Begin typing your search above and press return to search.

రాసుకోండి.. యండమూరి ఆర్థిక పాఠాలు

By:  Tupaki Desk   |   28 Jan 2020 1:30 AM GMT
రాసుకోండి.. యండమూరి ఆర్థిక పాఠాలు
X
తెలుగు రాష్ట్రాల్లోనే ప్రముఖ మానసిక నిపుణుడు, రచయితగా యండమూరి వీరేంద్రనాథ్ అందరికి చిరపరిచితమే.. ఆయన మానసిక పాఠాలు చెప్పడం మరిచి తాజాగా ఆర్థిక పాఠాలు చెప్పడం మొదలు పెట్టారు. ఆయన చెప్పే పాఠాలు, రాసే పుస్తకాలకు గిరాకీ తగ్గినట్టుంది. అందుకే తాజాగా ఏపీలో ఆర్థికంగా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న జగన్ సర్కారుకు యండమూరి ఆర్థికపాఠాలు బోధించడంపై అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు.

యండమూరి వీరేంద్రనాథ్ తాజాగా మాట్లాడుతూ.. ‘ఏపీకి రాబడి రూ.55వేల కోట్లుంటే.. కేవలం ఉచిత పథకాల అమలుకే రూ.50వేల కోట్ల మేర వ్యయం అవుతోందని.. మరి ఆర్థిక లోటు నుంచి కోలుకునేదెట్ట? మిగులు ఎక్కడి నుంచి వస్తుంది.. అప్పులకు వడ్డీ కట్టేందుకే అప్పులు చేస్తున్న పరిస్థితి ఆందోళనకరం’అని ప్రశ్నించారు. ఉచిత పథకాల అమలు ఇలాగే సాగితే రానున్న ఐదేళ్లలో ఆర్థిక రంగంలో పెను సునామీ సంభవించడం ఖాయమేనని యండమూరి హెచ్చరికలు సైతం జారీ చేశారు. కొత్త రాష్ట్ర పాలన బాధ్యతలు చేపట్టిన వైసీపీ.. ఉచిత పథకాల అమలుకు మరింత ప్రాధాన్యం ఇస్తోందని యండమూరి చెప్పుకొచ్చాడు.

ఇవి సరిపోనట్టు ఆర్థిక లెక్కలు కూడా తీశారు యండమూరి.. ఎఫ్.ఆర్.బీ.ఎం పరిమితి 3.5శాతం దాటిందని.. ఇది మనుగడకు ప్రమాదమని హెచ్చరించారు. వ్యయం తగ్గించుకోవాలని ఉచిత సలహాలు ఇచ్చేశారు.

మానసిక నిపుణుడు కాస్త ఆర్థిక వేత్త అవతారం ఎత్తడం.. జగన్ సర్కారును హెచ్చరించడం జరిగిపోయింది. ప్రజా సంక్షేమం కోసం కష్టపడుతున్న సీఎంకు నీ సలహాలు ఏమీ అక్కర్లేదని వైసీపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. బాబు చేసిన అప్పులను, తప్పులను జగన్ సరిదిద్దుతున్నారని.. దమ్ముంటే రాష్ట్రాన్ని ఇంతటి అప్పుల కూపంలోకి నెట్టిన చంద్రబాబును ఈ విషయంపై ప్రశ్నించాలని కోరుతున్నారు.