తృటిలో తప్పించుకున్న జయమంగళ!

Fri Mar 24 2023 10:00:01 GMT+0530 (India Standard Time)

YSRCP MLC Jayamangalam

అదృష్టమంటే జయమంగళ వెంకట రమణదే. టీడీపీ నుంచి వైసీపీలో చేరీచేరగానే ఎమ్మెల్సీ అభ్యర్థిత్వం దక్కించుకున్నారు. 2011 నుంచి వైసీపీని నమ్ముకుని ఎంతో మంది పార్టీ నేతలు ఉన్నప్పటికీ వారిని కాదని వైసీపీ అధినేత జగన్.. జయమంగళ వెంకట రమణకు ఎమ్మెల్సీని ఆఫర్ చేశారు.కృష్ణా ఏలూరు జిల్లాల పరిధిలో నాలుగైదు నియోజకవర్గాల పరిధిలో చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉన్న వడ్డీలు సామాజికవర్గానికి చెందిన జయమంగళ వెంకట రమణను కులాల ఈక్వేషన్ తోనే జగన్ వైసీపీలోకి ఆహ్వానించిన సంగతి తెలిసిందే.

కాగా ఎమ్మెల్యేల కోటాలో జరిగిన ఏడు ఎమ్మెల్సీ స్థానాల్లో తొలుత జయమంగళ వెంకట రమణ ఓడిపోయినట్టు మీడియా కథనాలు పేర్కొన్నాయి. కోలా గురువులు జయమంగళ వెంకట రమణకు తొలి ప్రాధాన్యత ఓట్లు చెరో 21 ఓట్లు మాత్రమే వచ్చాయి. వీరికి ఓట్లు వేయాలని కేటాయించిన వైసీపీ ఎమ్మెల్యేల్లో ఇద్దరు టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధకు వేశారు. టీడీపీకి ఓటేసిన ఆ ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు కోలా గురువులకు జయమంగళ వెంకట రమణకు ఓటేసి ఉంటే 22 ఓట్ల చొప్పున వారికి వచ్చేవి. ఇద్దరూ గెలవడానికి ఆస్కారం ఉండేది.

కోలా గురువులుకు జయమంగళ వెంకట రమణకు కేటాయించిన వైసీపీ ఎమ్మెల్యేలు ఇద్దరు టీడీపీ అభ్యర్థికి ఓటేయడంతో వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిలిద్దరికీ 21 చొప్పున మాత్రమే ఓట్లు వచ్చాయి. దీంతో జయమంగళ వెంకట రమణ ఓడిపోయినట్టు తొలుత మీడియా కథనాలు పేర్కొన్నాయి. అయితే ద్వితీయ ప్రాధాన్యత ఓట్లు కోలా గురువులకు కంటే జయమంగళ వెంకట రమణకు ఎక్కువ రావడంతో ఆయన గెలుపొందినట్టు ఆ తర్వాత ప్రకటించారు. దీంతో కోలా గురువులు ఓడిపోక తప్పలేదు.

కాగా వైసీపీలో చేరిన రెండో రోజే ఎమ్మెల్సీ అభ్యర్థిగా చాన్సు దక్కించుకుని వైసీపీలోనే కొంతమంది నేతలు కుళ్లుకునే స్థాయికి చేరారు.. జయమంగళ వెంకట రమణ. పార్టీలో చేరినప్పుడు ఆయన టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు. తనతో డబ్బులు ఖర్చు పెట్టించి 2014లో కైకలూరులో ఎమ్మెల్యే సీటు ఇవ్వలేదని ఆరోపణలు చేశారు. చంద్రబాబు తీరుతో బెంజ్ కారులో తిరిగేవాడిని.. డొక్కు కారులో తిరిగే దుస్థితికి చేరుకున్నానన్నారు. చంద్రబాబు ఆయన సామాజికవర్గానికే చెందిన వ్యక్తికి కైకలూరు సీటు ఇవ్వడానికి నిర్ణయించారని.. తద్వారా తనకు అన్యాయం చేశారని సంచలన ఆరోపణలు చేశారు.

మరోవైపు జయమంగళ వెంకట రమణ తమ పార్టీలో చేరీచేరగానే వైసీపీ అధినేత జగన్ ఆయనకు ఎమ్మెల్సీ సీటు ఇవ్వడంపై వైసీపీలోనే అప్పట్లో అసంతృప్త జ్వాలలు రేగాయి. 2011లో వైసీపీ పార్టీ ఏర్పాటు నుంచి పార్టీ కోసం అహోరాత్రులు కష్టపడ్డవారిని గాలికొదిలి మొన్నగాక నిన్న పార్టీలోకి వచ్చిన జయమంగళ వెంకట రమణకు సీటు ఎలా ఇస్తారని అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఈ విషయంలో కృష్ణా జిల్లా పశ్చిమ గోదావరి ఏలూరు జిల్లా ఎమ్మెల్యేలు కొంత మంది ముఖ్య నేతలు సీఎం జగన్ వద్ద వైవీ సుబ్బారెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి వంటి నేతల వద్ద తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్టు వార్తలు వచ్చాయి.

 పశ్చిమ గోదావరి జిల్లాలో మేకా శేషుబాబు గుణ్ణం నాగబాబు ఎమ్మెల్సీ పదవులను ఆశించారు. వీరు ఎప్పటి నుంచో వైసీపీలో ఉంటూ పార్టీ కోసం కష్టపడుతున్నారని చెబుతున్నారు. అయితే వీరిని కాదని టీడీపీ నుంచి వైసీపీలో చేరిన కైకలూరు మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకట రమణకు సీటు కేటాయించడంపై శేషుబాబు నాగబాబు తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు అప్పట్లోనే వార్తలు వచ్చాయి. అలాగే కైకలూరు నియోజకవర్గంలో ఉన్న వైసీపీ నేతలు సైతం జగన్ నిర్ణయాన్ని తప్పుపట్టారు.

అయినా సరే కులాల లెక్కల్లో.. వడ్డీలు సామాజికవర్గం ఓట్లను కొల్లగొట్టాలనే ఉద్దేశంతో వైసీపీ అధినేత జగన్.. జయమంగళకు ఎమ్మెల్సీ సీటును కట్టబెట్టారు. అయితే జయమంగళ వెంకట రమణ కేవలం 21 ఓట్లే సాధించి ఎమ్మెల్సీ ఎన్నికల్లో తృటిలో ఓటమి నుంచి బయటపడ్డారు.