Begin typing your search above and press return to search.

ఏడాది తిరిగినా...ఉక్కు బాధ తీరలేదు

By:  Tupaki Desk   |   12 Feb 2022 7:23 AM GMT
ఏడాది  తిరిగినా...ఉక్కు బాధ తీరలేదు
X
విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ ఆనాడు ఏకంగా 32 మంది పోరాడి సాధించుకున్న ఘమైన కర్మాగారం ఇపుడు బలి పీఠం మీద ఉంది. ఒక విధంగా చెప్పాలీ అంటే ప్రైవేట్ పరం చేయడానికి కేంద్రం ఆసక్తి చూపుతూంటే అడ్డుకునే పరిస్థితి ఏ కోశానా కనిపించడం లేదు. ఈ నేపధ్యంలో క్యాలండర్ లో గిర్రున ఏడాది కాలం తిరిగింది. 2021 ఫిబ్రవరి 12వ తేదీన ఉక్కు కార్మికులు పోరాట బాట పట్టారు. అది లగాయితూ వారు అలా నేటివరకూ ఎక్కడా తగ్గక పోరాడుతూనే ఉన్నారు.

ఈ మధ్యలో ఎన్నోకీలకమైన పరిణామాలు జరిగాయి. అప్పట్లో విశాఖ కార్పోరేషన్ ఎన్నికలు ఉన్నాయి. దాంతో అధికార వైసీపీ, విపక్ష టీడీపీ సహా అంతా హడావుడి చేశాయి. అధికార వైసీపీ అయితే విజయసాయిరెడ్డి ఆద్వర్యంలో భారీ పాదయాత్ర చేసి తాము అండగా ఉంటామని చెప్పింది. ఇక టీడీపీ విశాఖ ప్రెసిడెంట్ పల్లా శ్రీనివాసరావు నిరాహారదీక్ష చేశారు. కార్పోరేషన్ ఎన్నికలు జరిగాయి. వైసీపీ రాజకీయంగా లాభపడింది. కార్పోరేషన్ లో అధికారాన్ని దక్కించుకుంది. ఇక టీడీపీకి కూడా ఎక్కువ నంబర్ లో సీట్లు వచ్చాయి.

ఆ తరువాత నుంచి ప్రధాన పార్టీలేవీ ఏ వైపు చూడలేదు అన్న విమర్శలు అయితే కార్మిక లోకంలో పూర్తిగా ఉంది. ఈ మధ్యలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వచ్చి ఉక్కు కార్మిక సంఘాలతో చర్చించారు. ఎట్టి పరిస్థితుల్లో ఉక్కు ప్రైవేట్ పరం కాకుండా ఆపుతామని అన్నారు. కానీ ఏడాది గడచినా ఆ శుభవార్త మాత్రం కార్మికుల చెవిన పడలేదు. అసెంబ్లీలో విశాఖ ఉక్కు ప్రైవేట్ ప‌రం చేయవద్దు అని తీర్మానం చేశారు. జగన్ కేంద్రానికి లేఖ రాశారు. అక్కడితో వైసీపీ సైలెంట్ అయిపోయింది.

ఇంకో వైపు టీడీపీ తరఫున ఉత్తరాంధ్రాకు చెందిన ఎంపీ రామ్మోహన్ నాయుడు అయితే పార్లమెంట్ లో ఈ సమస్యను ప్రస్థావించారు. కానీ కేంద్రం మాత్రం సరైన జవాబు చెప్పలేదు. విశాఖ ఉక్కు పోరాటం గల్లీ నుంచి ఢిల్లీ దాకా సాగింది. అయినా సరే కేంద్రం మాత్రం ఈ విషయంలో అడుగు వెనక్కి వేయలేదనే తాజా పరిణామాలు చెబుతున్నాయి.

ఇక ఈ మధ్యలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖ ఉక్కు మీద భారీ సభ నిర్వహించారు. అయితే ఆయన కూడా కేంద్రంలోని బీజేపీని విమర్శించకుండా వైసీపీ మీదనే బాణాలు ఎక్కుపెట్టడంతో ఆ మద్దతు కూడా అంతగా అక్కరకు రాలేదనే అంటున్నారు. ఈ నేపధ్యంలో విశాఖ ఉక్కుని ప్రైవేట్ పరం చేయవద్దు అంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ హై కోర్టులో కేసు దాఖలు చేశారు. న్యాయ పోరాటం ద్వారా ప్రైవేట్ కాకుండా అడ్డుకుంటామని ఆయన చెప్పుకొచ్చారు. కానీ విశాఖ ఉక్కు విషయంలో అనుకున్న ఊరట ఈ రోజుకీ దక్కలేదు.

ఈ నేపధ్యంలో ఏడాది పాటు విశాఖ ఉక్కు పోరాటాన్ని నడిపిన కార్మికులు తాము అలసిపోలేదు అని చెబుతున్నారు. రెండవ విడత పోరాటానికి రెడీగా ఉన్నామని అంటున్నారు. ఈ నెల 13న రెండవ విడతలో భాగంగా జైల్ భరో నిర్వహిస్తున్నారు. ఇక విశాఖలోని బీజేపీ ఆఫీస్ ముట్టడికి కూడా ఉద్యమ కారులు సిద్ధపడుతున్నారు. అలాగే మరోసారి ఢిల్లీ పోరాటాలకు కూడా రంగం సిద్ధం చేసుకుంటున్నారు.


ఇవన్నీ ఇలా ఉంటే టీడీపీ నేత నారా లోకేష్ ఉక్కు ఉద్యమానికి ఏడాది పూర్తి అయిన సందర్భంగా కార్మిక లోకానికి ఉద్యమాభినందన‌లు తెలియచేశారు. వైసీపీకి 22 మంది ఎంపీలు ఉన్నా కూడా విశాఖ ఉక్కు మీద నోరెత్తడంలేదని ఆయన ఘటుగానే విమర్శించారు. తాము మాత్రం ఉక్కు కార్మికుల పక్షాన ఉంటామని, వారికి న్యాయం జరిగేలా చూస్తామని పేర్కొన్నారు.

మొత్తానికి చూస్తే బంగారం లాంటి విశాఖ ఉక్కుని ప్రైవేట్ పరం చేయడానికి కేంద్రం సిద్ధపడుతున్నా రాజకీయంగా ఏపీలో ఏ ఒక్కరిలో పెద్దగా చలనం మాత్రం లేదనే చెప్పాలి. అందరినీ కలుపుకుని కేంద్రం వద్దకు వెళ్లాల్సిన అధికార వైసీపీ నిర్లిప్తత వైఖరి అవలంబించడం వల్లనే ఈ పరిస్థితి వచ్చింది అన్న వాదనా ఉంది.

అలాగే అధికార విపక్షాలు ఏ సమస్యను అయినా రాజకీయంగానే చూస్తున్నాయి. అసలు దోషులను వదిలేసి తమలో తాము విమర్శలు చేసుకోవడం వల్లనే విశాఖ ఉక్కు సెగ కేంద్రానికి ఈ రోజుకీ తాకడంలేదన్న విమర్శలూ ఉన్నాయి. ఏది ఎలా ఉన్నా విశాఖ ఉక్కు విషయంలో కేంద్రం మీద గట్టి వత్తిడి తేవడంతో ఏపీ రాజకీయం పూర్తిగా విఫలం అయింది అన్నది ఏడాది ఆందోళన సాక్షిగా స్పష్టమైన నిజం.