యూట్యూబ్ కొత్త అప్డేట్.. ఈ సారి వీక్షకుల కోసం!

Thu Jun 17 2021 23:00:01 GMT+0530 (IST)

YouTube new update for viewers this time

డిజిటల్ ప్లాట్ ఫామ్ లో ప్రపంచంలోనే నెంబర్ వన్ స్థానం యూట్యూబ్ ది. ఇక్కడ ఎవరి సినిమాకు వారే హీరో. ఎవరి కంటెంట్ కు వారే దర్శకులు. ఇక ప్రేక్షకుడి విషయానికి వస్తే.. లక్షల ఛానళ్లు అతడి సొంతం. ఏది కావాలనుకుంటే అది చూసుకోవచ్చు. టీవీ ఛానళ్ల సంఖ్యలో లిమిట్ ఉంటుందిగానీ.. యూట్యూబ్ లో ఛానళ్లు అన్ లిమిటెడ్! అందుకే.. ఎదురే లేకుండా దూసుకెళ్తోందీ సోషల్ మీడియా దిగ్గజం.అయితే.. క్రియేటర్స్ కోసం తరచూ నిబంధనలు మారుస్తూ ఉంటుంది యూట్యూబ్ యాజమాన్యం. అందులో కొన్ని కొత్తవారికి అనువుగా ఉంటే.. మరికొన్ని ఇబ్బందిగా ఉంటాయి. అంతిమంగా క్వాలిటీ కంటెంట్ అందించడమే తమ లక్ష్యంగా చెబుతుంది యూట్యూబ్. ఇదే క్రమంలో తాజాగా జూన్ 14న మరో కొత్త అప్డేట్ తీసుకొచ్చింది. అయితే.. ఇది ప్రేక్షకుల కోసం!

అదేమంటే.. యూట్యూబ్ మస్ట్ హెడ్ (యూట్యూబ్ టాప్ పేజీ) కంటెంట్ కు ఉండాల్సిన అర్హతలను రిలీజ్ చేసింది. యూట్యూబ్ హోం పేజీలో కనిపించే యాడ్స్ విషయంలో కఠిన నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం ప్రకారం యూట్యూబ్ టాప్ పేజీలో గ్యాంబ్లింగ్ ఆల్కహాల్ పాలిటిక్స్ డ్రగ్స్ వంటి అంశాలతో ఉన్న యాడ్ లు ఇకపై కనిపించవు. యూట్యూబ్ ఓపెన్ చేయగానే కనిపించే ప్రకటనల ద్వారా గూగుల్ కు భారీగా ఆదాయం వస్తుంది. అయినప్పటికీ.. వీటిని తొలగించాలని నిర్ణయించింది.

ప్రేక్షకుల విషయంలో మరింత రెస్పాన్సిబిలిటీ చూపించాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు యూట్యూబ్ ప్రకటించింది. అదేవిధంగా.. యూజర్లను తప్పుదారి పట్టించే ప్రకటనలు అసత్య ప్రచారాలను కూడా అడ్డుకోనున్నట్టు తెలిపింది. యూట్యూబ్ వీడియోల విషయంలో కీలకంగా ఉండే థంబ్ నెయిల్ విషయంలోనూ కఠినంగా వ్యవహరించనున్నట్టు పేర్కొంది. తప్పుడు పోస్టర్ల వల్ల వీక్షకులకు ఇబ్బంది రావొద్దనే ఉద్దేశంతోనే ఇలాంటి చర్యలు తీసుకున్నట్టు స్పష్టం చేసింది.