సస్పెండెడ్ ఎమ్మెల్యే.. నిన్న సవాలు.. నేడు తీవ్ర అస్వస్థత

Fri Mar 31 2023 12:22:27 GMT+0530 (India Standard Time)

Nellore District Udayagiri MLA Mekapati Chandrasekhara Reddy

‘తల తెగి ఉదయగిరి ట్యాంకు బండ్లో పడినా తగ్గేదే లేదు. నన్ను ఉరికిస్తామని కొందరు చిల్లరగాళ్లు మాట్లాడుతున్నారు... మీరేమైనా బ్రిటీష్ సర్కారు రాజులా... ఇదేమైనా బ్రిటీష్  పాలనా..? ’ అని అంటూ సవాల్ చేసిన వైసీపీ సస్పెండెడ్ ఎమ్మెల్యే తీవ్ర అస్వస్ధతకు గురయ్యారు. వ్యక్తిగతంగానూ కొన్ని నెలలుగా ఆయన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పార్టీపరంగానూ సమస్యలు రావడంతో ఆయన ఆరోగ్యం కొంత ఇబ్బందికరంగా మారినట్లుగా కనిపిస్తోంది.ఈ నేపథ్యంలో ఏకంగా సస్పెన్షన్ కు గురికావడం.. దశాబ్దం పైగా ఉన్న అనుబంధం తెగిపోవడం.. సొంతంగా నిర్మించుకున్న క్యాడర్.. ఇలా అన్నివిధాలుగా నలిగిపోయారు. ఈ నేపథ్యంలోనే సవాళ్లు-ప్రతిసవాళ్లతో కొంత ఒత్తిడికీ గురైనట్టున్నారు. దీంతో శుక్రవారం అస్వస్థతకు గురయ్యారు.

గత ఏడాది అన్న కుమారుడు రాష్ట్ర మంత్రి గౌతమ్ రెడ్డి ఆకస్మిక మరణం ఆ తర్వాత వ్యక్తిగతంగా ఆరోపణలు ఇటీవల వైసీపీ నుంచి సస్పెన్షన్ కూ గురైన నెల్లూరు జిల్లా ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర రెడ్డి అస్వస్థత పాలయ్యారు. నెల్లూరు జిల్లా మర్రిపాడులోని తన నివాసంలో ఉండగా ఆయన గుండె నొప్పి వచ్చింది. వైద్యులు వచ్చి పరిశీలించారు. ఇంట్లోనే చికిత్స అందిస్తున్నారు.

మెరుగైన వైద్యం కోసం ఎమ్మెల్యేను చెన్నై తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా గత నెలలో చంద్రశేఖర రెడ్డికి గుండె పోటు వచ్చింది. రెండు వాల్వులు మూసుకుపోయిన్లుగా గుర్తించారు. అయితే చికిత్స అందించడంతో కోలుకున్నారు. మరోవైపు 2021 డిసెంబరులోనే ఆయనకు ఓసారి గుండె పోటు వచ్చింది. కర్ణాటక రాజధాని బెంగళూరులో సర్జరీ చేసి స్టంటు వేశారు.

మానసిక ఒత్తడితో..

వైసీపీ నుంచి బయటకు పంపడంతో చంద్రశేఖర్ రెడ్డి మీడియాకు ఎక్కి విమర్శలు చేస్తున్నారు. సీఎం జగన్ సలహాదారు సజ్జలను టార్గెట్ చేసుకున్నారు. అయితే నియోజకవర్గంలోనూ చంద్రశేఖర్ రెడ్డికి వ్యతిరేకంగా ఆందోళనలు సాగాయి. ఆయనను ఉదయగిరిలో అడుగుపెట్టనీయమంటూ సవాళ్లు వచ్చాయి. దీంతో గురువారం స్వయంగా ఉదయగిరి వచ్చి బస్టాండ్ సెంటర్లో కుర్చీ వేసుకుని కూర్చుకుని ప్రతి సవాల్ విసిరారు. ఈ పరిణామాలన్నిటి మధ్యలో చంద్రశేఖర్ రెడ్డి తీవ్ర మానసిక ఒత్తిడికీ గురైనట్లు కనిపిస్తోంది.

వ్యక్తిగతంగానూ..

ఇటీవల చంద్రశేఖర్ రెడ్డి తన తండ్రి అంటూ ఓ యువకుడు బయటకు వచ్చాడు. ఎమ్మెల్యే వివాహాలపైనా ఆరోపణలు ఉన్నాయి. ఇక పార్టీలో సైతం ప్రాధాన్యం పోయింది. దీనికిముందే ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డికి-వైసీపీ అధిష్ఠానానికీ అగాధం ఏర్పడింది. ఎమ్మెల్యే తన భార్యకూ టికెట్ అడిగారని సమాచారం. దీంతోనే ఆయనను పార్టీ పక్కనపెట్టాలని చూసినట్లుగా తెలిసింది.

కాగా ఈ క్రమంలోనే ఎమ్మెల్సీ ఎన్నికలు రావడం.. చంద్రశేఖర్ రెడ్డి పార్టీ అభ్యర్థికి ఓటేయలేదని తేలడంతో అధిష్ఠానం ఆయనను సస్పెండ్ చేసింది. అసలే అనారోగ్యం కుటుంబంలో విషాదంతో దెబ్బతిని ఉన్న చంద్రశేఖర్ రెడ్డికి తాజా ఘటనలు మరింత కలవరపాటుకు గురిచేసినట్లుగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.