Begin typing your search above and press return to search.

వందల కోట్లుట : పుష్ప శ్రీవాణి ఆస్తుల మీద అత్తింటి సవాల్...?

By:  Tupaki Desk   |   27 Jun 2022 2:30 AM GMT
వందల కోట్లుట  : పుష్ప శ్రీవాణి ఆస్తుల మీద అత్తింటి సవాల్...?
X
రాజకీయాల్లోకి వచ్చాక ఆస్తులు సంపాదిస్తారు అని అంటారు. ఇది ఒక సహజ విమర్శ. అందరూ సంపాదించుకోలేరు. అలాగని సంపాదించేవారు లేరు అని కూడా చెప్పలేరు. అప్పటి పరిస్థితులు. వారి చాకచక్యం, అధికారం ఇచ్చిన అనుకూలత ఇలా చాలా కలసిరావాలి. ఇంతచేసినా నిజాయతీపరులు అయితే అక్రమ సంపాదనా మాట ఎక్కడ ఉంటుంది. అయితే ఉమ్మడి విజయనగరం జిల్లాకు చెందిన మాజీ ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి ఏకంగా 500 కోట్ల ఆస్తులు కలిగి ఉన్నారంటూ అత్తింటి వారు ఆరోపిస్తున్నారు. వారే టీడీపీలో చేరి ప్రత్యర్ధులుగా మారారు కూడా.

దీని మీద పుష్ప శ్రీవాణి పెదమామ, మాజీ మంత్రి టీడీపీ ఎమ్మెల్సీ అయిన శత్రుచర్ల విజయరామరాజు పుష్ప శ్రీవాణి 500 కోట్ల ఆస్తులు కలిగి ఉన్నట్లు రుజువు చేస్తాం ఆమె రాజకీయాల నుంచి తప్పుకుంటారా అని సవాల్ చేశారు. ఇక పుష్ప శ్రీవాణి రాజకీయం, వైసీపీ రాజకీయం రెండూ కురుపాం నియోజకవర్గంలో పరిసమాప్తం అయ్యాయని కూడా జోస్యం చెప్పేశారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ విజయం తధ్యమని విజయరామరాజు పేర్కొన్నారు. మా మీద చిటికలు వేస్తున్నారు కదా, రేపటి రోజున ఆ చిటికలే లేకుండా చేస్తామని ఆయన మండిపడుతున్నారు.

ఇక పుష్ప శ్రీవాణికి సొంత ఆడపడుచు, టీడీపీలో తాజాగా చేరిన పల్లవీరాజు కూడా వదిన గారి మీద ఒక్క లెక్కన ఫైర్ అవుతున్నారు. మా నాన్న శతృచర్ల చంద్రశేఖరరాజు పొలిటికల్ బ్రాండింగ్ మాది. ఆయన పేరు చెప్పుకుని పుష్ప శ్రీవాణి రాజకీయంగా ఎదిగారు అని నిప్పులు చెరిగారు. శతృచర్ల ఫ్యామిలీ బ్రాండింగ్ లేకుండా ఎన్నికలకు వెళ్ళి గెలవాలని సవాల్ చేశారు.

మొత్తానికి మూడు నెలల క్రితం మినిష్టర్ పదవి పోయింది. సొంత పార్టీలో విభేదాలు ఎటూ ఉన్నాయి. ఇపుడు అత్తింటి కుటుంబమే ఎదురు వచ్చి విమర్శలు చేస్తోంది. వచ్చే ఎన్నికల్లో కురుపాం నుంచి వదినా మరదళ్ళు రాజకీయ సమరాన తలబడనున్నారు. దాంతో పుష్ప శ్రీవాణి అక్రమంగా ఆస్తులు సంపాదించారు అంటూ అటు పెద మామ, ఇటు ఆడపడుచు ఇద్దరూ ఒక్క లెక్కన విమర్శలు చేస్తున్నారు.

ఈ పరిణామాలను పుష్ప శ్రీవాణి తట్టుకుని గట్టి జవాబు ఎలా ఇస్తుంది అన్నది చూడాలి. అయితే ఆమె మాత్రం 500 కోట్లు కాదు 5 కోట్లు తన దగ్గర ఉన్నా రుజువు చేస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటాను అని అంటున్నారు. మరి ఈ రుజువులూ సాక్ష్యాలు సవాళ్ళను చూసి తీర్పు ఇచ్చే పెద్ద మనిషి ఎవరు. 2024లో ఓటరన్నే దీనికి బదులు ఇవ్వాలేమో.