Begin typing your search above and press return to search.

సోనియా ఇటలీ కాదా అని కాంగ్రెస్ డిప్యూటీ సీఎం ని ఎందుకు కలుస్తున్నట్లు...?

By:  Tupaki Desk   |   29 May 2023 4:00 PM GMT
సోనియా ఇటలీ కాదా అని కాంగ్రెస్ డిప్యూటీ సీఎం ని ఎందుకు కలుస్తున్నట్లు...?
X
వైఎస్ షర్మిల. వైఎస్సార్ తనయ, జగన్ చెల్లెలు. తెలంగాణాలో వైఎస్సార్టీపీని పెట్టి రెండున్నరేళ్ళుగా దాన్ని నడపలేక ఆపసోపాలు పడుతున్నారు. ఏకంగా మూడు వేల ఆరు వందల కిలోమీటర్ల మేర పాదయాత్ర చేసినా పార్టీ బలం పడలెదు. ఒక్క బడా నేత ఆమె పార్టీ వైపు తొంగి చూడలేదు. దాంతో పార్టీని విలీనం చేస్తారా అన్న చర్చ చాలా కాలంగా జరుగుతూ వస్తోంది.

మొదట ఆమె పార్టీని బీజేపీకి బీ టీం అని అనుకున్నారు. ఇపుడు చూస్తే షర్మిల అడుగులు కాంగ్రెస్ వైపు సాగుతున్నాయని అంటున్నారు. లేకపోతే కేవలం నెల రోజుల వ్యవధిలో రెండవసారి కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ని కలవడం అంటే ఎలా ఆర్ధం చేసుకోవాలి. మొదటి సారి కలసినపుడు ఒక సందర్భం ఉంది.

కాంగ్రెస్ కర్నాటకలో గెలిచింది కాబట్టి అభినందించడానికి అన్నట్లుగా అని అనుకున్నారు. కానీ రెండవ సారి మళ్ళీ డీకే శివ కుమార్ తో భేటీ అంటే తెర వెనక ఏదో జరుగుతోంది అని అంతా భావిస్తున్నారు. తెలంగాణాలో మరో అయిదు నెలలలో ఎన్నికలు ఉన్నాయి. కాంగ్రెస్ తప్పనిసరిగా ఈసారి గెలవాలి. లేకపోతే చరిత్ర పుటలలో చూసుకుకోవడమే అంటున్నారు.

దాంతో కర్నాటకలో కాంగ్రెస్ గెలిచిన ఊపుతో తెలంగాణాను కూడా గెలుచుకోవాలని చూస్తోంది. దాంతో వైఎస్సార్ తనయ షర్మిల ఏమైనా ఉపయోగపడతారా అన్న చర్చ ఆ పార్టీలో ఉంది అని అంటున్నారు. ఏకంగా ప్రియాంకా గాంధీ నుంచే ఫోన్ కాల్ షర్మిలకు వచ్చిందని అంటున్నారు. ఆమెను కాంగ్రెస్ లో చేర్చుకుని తెలంగాణా ఏపీ లలో పార్టీని ఎంతో కొంత బలపరచుకోవాలని ఉంది అని అంటున్నారు.

అయితే షర్మిలకు తెలంగాణా కాంగ్రెస్ నాయకులతో ఏ మాత్రం పడదు, ఆమె ఏకంగా పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని పట్టుకుని కామెంట్స్ చేస్తూ ఉంటారు. అదే ఊపుతో సోనియా గాంధీ పుట్టు పూర్వోత్తరాలను కూడా బయట పెడుతూంటారు. ఆమెది ఇటలీ కాదా అంటూ ఇటీవల రేవంత్ రెడ్డికి గట్టిగా డోస్ ఇచ్చాననుకున్న షర్మిల ఆ కోపంలో సోనియా గాంధీనే అనేశారు అని కాంగ్రెస్ నేతలు మండిపోతున్నారు.

ఈ పరిణామాల నేపధ్యంలో ఆమె డీకే తో వరస భేటీలు వేయడం దేనికి అన్న చర్చ సాగుతోంది. అయితే కాంగ్రెస్ విలీనం లేదు, మాకు తెలంగాణాలో నలభై సీట్లకు పైగా చూస్తే బలం ఉందని చెప్పుకుంటున్న షర్మిల ఇపుడు అదే కాంగ్రెస్ చుట్టూ తిరుగుతున్నారని అంటున్నారు.

ఆమెకు సొంతంగా పోటీ చేసేందుకు కొంత బెరుకు ఉందని అంటున్నారు. బలమైన అధికార బీయారెస్ తో పాటు విపక్షంలో ఉన్న కాంగ్రెస్ బీజేపీలను ఢీ కొట్టడం కష్టం అన్న భావన ఉంది. అందుకే కాంగ్రెస్ నుంచి ఏ మాత్రం ఆఫర్ వచ్చినా పొత్తు అంటున్నట్లుగా తెలుస్తోంది. అయితే ముందు పొత్తు అనుకున్నా ఏతా వాతా అది చివరికి విలీనం అవుతుంది అని అంటున్నారు.

ఇదిలా ఉంటే షర్మిలను తెలంగాణా రాజకీయాల్లో స్టార్ కాంపెయినర్ గా వాడుకోవాలని కాంగ్రెస్ హై కమాండ్ ఆలోచన ఉందని అంటున్నారు. ఎందుకంటే ఆమె మూలాలు అన్నీ ఆంధ్రాలోనే ఉన్నాయి. బీయారెస్ దాన్ని చూపించి మరోమారు తెలంగాణా వాదాన్ని లేవనెత్తితే ఇబ్బంది అవుతుందన్నది కాంగ్రెస్ పెద్దల మాట. అందుకే ఆమె సేవలను తెలంగాణాలో వాడుకుని ఆమెకు ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు అప్పగిస్తే రెండిందాల న్యాయం జరిగినట్లుగా ఉంటుందని ఆలోచిస్తున్నారు.

అయితే షర్మిల మాత్రం ఖమ్మం ఎంపీ సీటు ఇస్తే ఏమైనా ఆలోచించవచ్చు అని అంటున్నారు. అది అంత సులువు కాదనే అంటున్నారు. అక్కడ రేణుకా చౌదరి ఉన్నారు. అలాగే పొంగులేటి శ్రీనివాసరెడ్డిని తీసుకుని వద్దామని చూస్తున్నారు. అలా అయితే ఆయన ఎంపీ సీటునే కోరుకుంటారు.

మొత్తానికి చూస్తే షర్మిల తన డిమాండ్లు అయిన ప్రతిపాదనలు అయినా డీకే శివకుమార్ ముందు ఉంచారని అంటున్నారు. వాటిని ఆయన కాంగ్రెస్ హై కమాండ్ ముందు పెడతారు అని అంటున్నారు. మొత్తానికి కాంగ్రెస్ గూటికే షర్మిల అంటున్నారు. అదే జరిగితే కాంగ్రెస్ ని విమర్శిస్తూ నాడు అన్న వెంట ఏపీ మొత్తం తిరిగిన షర్మిల విశ్వసనీయత కూడా జనంలో ప్రశ్నార్ధకం అవుతుంది అని అంటున్నారు.