Begin typing your search above and press return to search.

జంప్ జిలానీల్లో ఈయ‌న స్పెష‌ల్‌.. ఇప్పుడు కార్న‌ర్ అయ్యాడు పాపం!

By:  Tupaki Desk   |   12 Jan 2021 7:10 AM GMT
జంప్ జిలానీల్లో ఈయ‌న స్పెష‌ల్‌.. ఇప్పుడు కార్న‌ర్ అయ్యాడు పాపం!
X
రాజ‌కీయాల్లో పార్టీలు మారే వారు కామ‌న్‌. ఒక పార్టీలో గుర్తింపు లేక‌నో.. లేదా ప‌ద‌వులు ద‌క్క‌క‌నో.. పార్టీలు మారే వారు కామ‌న్‌గానే క‌నిపిస్తున్నారు. అయితే.. ప్ర‌కాశం జిల్లాకు చెందిన ఎస్సీ సామాజిక వ‌ర్గానికి చెందిన యువ నాయ‌కుడి శైలి మాత్రం దీనికి చాలా భిన్నంగా ఉంద‌నే వాద‌న వినిపిస్తోంది. ఆయ‌న కూడా జంప్ జిలానీనే అయినా.. రాష్ట్రంలోని ఇత‌ర జంపింగ్‌ నేత‌ల‌తో పోల్చుకుంటే మాత్రం ఈయ‌న శైలి చాలా డిఫ‌రెంట్‌గా క‌నిపిస్తుంది. ఆయ‌నే ఎర్ర‌గొండ పాలెం నియోజ‌క‌వ‌ర్గం నుంచి ప‌లుమార్లు గెలిచి.. గ‌త ఎన్నిక‌ల్లో క‌నీసం టికెట్ కూడా ద‌క్కించుకోలేక ఇబ్బంది ప‌డిన పాల‌ప‌ర్తి డేవిడ్‌రాజు.

డేవిడ్ రాజును.. నియోజ‌క‌వ‌ర్గం ప్ర‌జ‌లు గుండెల్లో పెట్టుకున్న‌మాట వాస్త‌వం. పార్టీల‌కు అతీతంగా కూడా ప్ర‌జ‌లు ఆయ‌న‌ను అభిమానించారు. డేవిడ్ రాజు పొలిటిక‌ల్ ఎంట్రీ టీడీపీతో జ‌రిగింది. 1999లో టీడీపీ త‌ర‌ఫున బ‌రిలోకి దిగిన ఆయ‌న‌ సంతనూతలపాడు ఎమ్మెల్యేగా గెలిచారు. అంతకు ముందు జడ్పీ ఛైర్మన్‌గాను పని చేశారు. 2009లో ఎర్రగొండపాలెం నుంచి టీడీపీ టికెట్‌పై పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత వైసీపీలో చేరారు. ఈ క్ర‌మంలోనే 2014లో వైసీపీ టికెట్ సంపాయించుకుని ఇక్క‌డ నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచారు.

అయితే.. వైసీపీ అధికారంలోకి రాలేదు. ఇప్ప‌టికే పార్టీ మారిన‌ప్ప‌టికీ.. ప్ర‌జ‌లు ఆద‌రించినా.. డేవిడ్ రాజు మాత్రం ప‌ద‌విపై దృష్టి పెట్టుకుని మ‌రోసారి పార్టీ మారారు. టీడీపీ అధికారంలోకి రావడంతో ఎక్కువ రోజు లు వైసీపీలో ఉండలేకపోయారు. టీడీపీ కండువా కప్పేసుకుని సొంత గూటికి వెళ్లిపోయారు. అయితే.. పార్టీ అధికారంలో ఉన్న‌ప్ప‌టికీ.. చంద్ర‌బాబు ద‌గ్గ‌ర మైన‌స్ మార్కులు ప‌డ‌డంతో ఏ ప‌ద‌వీ ద‌క్క‌లేదు. పోనీ.. గ‌త ఎన్నిక‌ల్లో టికెట్ అయినాద‌క్కుతుంద‌ని ఆశించారు. కానీ, బాబు ఈ విష‌యంలో యూట‌ర్న్ తీసుకుని చివ‌రి నిముషంలో డేవిడ్ రాజును ప‌క్క‌న పెట్టి అజితారావుకు టికెట్ ఇచ్చారు.

దీంతో డేవిడ్ రాజు ఆగ్ర‌హించి.. వైసీపీ అధికారంలోకి రాగానే.. మ‌ళ్లీ టీడీపీ నుంచి వైసీపీలోకి చేరిపోయారు. ఇక‌, ఇక్క‌డైనా ఏదో ఒక నామినేటెడ్ ప‌ద‌వి ద‌క్క‌క పోతుందా? అని ఆశ పెట్టుకున్నారు. కానీ, నిల‌క‌డ‌లేని నేత‌గా పేరు ప‌డ‌డంతో వైసీపీలోనూ ఆయ‌న‌ను ఎవ‌రూ ప‌ట్టించుకోవ‌డం లేదు. ఫ‌లితంగా ఇప్పుడు వైసీపీలో ఉన్నార‌నే పేరు త‌ప్ప డేవిడ్‌రాజుకు గుర్తింపు లేకుండా పోయింది. పోనీ.. ఇప్పుడు టీడీపీలోకి జంప్ చేద్దామ‌ని అనుకున్నా.. పార్టీ బ‌లోపేతం అవుతుందో లేదో.. అనే సందేహం వెంటాడుతోంది. ఈ క్ర‌మంలో ఆయ‌న రాజ‌కీయంగా తీవ్రంగా స‌త‌మ‌త‌మ‌వుతున్నారు. ఏదో ఒక పార్టీని న‌మ్ముకుని అడుగులు వేసి ఉంటే.. ఈ ప‌రిస్థితి త‌మ నేత‌కు వ‌చ్చేది కాద‌ని రాజుగారి అనుచ‌రులు చెబుతున్నారు. ఇదీ సంగ‌తి!!