Begin typing your search above and press return to search.

కోర్టు తీర్పులనే తప్పుపట్టారు.. ఇది కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కాదా?

By:  Tupaki Desk   |   28 May 2023 10:10 AM GMT
కోర్టు తీర్పులనే తప్పుపట్టారు.. ఇది కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కాదా?
X
వైఎస్ వివేకా హత్య కేసులో కొండను తవ్వి ఎలుకను పట్టుకున్న చందంగా సీబీఐ వ్యవహరిస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే హత్య చేశాను అని లైవ్ న్యూస్ చానెల్స్ లో చెప్పిన వారిని వదిలేసిన సీబీఐ.. అసలు సంబంధం లేదన్న వైఎస్ అవినాష్ రెడ్డిని వెంటాడుతుండడం.. వేధిస్తుండడమే ఇందుకు కారణంగా చెప్పొచ్చు. పైగా ఈ మధ్యన వైఎస్ వివేకా హత్య విషయం ముందు జగన్ కే తెలిసిందని పచ్చమీడియా రాయడం.. దాన్నే సీబీఐ అఫిడవిట్ లో పొందుపరచడంతో సీబీఐని ఈ ఎల్లో గ్యాంగ్ మేనేజ్ చేస్తోందన్న వైసీపీ ఆరోపణలకు బలం చేకూరినట్టైంది. తాజాగా హైకోర్టులోనూ సీబీఐకి చుక్కెదురైంది. వైఎస్ అవినాష్ విషయంలో సీబీఐని హైకోర్టు ఉతికి ఆరేసింది. సూటి ప్రశ్నలు సంధించింది. అసలు వీటికి సమాధానాలే సీబీఐ దగ్గర లేక మల్లగుల్లాలు పడింది. దీంతో ఈ కేసులో అన్యాయంగా వైఎస్ అవినాష్ రెడ్డిని సీబీఐ ఇరికిస్తోందన్న వాదనకు బలం చేకూరినట్టైంది.

వైఎస్ వివేకా హత్యను చేశానని ఆయన కారు డ్రైవర్ అప్పట్లో ఓ చానెల్ లైవ్ లో ఒప్పుకున్నాడు. మద్యం తాగి డబ్బులు ఇస్తే ఈ హత్య చేశామన్న వీడియో బయటకు వచ్చింది. ఈ కేసులో వైఎస్ వివేకా ఆస్తి తగాదాలు వెలుగుచూశాయి. రెండో భార్య షమీం.. ఆమె కొడుకుకు వైఎస్ వివేకా ఆస్తి దక్కకుండా కుటుంబంలో జరిగిన గొడవలు కూడా వెలుగుచూశాయి. వైఎస్ వివేకా రెండో భార్య, ఆస్తి చుట్టూ కూడా కేసు నడిచింది. కానీ ఇలాంటి కీలక విషయాలను సీబీఐ పట్టించుకోలేదు. విచారించలేదు. అసలు కేసుతో సంబంధం లేని వైఎస్ అవినాష్ నే టార్గెట్ చేసింది. రాజకీయ కోణంలోనే ఈ కేసును చూస్తే ప్రత్యర్థి చంద్రబాబు, పచ్చమీడియా ఆడినట్టే సీబీఐ ఆడుతున్నట్టుగా అర్థమవుతోంది..

ఇక పచ్చమీడియాకు పట్టపగ్గాలు లేకుండా పరిస్థితి తయారైంది. హైకోర్టు వైఎస్ అవినాష్ విషయంలో ఏమాత్రం వ్యతిరేకంగా తీర్పునిచ్చినా భూమి, ఆకాశం బద్దలైనట్టు ప్రచారం చేసే పచ్చ మీడియా నిన్న అవినాష్ కు అనుకూలంగా సీబీఐని పలు సూటి ప్రశ్నలు అడిగి తప్పుదోవపట్టించేలా విచారణ చేస్తోందని కడిగేసినా ఒక్క వార్త కూడా పచ్చమీడియా కవర్ చేయడం లేదు. పైగా హైకోర్టు, జడ్జి అమ్ముడుపోయారని తమ టీవీన్యూస్ లలో డిబేట్లు పెట్టి దుష్ప్రచారం చేస్తున్న దారుణాలు వెలుగుచూశాయి. ఈ వీడియోలు వైరల్ అయ్యాయి.

పచ్చ మీడియా స్టంట్లు మరోసారి వెలుగుచూశాయి. వాళ్ళకి అనుకూలంగా వస్తే న్యాయస్థానాలు నిజాయితీగా పనిచేస్తాయి.. అదే వ్యతిరేకంగా వస్తే న్యాయస్థానాలు మీద.. హై కోర్టు జెడ్జీల మీద ఆరోపణలు చేస్తుంటారు. ముఖ్యంగా ఏబీఎన్ వెంకట కృష్ణ "ది డిబేట్" కార్యక్రమంలో డబ్బు మూటలు తీసుకుని జడ్జ్ మెంట్లు ఇస్తున్నారు అంటూ న్యాయ స్థానాలు, జడ్జీల మీద బహిరంగ ఆరోపణలు చేయడం సంచలనమైంది. టీవీ చర్చలో మాజీ జడ్జి రామకృష్ణ, బీజేపీ నాయకులు విల్సన్ , ఎంపీ రఘు రామ కృష్ణలు కూర్చొని ఏకంగా వైఎస్ అవినాష్ కు అనుకూలంగా తీర్పునిచ్చిన న్యాయస్థానాలపైనే అనుమానాలు వ్యక్తం చేయడం దారుణంగా చెప్పొచ్చు. దీన్ని బట్టి ఇది వివేక హత్యపై చంద్రబాబు డైరెక్షన్ లో నడుపుతున్న పచ్చ మీడియా స్క్రిప్ట్ షో అని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.. ఈ విషయంలో న్యాయస్థానాలు స్పందించి వెంకటకృష్ణ సహా ఈ పచ్చ మీడియా జర్నలిస్టులపై చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.

- సీబీఐ న్యాయవాదికి హైకోర్టు సూటి ప్రశ్నలు

వైఎస్ అవినాష్ ను ఏ2 నిందితుడుగా చూపిస్తున్న సీబీఐని నిన్న హైకోర్టు కడిగేసింది. అవినాష్ కేసులో ఆధారాలు ఏవని నిలదీసింది. అవినాష్ ఇంట్లో ఉన్నారని ఎలా చెప్తున్నారు? అంటూ ప్రశ్నించింది. ఆధారాల సేకరణకు ఎందుకు ఆలస్యమయ్యిందన్న హైకోర్టు.. లోక్ సభ అభ్యర్ధిత్వం కోసమే వివేకా హత్య జరిగిందని ఎలా చెప్తున్నారు? అని ప్రశ్నల వర్షం కురిపించింది. లోక్ సభ అభ్యర్థిగా అవినాష్ ను అనధికారికంగా ముందే ప్రకటించారని మీ ఛార్జీషీట్లో చాలా మంది స్టేట్మెంట్లు ఉన్నాయి కదా? మరి ఇది రాజకీయ ప్రతీకార హత్య ఎలా అవుతుందంటూ నిలదీసింది. అవినాష్ అభ్యర్థిత్వాన్ని అందరూ సమర్ధించిన స్టేట్ మెంట్లు ఉన్నాయి కదా? అంటూ సీబీఐని దబాయించింది హైకోర్టు.

‘అవినాష్ ది చాలా బలమైన కుటుంబ నేపథ్యమని మీరే అంటున్నారని.. అలా అయితే 2017 ఎమ్మెల్సీ ఎన్నికలను మేనేజ్ చేసి ఉండొచ్చు కదా? వివేకాను చంపాల్సిన అవసరం ఏముందని’ సీబీఐకి హైకోర్టు ప్రశ్న వేసింది.

అవినాష్ ఫోన్ స్వాధీనం చేయకుండా నిద్ర పోతున్నారా? అంటూ సీబీఐని హైకోర్టు మందలించింది. ఇదంతా చూస్తుంటే సీబీఐ అనుమానాస్పదంగా వ్యవహరిస్తోంది అనిపిస్తోందని హైకోర్టు అనుమానాలు వ్యక్తం చేయడం గమనార్హం. దీంతో సీబీఐ ఎవరి ప్రోద్బలంతోనో వైఎస్ అవినాష్ ను కుట్ర పన్ని ఇరికించేస్తోందన్న వాదనకు బలం చేకూరుతోంది.