Begin typing your search above and press return to search.

వెంక‌ట‌గిరి వైసీపీలో ర‌గులుతున్న పోరు.. ఆనం క‌టౌట్‌కు నిప్పు!

By:  Tupaki Desk   |   29 Jan 2023 10:41 PM GMT
వెంక‌ట‌గిరి వైసీపీలో ర‌గులుతున్న పోరు.. ఆనం క‌టౌట్‌కు నిప్పు!
X
ఏపీ అధికార పార్టీ వైసీపీ అధిష్టానం తీసుకున్న నిర్ణ‌యం.. ఉమ్మ‌డి నెల్లూరు జిల్లాలోని వెంక‌ట‌గిరి నియోజ‌క‌వ‌ర్గంలో మంట‌లు రేపుతోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డిని పార్టీ నుంచి పంపేందుకు ప్ర‌య‌త్నిస్తున్నార‌నే గుస గుస వినిపిస్తున్న నేప‌థ్యంలో తాజాగా ఆయ‌న క‌టౌట్‌ను త‌గ‌ల బెట్ట‌డం వివాదాన్ని మ‌రింత రాజేసింది. వెంక‌ట‌గిరి నియోజ‌క వ‌ర్గంలోని ప్ర‌ధాన కూడ‌లి క్రాస్ రోడ్డు సెంట‌ర్‌లో ఆనం వ‌ర్గీయులు.. ఆయ‌న నిలువెత్తు కటౌట్‌ను ఏర్పాటు చేశారు.

అయితే.. దీనికి కొంద‌రు వ్య‌క్తులు త‌గ‌ల‌బెట్టారు. దీనిపై ఆనం వ‌ర్గీయులు భ‌గ్గుమ‌న్నారు. ఆనం క‌టౌట్‌ను త‌గ‌ల‌బెట్టిన ఘ‌ట‌న వెనుక ఇటీవ‌ల నియోజ‌క‌వ‌ర్గం ఇంచార్జ్‌గా బాధ్య‌త‌లు చేప‌ట్టిన నేదురుమ‌ల్లి రాంకుమార్ వ‌ర్గీయులు ఉన్నార‌ని అనుమానిస్తు న్నారు. దీంతో నేదురుమ‌ల్లికి వ్య‌తిరేకంగా ఆనం వ‌ర్గీయులు ఆందోళ‌న‌కు దిగారు. పెద్ద ఎత్తున నేదురుమ‌ల్లికి వ్య‌తిరేకంగా నినాదాలు చేశారు. దీంతో అలెర్ట‌యిన పోలీసులు భ‌ద్ర‌త‌ను క‌ట్టుదిట్టం చేశారు.

ఇదిలావుంటే, సొంత ఎమ్మెల్యే అయిన ఆనంపై వైసీపీ అధిష్టానం వరుస వేధింపులకు దిగుతోందని ఆయన వ‌ర్గీయులు నిప్పులు చెరుగుతున్నారు. వైసీపీలో ఆనం సీనియర్‌ నేత అయినప్పటికీ పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ తగిన ప్రాధాన్యత లేదని తొలి నుంచీ అసంతృప్తిగానే ఉంటున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో గత కొన్నాళ్లుగా ఆయ‌న పార్టీపైనా.. ప్ర‌భుత్వ తీరుపైనా విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు.

ఈ నేప‌థ్యంలో పార్టీ అధిష్టానం.. ఆనంకు షాక్ ఇస్తూ.. వెంక‌ట‌గిరి నియోజ‌క‌వ‌ర్గం  బాధ్య‌త‌ల‌ను రామ్‌కుమార్‌కు అప్ప‌గించింది. దీంతో పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ ప్రాధాన్యత పెరిగింది. దీంతో వ‌చ్చే ఎన్నికల నాటికి మ‌రింత ప‌ట్టుపెంచుకునే దిశ‌గా ఆనం వ‌ర్గంపై ఇటీవ‌ల నేదురుమ‌ల్లి రామ్‌కుమార్ బ‌హిరంగ విమ‌ర్శ‌లు చేశారు. ఆయ‌న‌ను గ‌డ‌ప‌గ‌డ‌పకు పాల్గొన వ‌ద్దంటూ..కూడా అధికారుల‌తో స‌మాచారం పంపించారు. `మీ సేవ‌ల‌కు ధ‌న్య‌వాదాలు` అంటూ అధికారులు ఆయ‌నకు స‌మాచారం ఇవ్వ‌డం తెలిసిందే. ఈ క్ర‌మంలో తాజాగా ఆనం క‌టౌట్‌కు నిప్పుపెట్ట‌డం వెంక‌ట‌గిరి రాజ‌కీయాల‌ను ఒక్క‌సారిగా భ‌గ్గుమ‌నేలా చేశాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.