వినుకొండలో వైసీపీ రాజకీయం.. ఎవరికీ అర్ధం కావట్లేదా?

Tue Aug 16 2022 09:40:27 GMT+0530 (IST)

YSRCP Politics in Vinukonda

పైకి అక్కడ అంతా బాగున్నట్టుగానే కనిపిస్తోంది. కానీ.. లోలోన మాత్రం నాయకులకు నిద్ర పట్టడం లేదు. ముఖ్యంగా.. వైసీపీ ఎమ్మెల్యేకు అయితే.. అస్సలు తీవ్రకలతగా ఉంటోందట. ఇదే ఇప్పుడు అధికార పార్టీలో హాట్ టాపిక్గా మారిపోయింది. ఇంతకీ నియోజకవర్గం ఏంటంటే.. ప్రస్తుతం పల్నాడు జిల్లాలో ఉన్న వినుకొండ నియోజకవర్గం. ఇక్కడ నుంచి అతి కష్టం మీద.. బొల్లా బ్రహ్మనాయుడు విజయం సాధించారు. గత ఎన్నికలకు ముందు.. వరుసగా మూడు సార్లు విజయం దక్కించుకున్న టీడీపీ సీనియర్ నాయకుడు.. జీవీ ఆంజనేయులపై విజయం దక్కించుకున్నారు.నిజానికి జీవీ ఓటమికి.. కేవలం జగన్ హవా.. ఆయన ఇచ్చిన హామీలే కారణం తప్ప.. ఎమ్మెల్యేగా.. జీవీపై ఉన్న వ్యతిరేకత మాత్రం కారణం కాదు. అయితే.. ఈ విషయాన్ని గ్రహించడంలో ఎక్కడో బొల్లా వెనుకబడి పోయారనేది వాస్తవం. దీంతో మాజీ ఎమ్మెల్యేపై ఉన్న వ్యతిరేకతే తనను గెలిపించిందనేది ఆయన భావన. దీంతో ఆయన తనకు తిరుగులేదు.. ఎదురు లేదు.. అనుకునే విధంగా వ్యవహరిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. నియోజకవర్గంలో అంతా తానే అయి పెత్తనం చేస్తున్నారు. తనకు నచ్చిన వారిని ఒక విధంగా.. నచ్చకపోతే మరో విధంగా వేధిస్తున్నారని.. సొంత పార్టీలోనే చర్చ సాగుతోంది.

ఇది ఎమ్మెల్యే బొల్లాకు చాపకింద నీరులాగా సెగ పెడుతోంది. ప్రస్తుతం ఆయన ఈ విషయాన్ని గ్రహించారో.. లేక.. టీడీపీ నేత.. మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు .. దూకుడుగా ఉన్నారని.. తెలుసుకున్నరో తెలియదు కానీ.. గడప గడపకు కార్యక్రమం కింద.. నియోజకవర్గంలో తిరుగుతున్నారు. అయితే.. ఇక్కడ ఆయనకు సొంత పార్టీ నేతల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవు తోంది.

ఎవరూ ఆయనకు సహకరించడం లేదు. ఎవరూ కూడా ఆయనను అనుసరించడం లేదు. దీంతో కార్యకర్తలకు ఫోన్లపై ఫోన్లు చేసి.. మరీ తన పర్యటనకు తీసుకువచ్చే పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు.

ఇక ప్రజల్లోనూ బొల్లా విషయంలో పాజిటివిటీ ఏమీ కనిపించడం లేదు. ఆయనకు ఓటేసినట్టుచెప్పుకొనే వారు కూడా ఇప్పుడు ఆయన వెంట కనిపించడం లేదని.. వైసీపీలోనే ప్రచారం జరుగుతోంది. మరోవైపు.. టీడీపీ నేత.. మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు దూకుడు పెంచారు. ఇంటింటికీ తిరుగుతున్నారు. ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారు. అప్పటికప్పుడు.. తనకు సాధ్యమైతే.. వెంటనే ఆయా సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు.

అదే సమయంలో తనకు పరిచయం ఉన్న అధికారులతోనూ.. ఆయన సమస్యలపై చర్చించి.. పరిష్కార మార్గం చూపిస్తున్నారు. ఈ పరిణామాలు బొల్లాకు మింగుడు పడడం లేదు. పైకి అంతా బాగానే ఉందని అనుకుంటున్నా.. అనిపిస్తున్నా.. లోలోన మాత్రం వచ్చే ఎన్నికల్లో గెలుపుపై ఆయనకు బెంగ పట్టుకుందని అంటున్నారు పరిశీలకులు. మరి. చివరకు ఏం చేస్తారో చూడాలి.