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పైగా ఆదిత్య నాద్ పై ఉన్న ఆరోపణలేవీ కోర్టుల్లో నిర్ధారణ కాకపోగా సాక్ష్యాధారాలు లేవని కొట్టేసిందని వైసీపీ నేతలంటున్నారు. చీఫ్ సెక్రటరీగా నియామకం సమయంలో లేని అభ్యంతరం సర్వీసును మూడు నెలలు పొడిగించే విషయంలో ఎందుకుంటుంది ?

అయినా ఎవరిని ఎక్కడ నియమించుకోవాలనేది పూర్తిగా ముఖ్యమంత్రి ఇష్టమన్న చిన్న విషయం కూడా టీడీపీకి తెలీదా ? మూడు రోజుల క్రిందట ఎంఎల్సీల జాబితాపైనా రాద్దాంతం చేసింది. ఇపుడు చీఫ్ సెక్రటరీ సర్వీసు పొడిగింపుపైనా గోల మొదలుపెట్టింది. ఆమధ్య స్టేట్ ఎలక్షన్ కమీషనర్ నీలం సాహ్నీ నియామకంపైన కూడా రద్దాంతం చేసింది. చంద్రబాబునాయుడు అధికారంలో ఉన్నపుడు ఇలాగే ఎవరైనా అభ్యంతరాలను వ్యక్తం చేస్తే నియామకాలను వెనక్కు తీసుకున్నారా ?

తమకు సంబంధంలేని విషయాల్లో కూడా అనవసరంగా రాద్దాంతం చేయటం వల్ల పోయేది టీడీపీ పరువే అన్నవిషయం అర్ధం కావటంలేదు. ప్రజలకు ఉపయోగపడే అంశాలపై ఏవైనా డిమాండ్లు చేసినా ఉపయోగం ఉంటుంది కానీ పరిపాలనా సంబంధిత విషయాల్లో కూడా తాము చెప్పినట్లు జగన్మోహన్ రెడ్డి వినాలని చంద్రబాబు కోరుకుంటున్నారా ? అనే డౌట్లు పెరిగిపోతోంది.