ఒరిజినల్ వీడియో ఉందిట...ఇంతకీ ఎంపీ మాధవ్ చెప్పేదేంటి...?

Sun Aug 14 2022 15:00:01 GMT+0530 (India Standard Time)

YSRCP MP Gorantla Madhav

వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ అంటే పూర్వాశ్రమంలో  పోలీస్ అధికారి ఆయన భాష కూడా అదే స్టైల్ లో ఉంటుంది. ఆయన మూడేళ్ల ఎంపీగా పనితీరు ఎలా ఉన్నా ఒక్క న్యూడ్ వీడియోతో దేశంలోనే ప్రాచుర్యంలోకి వచ్చారు.  గోరంట్ల మాధవ్ ది అని చెప్పబడుతున్న న్యూడ్ వీడియోతో తెలుగుదేశం పార్టీ రాజకీయ రచ్చ చేస్తోంది.ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ఫేక్ ది అని అనంతపురం ఎస్పీ ఫకీరప్ప చెప్పాక టీడీపీ కూడా అంతే పంతంగా దాని మీద పోరాడుతోంది. ఒక వైపు దేశంలోని కీలక వ్యవస్థలకు గోరంట్ల మాధవ్ ఉదంతం మీద లేఖలు రాస్తూనే మరో వైపు అది ఒరిజినల్ వీడియో అని కూడా అంటోంది. దీని మీద టీడీపీ నేత పట్టాభి అయితే అమెరికాలోని ఫోరెన్సిక్ ల్యాబ్ లో టెస్ట్ చేయించామని అది ఒరిజినల్ వీడియో అని తేలిందని అంటున్నారు.

ఇక ఈ వివాదం అంతా అయ్యాక తొలిసారి తన కర్నూల్ వచ్చిన మాధవ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ఒక సంచలన విషయం చెప్పారు. ఒరిజినల్ వీడియో ఉంది అని ఆయన చెప్పడమే ఇక్కడ విశేషం. తన వద్ద ఒరిజినల్ వీడియో ఉందని ఆయన చెప్పి షాక్ తినిపించారు. అంటే ఆయన చెబుతున్న వీడియోలో ఏముంది అన్న ఆసక్తి కూడా అందరిలో కలుగుతోంది. అదే టైమ్ లో పోలీసులు అడిగితే తన ఫోన్ ని ఇస్తాను అని కూడా మాధవ్ చెప్పడం విశేషం.

టీడీపీ నేతలు కుట్ర పూరితంగా ఫేక్ వీడియోని సృష్టించారు అని మాధవ్ అంటున్నారు. ఫేక్ వీడియోలతో బీసీ నేతల రాజకీయ భవిష్యత్తుని చంపుతున్నారని ఆయన ఆరోపించారు. మొత్తానికి మాధవ్ మాటలలోనే తీసుకుంటే ఒరిజినల్ వీడియో అన్నది ఒకటి ఉంది. అది ఆయన దగ్గరే ఉంది. మరి పోలీసులు దాన్ని టెస్ట్ చేసి అసలు నిజాలు బయటకు తీయవచ్చు కదా అన్న డిమాండ్లు వస్తున్నాయి. మరి మాధవ్ కూడా తన ఫోన్ ఇస్తామని అంటున్నారు కాబట్టి పోలీసులు ఆ దిశగా అడుగులు వేస్తే మంచిదేమో. ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పడుతుంది అని అంటున్నారు.