మెజార్టీ తక్కువ వస్తే.. ఓట్ల లెక్కింపులో అక్రమాలేనా?

Sat Mar 18 2023 09:44:46 GMT+0530 (India Standard Time)

Ycp leader comments on MLC election results

వైసీపీ నేత అన్నంతనేకొన్ని లక్షణాలు బై డిఫాల్ట్ అన్నట్లు ఉంటాయా? అన్న సందేహానికి గురి చేసేలా వ్యవహారశైలి ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అధికారంలో ఉన్న పార్టీ అన్న విషయాన్ని సైతం వదిలేసి.. తాము అనాల్సిన మాటను అనేసేందుకు అస్సలు వెనుకాడని తీరు తరచూ విస్మయానికి గురి చేస్తూ ఉంటుంది. ఎప్పుడూ తమ వెర్షనే తప్పించి.. మరింకేమీ పట్టనట్లుగా వ్యవహరించే వైసీపీ నేతల తీరుకు నిలువెత్తు రూపంగా తాజాగా జరుగుతున్న ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు వేళలోనూ అధికార పార్టీ అభ్యర్థి నోటి నుంచి వచ్చిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.ఏపీలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు రసవత్తరంగా మారాయి. ఏపీలో తమకు తిరుగులేదని.. తమను ప్రజలు నెత్తిన పెట్టుకొన్నారన్నట్లుగా మాట్లాడే వైసీపీ నేతలకు.. తాజాగా వెలువడుతున్న పలితాలు చూసిన తర్వాత వాస్తవం బోధ పడే పరిస్థితి. తామెంత ప్రయత్నించినా.. తుది ఫలితాలు వారిని కంగారు పెట్టిస్తున్నాయి. పార్టీకి కంచుకోట లాంటి పశ్చిమ రాయలసీమలో తాజాగా జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వెలువడుతున్న ఫలితాలపై విస్మయం వ్యక్తమవుతోంది.
నువ్వా? నేనా? అన్నట్లుగా ఓట్లు అధికార - విపక్ష టీడీపీ మధ్య రావటంపై వైసీపీనేతల నోటి నుంచి మాటలు రాలేని పరిస్థితి నెలకొంది. కడప - అనంతపురం - కర్నూలు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు వేళ.. వైసీపీ అభ్యర్థి వెన్నపూస రవీంద్రారెడ్డి చిత్రమైన డిమాండ్ ను తెర మీదకు తీసుకొచ్చారు. ఎన్నికల కౌంటింగ్ ను తక్షణమే నిలిపివేయాలని ఆయన డిమాండ్ చేశారు.

ఎందుకిలా? అంటే.. తనకు వచ్చిన ఓట్లను టీడీపీ అభ్యర్థికి కలుపుతున్నట్లుగా ఆయన ఆరోపించారు. ఈ ఆరోపణపై పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడైనా.. ఏ రోజైనా అధికారంలో ఉన్న అధికార పార్టీకి కాకుండా విపక్షానికి అనుకూలంగా పని చేసే దమ్ము.. ధైర్యం అసలు ఉందంటారా? అని  ప్రశ్నిస్తున్నారు. అయినప్పటికీ.. వెనుకా ముందు ఆలోచించకుండా తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లు అన్న చందంగా వెన్నపూస వారి వ్యాఖ్యలు ఉన్నాయన్న మండిపాటు వ్యక్తమవుతోంది.

తాము అంచనా వేసిన రీతిలో ఓట్లు రాకుంటే మాత్రం.. ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారా? అని ప్రశ్నిస్తున్నారు. ఓటమి భయంతోనే ఇలాంటి వ్యాఖ్యలు అధికార పార్టీ అభ్యర్థి నోటి నుంచి వస్తున్నాయన్న మాట టీడీపీ నేతల నోటి నుంచి వినిపిస్తోంది. అయితే.. స్వల్ప అధిక్యతతో ఉన్న వైసీపీ అభ్యర్థి.. తనకు వస్తున్న ఓట్లపై షాకింగ్ లో ఉన్నారని చెబుతున్నారు. ఈ కారణంతోనే ఆయన నోటి నుంచి ఈ తరహా వ్యాఖ్యలు వస్తున్నాయన్న విమర్శ పలువురి నోట వినిపిస్తోంది.

అధికారపార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించి.. బతికి బట్టకట్టే అవకాశం ఉందా? అనిప్రశ్నిస్తున్నారు. మిగిలిన చోట్ల సంగతి ఎలా ఉన్నా.. ఏపీలో మాత్రం ఇలాంటివి అస్సలు సహించే పరిస్థితే ఉండదంటున్నారు. అయినప్పటికీ ఇలాంటి ఆరోపణలు చేయటం తమ మనో ధైర్యాన్ని దెబ్బ తీయటమేనని ఎన్నికల అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. ఏమైనా.. వెనుకా ముందు చూసుకోకుండా మాట అనేసే విషయంలో వైసీపీ వారి వ్యవహారశైలే వేరుగా ఉంటుందని చెబుతున్నారు. ఓట్ల మెజార్టీ తక్కువగా వస్తున్న వేళ.. ఇలాంటి వ్యాఖ్యలు వస్తున్నాయని.. అదే ఓటమి దిశగా అడుగులు పడితే మరెలాంటి వ్యాఖ్యలు వచ్చేవన్న మాట వినిపిస్తోంది. మొత్తంగా వైసీపీ ప్రజాప్రతినిదిగా గెలవక ముందే.. పార్టీకి ఏ తీరు నేత అవసరమో సరిగ్గా అలాంటి వ్యక్తే బరిలో ఉన్నారన్న అభిప్రాయం వ్యక్తం కావటం గమనార్హం


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.