అంతమంది పాజిటివ్ అయ్యాక ఈ నిర్ణయమేంది షర్మిల?

Thu Apr 22 2021 12:00:01 GMT+0530 (IST)

Ys Sharmila Shocking Decision

చేతులు కాలాక ఆకులు పట్టుకోవటం తెలివైనోళ్లు చేసే పని కాదు. ఆవేశం.. అంతకు మించి మైలేజీ మోజులో పడిపోయిన వారు తరచూ తప్పులు చేస్తుంటారు. రాజకీయాల్లో ఇది తరచూ కనిపిస్తూ ఉంటుంది. తెలంగాణలో పార్టీ పెట్టాలని తహతహలాడుతున్న షర్మిలలో ఇది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఏళ్లకు ఏళ్లుగా ఉన్న తెలంగాణ నిరుద్యోగుల సమస్య మీదా.. ఉద్యోగాల నోటిఫికేషన్ మీదా ఎప్పుడూ పల్లెత్తు మాట అనని ఆమె.. ఇటీవల వారి వెతలకు కదిలిపోవటమే కాదు.. ఒకరోజు దీక్ష.. అనంతరం నిరాహార దీక్ష చేయటం తెలిసిందే.నిజానికి ఉద్యోగ సాధన కోసం షర్మిల షురూ చేసిన దీక్షపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఓవైపు కరోనా కేసులు పెరిగిపోతున్న వేళ.. ఈ దీక్షలేంది? అని ప్రశ్నించినోళ్లు లేకపోలేదు. అయినా వినని ఆమె.. తన పార్టీ ఇమేజ్ ను పెంచుకునే ప్లాన్ లో భాగంగా.. తన రోడ్ మ్యాప్ కు భిన్నమైన నిర్ణయాలు తీసుకోవటానికి ఇష్టపడలేదు. అయితే.. తాను చేసిన దీక్ష ఫలితం ఆశించినంతగా లేకపోవటం.. అదే సమయంలో విమర్శలు వెల్లువెత్తటంతో పాటు.. తనతో భాగస్వామ్యం అయిన వారిలో పలువురు కరోనా పాజిటివ్ బారిన పడటంతో ఆమె అలెర్టు అయ్యారు.

దీంతో.. పార్టీ కార్యాలయానికి సెలవు ప్రకటించి మూసి వేయటంతోపాటు.. కార్యకలాపాలకు తాత్కాలిక బ్రేక్ ఇచ్చారు. దీనికి కొనసాగింపుగా తాజాగా ఆమె మరో నిర్ణయాన్ని తీసుకున్నారు. సెకండ్ వేవ్ నేపథ్యంలో ఉద్యోగ సాధన రిలే నిరాహార దీక్షల్ని తాత్కాలికంగా వాయిదా వేసుకున్నట్లుగా షర్మిల పార్టీ కార్యాలయం పేర్కొంది. ప్రజల ఆరోగ్యాన్ని పరిగణలోకి తీసుకొని బాధ్యత కలిగిన నాయకురాలిగా కొలువుల సాధన దీక్షలను తాత్కాలికంగా వాయిస్తా వేస్తామని.. తమ డిమాండ్ ను సాధించే వరకు పోరాటం చేస్తామని ఆమె పేర్కొన్నారు. అంతా బాగుంది కానీ.. దీక్ష చేసి అంతమందిని కరోనా బారిన పడేయటానికి ఇదే తెలివి ఉంటే బాగుండేది కదా షర్మిలమ్మ? అన్న సందేహాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు.