Begin typing your search above and press return to search.

ఏది నిజం : జగన్ లో భయం... బాబులో ఫస్ట్రేషన్...?

By:  Tupaki Desk   |   15 May 2022 7:30 AM GMT
ఏది నిజం : జగన్ లో భయం... బాబులో ఫస్ట్రేషన్...?
X
ఏపీ రాజకీయాల్లో ఆ ఇద్దరూ కీలక నాయకులు. ఒకరు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. రెండవ వారు విపక్ష నేత చంద్రబాబు. ఇదిలా ఉంటే టీడీపీ సహా విపక్షాలు అన్నీ కూడా ఒకే ఒక మాట అంటున్నాయి. జగన్ లో భయం ఫస్ట్ టైమ్ కనిపిస్తోందన్నది వారి మాట. మూడేళ్ల క్రితం నాటి జోష్ జగన్ లో లేదని వారు విశ్లేషిస్తున్నారు.

అందుకే జగన్ తరచూ బహిరంగ సభల్లో విపక్షం మీద విరుచుకుపడుతున్నారు అని అంటున్నారు. ఆయన మాటల వెనక భయం, తిరిగి అధికారంలోకి రామన్న బెంగ స్పష్టంగా కనిపిస్తున్నాయని టీడీపీ నేతలు అంటున్నారు. ఇక జగన్ తరచూ దుష్ట చతుష్టయం అంటూ బాబుతో పాటు కొందరు మీడియా వ్యక్తులను కూడా లాగి విమర్శలు చేయడాన్ని కూడా తప్పుపడుతున్నారు.

ఉన్నది ఉన్నట్లుగా మీడియాలో రాతలు రాస్తే జగన్ కి ఉలుకు ఎందుకో అర్ధం కావడం లేదని కూడా అంటున్నారు. జగన్ తన పాలనలో ఏమీ చేయలేక ఏపీని ఇబ్బందుల్లోకి నెట్టారని, ఇపుడు విపక్షాలు వీటి మీద జనాలకు వాస్తవాలు చెబుతూంటే ఆయన తట్టుకోలేకపోతున్నారు అని టీడీపీ నేతలు అంటున్నారు. మొత్తానికి టీడీపీ నేతలు అయినా వారికి వత్తాసు పలికే అనుకూల మీడియా అయినా తేల్చింది ఏంటి అంటే జగన్ కి బాగా భయం పట్టుకుందిట.

అది వారు జగన్ ముఖంలో నుంచి చూస్తున్నారుట. వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలవదు అని కూడా వారు జోస్యం చెబుతున్నారు. సరే జగన్ కి భయం అని విపక్షం అంటూంటే వైసీపీలోని సీనియర్ నాయకుడు శ్రీకాంత్ రెడ్డి అయితే చంద్రబాబుకు ఫస్ట్రేషన్ అని హాట్ కామెంట్స్ చేశారు. చంద్రబాబు అందుకే కుప్పంలో తన స్థాయికి తగని విమర్శలు చేస్తున్నారు అని శ్రీకాంత్ రెడ్డి అంటున్నారు.

కుప్పం సీటుని కూడా దక్కించుకోలేమన్న బాధ భయంతోనే చంద్రబాబు వైసీపీ సర్కార్ మీద ఇష్టం వచ్చినట్లుగా విమర్శలు చేస్తున్నారు అని శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు. బాబు మూడు రోజుల కుప్పం టూర్ కి జనాలే కరవు అయ్యారని కూడా ఆయన ఎద్దేవా చేశారు. మొత్తానికి రాష్టంలో గెలుపు సంగతి పక్కన పెడితే కుప్పంలో బాబు గెలుపే డౌట్ లో పడడమే ఫ్ర‌స్టేషన్ కి కారణం అని శ్రీకాంత్ రెడ్డి తేల్చేశారు.

మరి బాబులో ఆ స్థాయి ఫ్ర‌స్ట్రేషన్ ఉందా. ఎన్నో యుద్ధాల్లో ఆరితేరిన యోధుడు బాబు అలా అసహనానికి గురి అవుతున్నారా. ఏమో వైసీపీ విశ్లేషణ అది. ఇక జగన్ అంటేనే భయానికే భయం అంటారు. ఆయనలో ఎన్నడూ భయం అన్న భావానికి అర్ధం చూసి ఎరుగరు. అలాంటి జగన్ కి భయం అంటే నమ్ముతారా. మరి ఇది టీడీపీ చేస్తున్న ఆరోపణ. జగన్ లో భయం పట్టుకుంది అన్నది టీడీపీ విశ్లేషణ.

ఈ రెండు విమర్శలను చూసినపుడు పక్కా మైండ్ గేమ్ గానే చూడాలి. అటూ ఇటూ ఇద్దరు నాయకులు ఉన్నారు. వారు చాలా యుద్ధాలను చూశారు. ఇంకా చూస్తారు. ఈ మాత్రానే జగన్ భయపడినా బాబు ఫస్ట్రేషన్ కి గురి అయినా ఇంతదాకా వారి రాజకీయం రాదు కదా. సో ఇదంతా ప్రత్యర్ధుల రాజకీయ వ్యూహంలో భాగమే అనుకోవాలేమో.