నెల్లూరు జిల్లా రాజకీయాలు ఎప్పుడు విలక్షణం. అందులోనూ నెల్లూరు రెడ్లు ప్రత్యేకం. ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే కాకుండా దేశం మొత్తం మీద నెల్లూరు రెడ్లు వివిధ కాంట్రాక్టులు చేస్తూ ఉంటారు. కాంట్రాక్టులు మీద వందలు వేల కోట్ల రూపాయలు సంపాదించిన నెల్లూరు రెడ్లు ఆ తర్వాత రాజకీయాల్లోనూ ప్రవేశించారు. అటు టీడీపీ అయినా ఇటు వైసీపీ అయినా గతంలో కాంగ్రెస్ అయినా నెల్లూరు జిల్లాలో రెడ్లదే ఆధిపత్యం. ఏ పార్టీ అధికారంలో ఉన్నా చక్రం తిప్పేది కూడా వారే.
అలాగే నెల్లూరు జిల్లాలో ఆనం నేదురుమల్లి నల్లపురెడ్డి మేకపాటి కుటుంబాల ఆధిపత్యం నడిచింది.. నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఎవరైనా సరే ఈ కుటుంబాలను బాగా చూసుకుంటారు. అయితే సీఎం వైఎస్ జగన్ మాత్రం ఆనం కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకున్నారని అంటున్నారు. అయితే నేరుగా కాకుండా పరోక్షంగా దీన్ని చేస్తున్నారని అంటున్నారు.
ప్రస్తుతం నెల్లూరు వెంకటగిరి వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న ఆనం రామనారాయణరెడ్డి గత కొంత కాలం వైసీపీ ప్రభుత్వంపై అసంతృప్తితో కూడిన వ్యాఖ్యలు చేస్తున్నారు. నెల్లూరు జిల్లా రాజకీయాల్లో తమ కుటుంబానికి ఉన్న చరిత్ర సీనియర్ గా ఉన్న తనను మంత్రివర్గ విస్తరణలో పరిగణనలోకి తీసుకోకపోవడం పార్టీ కార్యక్రమాల విషయంలో తనను అంటీముట్టనట్టుగానే ఉంచడం ఇవన్నీ ఆనం రామనారాయణరెడ్డిలో అసంతృప్తికి కారణాలంటున్నారు.
ఈ నేపథ్యంలో ఆయన ఇటీవల కాలంలో చేస్తున్న వ్యాఖ్యలతో ఆనం రామనారాయణ రెడ్డిని వెంకటగిరి ఇంచార్జిగా తప్పించి నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డికి అప్పగించారు. ఈయన మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి కుమారుడు. చాలా కాలం వరకు రామ్ కుమార్ రెడ్డి విదేశాల్లో ఉన్నారు.
2019 ఎన్నికల ముందు వైసీపీలో చేరినా ఎక్కడా ఆయనకు సీటు దక్కలేదు. ఇప్పుడు ఆనం రామనారాయణరెడ్డిని వెంకటగిరి నుంచి తప్పించిన జగన్ ఆ పదవిని రామ్ కుమార్ రెడ్డికి కట్టబెట్టారు.
దీంతో నియోజకవర్గంలో అధికారులు ఇబ్బందిపెడుతున్నారు.. ఎలెక్టడ్ ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి మాట వినాలా లేక సెలెక్టడ్ ఇంచార్జి రామ్ కుమార్ రెడ్డి మాట వినాలో తెలియక తలలు పట్టుకుంటున్నారట.
మరోవైపు ప్రస్తుతం వైసీపీ.. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం పేరిట కార్యక్రమం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. దీని నుంచి కూడా ఆనంను పక్కనపెట్టారు. వైసీపీ అధిష్టానం ఈ విషయాన్ని ఆనం రామనారాయణరెడ్డికి నేరుగా చెప్పకుండా ఇప్పటిదాకా మీరు అందించిన సాయానికి కృతజ్ఞతలు అంటూ గ్రామ వార్డు సచివాలయాల శాఖ ద్వారా ఆయనకు తెలియజేసింది. అంటే ఇక నుంచి మీరు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొనాల్సిన అవసరం లేదంటూ ఆనంకు పరోక్షంగా చెప్పేసింది.
అలాగే ఆనంపై వేటు వేయకుండా ఆయనే పార్టీలో నుంచి పోయేటట్టు వైసీపీ అధిష్టానం వ్యవహరిస్తుందని అంటున్నారు. ఇందులో భాగంగా ఆనం రామనారాయణరెడ్డి భద్రతను కుదించిందని చెబుతున్నారు. ప్రస్తుతం ఆనంకు 2+2 సెక్యూరిటీ సిబ్బందితో భద్రత కల్పిస్తుండగా.. దాన్ని 1+1కు కుదించడం గమనార్హం. వాస్తవానికి ఈ 1+1 భద్రత టీడీపీ ప్రభుత్వ హయాంలోనే ఆనంకు ఉంది.
నెల్లూరు జిల్లా రాజకీయాల్లో ఆనం రామనారాయణరెడ్డికి పెద్దాయనగా పేరుంది. టీడీపీ కాంగ్రెస్ వైసీపీల నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన రికార్డు ఉంది. ఎన్టీఆర్ వైఎస్సార్ రోశయ్య కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గాల్లో ఆనం రామనారాయణరెడ్డి మంత్రిగా పనిచేశారు. ఒకానొక దశలో వైఎస్సార్ మరణించాక ముఖ్యమంత్రి పదవికి కూడా ఆనం పేరు వినిపించింది.
అలాంటి ఆనంను పక్కనపెట్టేలా వ్యవహరిస్తున్న వైసీపీ అధిష్టానంపై ప్రజల్లో విమర్శలు వ్యక్తమవుతున్నాయని అంటున్నారు. తాము ఆనంను ఎన్నుకుంటే.. సీఎం జగన్ం నేదురుమల్లి చేతిలో పెత్తనం పెట్టడమేంటని ప్రజల్లో చర్చ జరుగుతోందట. ఆనం చెప్పినదేదీ జరగకుండా నేదురుమల్లి వ్యవహరిస్తున్నారు. ఇటీవల నియోజకవర్గంలో ఆటల పోటీల విషయంలో ఇలాగే నేదురుమల్లి అడ్డం పడ్డారు. తాజాగా గౌరీపూజల విషయంలోనూ ఇద్దరి మధ్య బేధాభిప్రాయాలు నెలకొన్నాయని అంటున్నారు.
ఆనం తనంతట తానే పార్టీ నుంచి వెళ్లిపోయేలా వైసీపీ అధిష్టానం వ్యవహరిస్తుందని అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆనం ఎక్కడ పోటీ చేసినా ఎన్ని కోట్లు రూపాయలు ఖర్చయినా ఆయన్ను ఓడించాలని జగన్ ఆదేశించినట్లుగా గాసిప్స్ వినిపిస్తున్నాయి
అయితే జగన్ కోరిక నెరవేరడం అంత సులువు కాదు. ఆనం కుటుంబానికి ఆత్మకూరు నెల్లూరు సిటీ నెల్లూరు రూరల్ వెంకటగిరి ఉదయగిరి ఇలా పలు నియోజకవర్గాల్లో గట్టి అనుచరగణం పట్టు ఉంది. ఆనం గట్టిగా తలుచుకుంటే ఈ నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థులు గెలవడమే కష్టమనే అభిప్రాయాలున్నాయి. కొరివితో తలగోక్కున్నట్టు ఆనం కుటుంబంతో పెట్టుకుంటున్న వైసీపీ అధిష్టానానికి ఈసారి దిమ్మతిరగడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఆనం కూడా ఏమాత్రం తొందరపడటం లేదు. అధిష్టానం తనను ఎంతగా రెచ్చగొడుతున్నా నిదానంగా పావులు కదుపుతున్నారు. ఎన్నికల సమయంలో ఆయన టీడీపీ తీర్థం పుచ్చుకోవడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అందుకు తగ్గట్టే గుంభనంగా తన పనులు తాను చేసుకుపోతున్నారట. ఎన్నికలు వచ్చిన ప్పుడు ఆనం కుటుంబం అంటే ఏమిటో నెల్లూరు జిల్లాలో వైసీపీకి చూపించాలనే గట్టి పట్టుదలతో ఉన్నారని టాక్ నడుస్తోంది.