Begin typing your search above and press return to search.

జిగినీ దోస్తుకే జగన్ ఝలక్ ...?

By:  Tupaki Desk   |   5 Oct 2022 3:30 PM GMT
జిగినీ దోస్తుకే జగన్ ఝలక్ ...?
X
దోస్తు మేరా దోస్తు అన్నట్లుగా ఇద్దరూ కలసి చదువుకున్నారు. కలసి రాజకీయాల్లోకి వచ్చారు. ఇద్దరూ ఒకే జిల్లాకు చెందిన వారు. జగన్ కి కాంగ్రెస్ అధినాయకత్వం షాక్ ఇస్తే నాడు పక్కన ఉండి స్నేహితుడిని ఓదార్చి ఆయన వెంబడి ఉంటూ మంచి చెడులను పంచుకున్న వాడు ఆయన. అటువంటి జిగినీ దోస్తుకే ఝలక్ జగన్ ఇచ్చేశారు అన్న టాక్ అయితే నడుస్తోంది.

ఇంతకీ ఆ జిగినీ దోస్తు ఎవరు అంటే కడప జిల్లాకు చెందిన వైసీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి. ఆయన పుణ్యం ఏంటి అంటే జగన్ తో స్నేహం. ఆయన పాపం ఏంటి అంటే జగన్ జిల్లా వారు కావడం, పైగా జగన్ సామాజికవర్గం కావడం.

అందుకే అన్ని అర్హతలు ఉండి కూడా 2019 ఎన్నికల్లో ఏర్పడిన జగన్ తొలి క్యాబినేట్ లో మంత్రి కాలేకపోయారు. దానికి ఆయన నాడు బాధపడినా తన ప్రాణ స్నేహితుడు ముఖ్యమంత్రి అయ్యారు కదా అని సర్దుకుని అందులోనే తన ఆనందం చూసుకున్నారు. జగన్ ఆయనకు చీఫ్ విప్ పదవిని కట్టబెట్టారు. దాంతోనే ఆయన సంతృప్తి చెందారు. అయితే గిర్రున మూడేళ్ళు తిరిగేసరికి మలి విడత విస్తరణలో అయినా ఆయన మంత్రి అవుతారని అంతా అనుకున్నారు.

కానీ మంత్రి పదవి రాలేదు కదా ఉన్న పదవి ఊడింది. అదెలా అంటే ప్రభుత్వ చీఫ్ విప్ పదవిని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ముదునూరి ప్రసాదరాజుకు చీఫ్ విప్ పదవిని కట్టబెట్టిన జగన్ తన జిగినీ దోస్తుని తప్పుకోమన్నారు. దాంతో తీవ్ర మనస్థాపానికి శ్రీకాంత్ రెడ్డి గురి అయ్యారని అంతా అంటున్నారు. తనకు మంత్రి పదవి న్యాయంగా ఇవ్వాలి. పోనీ అది లేదు కాదు అనుకుంటే ఉన్న పదవి అయినా కంటిన్యూ చేయాలి.

కానీ ఏదీ లేకుండా మాజీని చేయడం బాధాకరమే అని అంతా అనుకునే పరిస్థితి. పోనీ ఈ విధంగా మాజీగా అయినా ఉండనిచ్చారా అంటే అది కూడా కాదుట. ఇపుడు ఏదో అర్జంటుగా స్నేహితుడికి అన్యాయం జరిగిపోయింది దాన్ని సరిదిద్దాలన్నట్లుగా విప్ పదవి ఒకటి జగన్ ఇచ్చారని అంటున్నారు. ఈ విప్ పదవి అంటే నిన్నటిదాకా చేసిన చీఫ్ విప్ కంటే చాలా చిన్నది. అంటే మంత్రిగా ప్రమోషన్ లేదు అని కుములుతూంటే డిమోషన్ ఇచ్చి జగన్ దోస్తుకు న్యాయం చేశానని అనుకుంటున్నారా అన్న చర్చ అయితే సాగుతోంది.

మరి ఇలా అయితే ఎలా అనే అంతా అంటున్నారు. తనకు తోడున్న వారిని కష్టాలలో వెంట ఉన్న వారిని ఆదుకోవడం వైఎస్సార్ నైజం. ఆ విషయంలో ఆయన రాజకీయంగా మూల్యం చెల్లించుకున్నా సరే అడుగు ముందుకే వేసేవారు.

కానీ జగన్ మాత్రం సామాజిక సమీకరణలు ఇతర లెక్కలు రాజకీయ లాభాలను బేరీజు వేసుకుని తనను నమ్ముకున్న వారిని, తనకు అండగా ఉన్న వారిని సైతం పక్కన పెడుతున్నారా అన్న మధనం అయితే వైసీపీలో గట్టిగానే సాగుతోందిట. మరి దీని మీద ఏమైనా వైసీపీ పెద్దలు పునరాలోచన చేస్తారా లేక జిగినీ దోస్తు కాబట్టి కాసింత కలతపడినా సర్దుకుని పోతారా అని అన్నదే ఇక్కడ పాయింట్ అంటున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.