Begin typing your search above and press return to search.

ఆత్మ‌కూరులో వైఎస్సార్సీపీ ఘ‌న‌విజ‌యం

By:  Tupaki Desk   |   26 Jun 2022 7:24 AM GMT
ఆత్మ‌కూరులో వైఎస్సార్సీపీ ఘ‌న‌విజ‌యం
X
అంద‌రూ ఊహించిందే జ‌రిగింది. ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మ‌కూరు ఉప ఎన్నిక‌లో అధికార వైఎస్సార్సీపీ ఘ‌న విజ‌యం సాధించింది. వైఎస్సార్సీపీ త‌ర‌ఫున పోటీ చేసిన‌ మేకపాటి విక్రమ్ రెడ్డి విజ‌యాన్ని అందుకున్నారు. ఆయ‌న‌కు 82,742 ఓట్ల మెజార్టీ ల‌భించింది. విక్ర‌మ్ రెడ్డి త‌న‌ ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి భరత్ కుమార్‌పై గెలిచారు. అయితే ల‌క్ష‌కు పైగా మెజారిటీ వ‌స్తుంద‌ని వైఎస్సార్సీపీ ఆశ‌లు పెట్టుకోగా అవి నెర‌వేర‌లేదు.

జూన్ 26న ఆదివారం ఉదయం 8 గంటలకు ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. ఈ నేప‌థ్యంలో మొద‌టి రౌండ్ నుంచి కౌంటింగ్ పూర్తయ్యే వరకు ప్రతీ రౌండ్‌లోనూ వైఎస్సార్సీపీ అభ్య‌ర్థి విక్ర‌మ్ రెడ్డే ముందంజలో నిలిచారు. రౌండ్ రౌండ్ కు విక్రమ్ రెడ్డి మెజార్టీ భారీగా పెరుగుతూ వచ్చింది. మొత్తం 20 రౌండ్ల‌లో ఓట్ల లెక్కింపు చేప‌ట్టారు. ఉప ఎన్నిక పోలింగ్ లో మొత్తం 1,37,081 ఓట్లు పోలవగా విక్ర‌మ్ రెడ్డికి 82,742 ఓట్ల మెజార్టీ ల‌భించింది.

ఆత్మకూరు నియోజకవర్గం మొత్తం ఓటర్లు 2,13,338 కాగా.. ఈ నెల 23న జరిగిన పోలింగ్‌లో కేవలం 1,37,081 (64 శాతం) మంది ఓటర్లు మాత్రమే ఓటు వేశారు. పోస్టల్‌ బ్యాలెట్‌ సహా 20 రౌండ్ల ఓట్ల లెక్కింపు పూర్తి అయిన తర్వాత విక్రమ్‌రెడ్డి 1,02,074 ఓట్లను దక్కించుకున్నారు. తన ప్రత్యర్థి భాజపా అభ్యర్థి భరత్‌కుమార్‌ యాదవ్‌పై 82,742 ఓట్ల మెజారిటీతో ఆత్మకూరు ఉప ఎన్నికను విక్రమ్‌రెడ్డి కైవసం చేసుకున్నారు.

కాగా, ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మంత్రివ‌ర్గంలో ఐటీ, ప‌రిశ్ర‌మ‌లు, నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్న మేక‌పాటి గౌత‌మ్ రెడ్డి గుండెపోటుతో హ‌ఠాన్మ‌రణం చెందిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఆయ‌న సోద‌రుడు మేక‌పాటి విక్ర‌మ్ రెడ్డిని వైఎస్సార్సీపీ ఉప ఎన్నిక బ‌రిలో నిలిపింది. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షాలు టీడీపీ, జ‌న‌సేన ఈ ఉప ఎన్నిక‌కు దూరంగా ఉన్నాయి. బీజేపీ మాత్రం పోటీ చేస్తామ‌ని చెప్పి.. భ‌ర‌త్ కుమార్ యాద‌వ్ ను బ‌రిలో నిలిపింది.

మారిన రాజ‌కీయ ప‌రిస్థితుల నేప‌థ్యంలో అధికార వైఎస్సార్సీపీ ఈ ఎన్నిక‌ను ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుంది. గ్రామానికో ఎమ్మెల్యేని, మండ‌లానికో మంత్రిని పెట్టి ఆ నియోజ‌క‌వ‌ర్గంలో ముమ్మ‌ర ప్ర‌చారం నిర్వ‌హించింది. ఓటర్ల‌కు డ‌బ్బులు కూడా పంపిణీ చేశార‌ని ప్ర‌ధాన మీడియాలో వార్త‌లు కూడా వ‌చ్చాయి. ఆ పార్టీ ఊహించిన‌ట్టుగానే భారీ విజ‌యం ద‌క్కింది.